రూ.55 కోట్ల బాండ్లను బిజెపికి మళ్లించిన నవయుగ గ్రూప్‌

న్యూఢిల్లీ :    హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూప్‌ (నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లి.) రూ.55 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ మొత్తం కేంద్రంలోని పాలక బిజెపీ ఖాతాలోకి వెళ్లినట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా-బారాకోట్‌ టన్నెల్‌ కుప్పకూలి 16 రోజుల పాటు 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  మోడీ ప్రభుత్వపు చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగమే ఈ సిల్కియారా టన్నెల్‌.  ఈ టన్నెల్‌ నిర్మాణ బాధ్యతలను నవయుగ గ్రూప్‌ చేపట్టింది.   2020 మధ్యలో మోడీ ప్రభుత్వం రిషికేష్‌ -కర్ణప్రయాగ్‌ రైల్‌ లింక్‌ ప్రాజెక్టును కూడా నవయుగ కంపెనీకే కట్టబెట్టింది. పీర్‌పంజాల్‌ పాస్‌ ద్వారా ఉత్తర కాశ్మీర్‌కు కనెక్ట్‌ చేసే గంగానదిపై నిర్మించే పలు బ్రిడ్జీలతో పాటు క్వాజిగుండ్‌ టు బనిహాల్‌ హైవే నిర్మాణం ఈ సంస్థ చేతుల్లోనే పెట్టింది. 2017లో ప్రధాని ప్రారంభించిన బ్రహ్మపుత్ర నదిపై థోలా-సాడియా వంతెన నిర్మాణం కూడా చేపట్టింది. ప్రధాని మోడీ 2022 డిసెంబర్‌లో ప్రారంభించిన మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌ వే నాగ్‌పూర్‌-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వేను బాధ్యతలు కూడా చేపట్టింది.

ఐటి దాడులతో బెదిరింపులు

2018 అక్టోబర్‌ 26న ఆదాయపన్ను శాఖ (ఐటి)కి చెందిన 20 మంది అధికారులు నవయుగ గ్రూప్‌పై దాడులు చేపట్టారు.  ఐటి నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఐటి అధికారులు సోదాలు జరిపారు. ఆరు నెలల తర్వాత 2019, ఏప్రిల్‌ 18న నవయుగ సంస్థ రూ. 30 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది.

మరోవైపు 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. దీంతో అదే ఏడాది అక్టోబర్‌ 22న కంపెనీ మూడు ప్రాజెక్టులను కోల్పోయింది. వాటిలో ఒకటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పగించిన పోలవరం ప్రాజెక్టు ఒకటి. అక్టోబర్‌ 10, 2019లో నవయుగ మరోసారి 15 కోట్ల రూపాయిల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా బిజెపి ఖాతాలోకి చేరాయి.   2019అక్టోబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. 2022 అక్టోబర్‌ 10న రూ.పది కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా బిజెపి ఖాతాలోకి వెళ్లాయి.

మొత్తంగా 55 కోట్ల రూపాయిల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన నవయుగ గ్రూప్‌.. మొత్తాన్ని బిజెపి ఖాతాలోకి మళ్లించింది.

➡️