మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే ..

Dec 7,2023 11:42 #BJP MLA, #Madhya Pradesh

భోపాల్‌ :  ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 205 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదక గురువారం వెల్లడించింది. 2018లో కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్య 187గా ఉండగా, 2023 నాటికి ఈ సంఖ్య 205కి పెరిగిందని పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలలో 144 మంది బిజెకి చెందిన వారు కాగా, 61 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. . ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.11.77 కోట్లు.

మొత్తం 230 మందిలో 102 మంది ఎమ్మెల్యేలు రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 71 మంది ఎమ్మెల్యేలు రూ. 2 కోట్ల నుండి 5 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 48 మంది ఎమ్మెల్యేలు రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్లు మధ్య ఆస్తులను కలిగి ఉండగా, తొమ్మిది మంది రూ.50 లక్షల కన్నా తక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదిక ప్రకటించింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ రూ.134 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు. రత్లాం సిటీ నుండి నూతనంగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే చైతన్య కశ్యప్‌ రూ.296 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, ఆయన పార్టీ సహచరుడు సంజయ్  సత్యేంద్ర పాఠక్‌ (విజయ్‌రాఘవఘర్‌) రూ.242 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.

2018లో బిజెపి 109 స్థానాల్లో గెలుపొందగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 2018లో 114 సీట్లను గెలుచుకోగా, ప్రస్తుతం 66 సీట్లకు పరిమితమైంది. భరత్‌ ఆదివాసీ పార్టీ ఒక నియోజకవర్గంలో విజయం సాధించగలిగింది. భరత్‌ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కమలేష్‌ దోడియార్‌ రూ.18 లక్షల ఆస్తులతో అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో నిలిచారు. అత్యల్ప ఆస్తులు కలిగిన బిజెపి ఎమ్మెల్యేల్లో కంచన్‌ ముఖేష్‌ తన్వే రూ. 26 లక్షల ఆస్తులను కలిగి ఉండగా, సంతోష్‌ వర్కడే రూ. 25 లక్షల ఆస్తులను కలిగి ఉన్నారు.

అత్యధిక బకాయిలు ఉన్న అభ్యర్థుల్లో, బిజెపి మాజీ మంత్రి సురేంద్ర పట్వా (భోజ్‌పూర్‌) రూ. 57 కోట్ల అప్పును కలిగి ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన దినేష్‌ జైన్‌ (మహిద్‌పూర్‌) రూ.30 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బిజెపికి చెందిన భూపేంద్ర సింగ్‌ (ఖురారు) రూ.23 కోట్ల అప్పులతో మూడో స్థానంలో నిలిచినట్లు ఎడిఆర్‌ నివేదిక తెలిపింది.

➡️