పాక్‌ ఫలితాల వేళ ఇమ్రాన్‌ విక్టరీ స్పీచ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఏ పార్టీ విజయం సాధించిందో ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయలేదు. ఇమ్రాన్‌ఖాన్‌, నవాజ్‌ షరీఫ్‌ వీరిద్దరిలో ఎవరు మరోసారి ప్రధాని అవుతారు అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ఎఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్‌’ను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ప్రసంగంలో ఇమ్రాన్‌ నవాజ్‌ షరీఫ్‌ ‘లండన్‌ ప్లాన్‌’ విఫలమైందని అన్నారు. ఇక ప్రసంగంలో ఇమ్రాన్‌ ‘నా ప్రియమైన దేశ ప్రజలారా..ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం ద్వారా పౌరుల హక్కులను వినియోగించుకునే స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. ఎన్నికల్లో గెలుపొందడంలో మాకు సహాయపడినందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు ఓట్లు వేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల రోజున భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ కసరత్తులో మీరు చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్‌ ప్లాన్‌’ విఫలమైంది. నవాజ్‌ షరీఫ్‌ 30 సీట్లు వెనకబడి ఉన్నప్పటికీ ఆయన విక్టరీ స్పీచ్‌ ఇచ్చారు. ఆయన ఎంత తెలివి తక్కువగా ఆలోచించారో దీన్నిబట్టే తెలుస్తుంది.’ అని ఇమ్రాన్‌ తన వాయిస్‌ ఆడియో క్లిప్‌లో అన్నారు. ఈ ఎన్నికల్లో పిటిఐ పార్టీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా.. 266 స్థానాల్లో 82 స్థానాల్లో పిటిఐ ఆధిక్యంలో ఉన్నదని డాన్‌ న్యూస్‌ నివేదించిన అనధికారిక ఫలితాలు ప్రకారం తెలుస్తోంది. ఆ దేశంలో మరో పెద్ద పార్టీగా ఉన్న పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) 64 సీట్లు, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ పిపిపి 40 సీట్లతో తర్వాతి స్థానంలో ఉందని డాన్‌ నివేదిక తెలిపింది.

➡️