మిమ్స్‌ యాజమాన్య వైఖరితో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

Apr 10,2024 21:54

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలపై బుధవారం డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారి వద్ద జరిగిన చర్చలు యాజమాన్య వైఖరి కారణంగా అసంపూర్తిగా ముగిశాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ తెలిపారు. జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారి కార్యాలయంలో యాజమాన్యానికి , మిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌కు మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిరప నారాయణరావు, నాయకులు కె.రామనాగేశ్వరరావు, గౌరీ, నెల్లిమర్ల ఎంపిపి అంబల్ల శ్రీరాముల నాయుడు, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనుమల్ల వెంకటరమణ సమక్షంలో ఈ చర్చల్లో పాల్గొన్నారని తెలిపాపు. ఇంతకాలం యాజమాన్యం సిఐటియును చూపించి చర్చలను ఎగ్గొడుతూ వచ్చిందని, సిఐటియు నాయకత్వం తామంతా బయట ఉండి ఉద్యోగులతో మాట్లాడి సమస్యను పరిష్కరించమని కోరామని, అయినా యాజమాన్యం చర్చల మధ్యలో అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 24 మంది ఉద్యోగులు జైల్లో మగ్గిపోతుంటే, యాజమాన్యం మాత్రం కార్మిక చట్టాలను ఉల్లంఘించి వేతన ఒప్పందం ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ వైఖరిని మార్చుకొని కార్మికులందరికీ ఆమోద యోగ్యమైన ఒప్పందం చేయాలని, కార్మికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెతోపాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు నాయకులు ఎ.జగన్మోహన్‌రావు, బి.రమణ, పలువురు మిమ్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️