ప్రకృతి సోయగాలు.. పర్వతాలు..

Dec 11,2023 08:14 #Sneha

ప్రకృతి అందించిన అందాల్లో పర్వతాలు ప్రధానమైనవి.. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే వాటి ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. మొదటి తరం మానవుల నాగరికత, జీవన విధానం.. పర్వతాలు, నదుల ఉనికితోనే బయటపడ్డాయి. నీరు ఉన్నచోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అంటువంటి జీవనదులు పర్వతాల్లోనే పుట్టాయి. లోతట్టు ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్నాయి. కొన్ని తెగలవారు పర్వతాలనే నమ్ముకొని, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శీతాకాలపు సెలవలను పర్వతాల సందర్శనతో కుటుంబ సమేతంగా ఆస్వాదించవచ్చు. అనేక అరుదైన జాతులకు నిలయంగా ఉన్న పర్వతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశ పౌరులపై ఉంది. ఈ నెల 11న ‘అంతర్జాతీయ పర్వత దినోత్సవం (మౌంటెన్‌ డే)’ సందర్భంగా ప్రత్యేక కథనం.

                డిసెంబర్‌ నెల వచ్చిందంటే చలి పెరుగుతుంది. భూమిపై కన్నా.. ఎత్తయిన పర్వతాలపై ఎక్కువగా మంచు కురుస్తుంది. ఆకాశాన్ని ఎలాగైనా అందుకోవాలన్న వాటి ఎత్తు, చుట్టూ చెట్లు, అక్కడక్కడా వికసించిన అడవి పూల పరిమళాలు.. మధ్య మధ్యలో ప్రవహించే నీటి గలగలలు.. కలుషితంలేని గాలి.. మనసుకు ఎంతో ఆహ్లాదభరితంగా, చూపురులను కనివిందు చేస్తాయి. ఇటువంటి ప్రకృతి అందాలను కృత్రిమంగా సృష్టించలేము. మనిషి సృష్టిస్తున్న కాలుష్యం, విపత్తుల వల్ల పర్వాతాలకు ముప్పు ఏర్పడింది. పర్యవసానంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు తగ్గి, వేడిమి పెరుగుతోంది. ఈ ప్రభావం పర్వతాలపై పడుతున్నాయి. అందుకే ఈ పర్వత అందాలను, సంపదను కాపాడుకోవాలి.

కనీస వసతులు కరువు..

కొన్ని వందల ఏళ్లుగా పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా వెల్లివిరుస్తున్నాయి. పర్వతాలపై వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి, ఉద్యానవన పంటలకు, పశువుల పెంపకానికి అనువుగా ఉంటాయి. కానీ వాతావరణ మార్పులు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, మైనింగ్‌ పేరిట జరిగే విధ్వంసాలు, వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్కడ నివసించే పక్షుల కోసం సాగించే వేట, వంటివి జీవవైవిధ్యానికి సవాళ్లుగా మారాయి. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా డిసెంబర్‌ 11న మౌంటెన్‌ డే జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రపంచదేశాల ప్రభుత్వాలు ఈవెంట్లు, కచేరీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. పర్వతాలను పరిరక్షించుకోవాలని, పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా నిర్ణయాలు చేయడం ఆ రోజు ముఖ్య ఉద్దేశ్యం. కానీ ఏళ్లు గడుస్తున్నా పర్వతాలపై నివసిస్తున్న గిరిజనుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. విద్య, వైద్యంలో వెనకబడే ఉన్నారు. కనీస వసతులు సైతం నేటికీ లేకపోవడం దయనీయమైన విషయం. రవాణామార్గం లేకపోవడంతో.. సమయానికి వైద్యం అందక అనేకమంది చనిపోతున్నారు. గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. నొప్పులు వచ్చే సమయంలో ఇద్దరు మనుషులు డోలెలో వేసుకుని మోసుకుంటూ తీసుకెళతారు. అదే ఏ అర్ధరాత్రో అయితే అడవి జంతువులు ఏవైనా దాడి చేసే అవకాశమూ లేకపోలేదు. దానికి తోడు కరెంటు ఉండదు. రాత్రి అయిందంటే ఇళ్లల్లోనే గడపాల్సిన పరిస్థితి. వీధిలైట్ల సౌకర్యం అసలే ఉండదు. మరుగుదొడ్లు కనిపించవు. పిల్లలకు చదువు చెప్పేందుకు స్కూళ్లల్లో ఉపాధ్యాయులు కనిపించరు. అందుకే మామూలు జనంతో పోల్చుకుంటే వారి జీవితాలు ఎదురీతగానే ఉంటాయి. పెరుగుతున్న వాతావరణ వైవిధ్యం, పర్వత వ్యవసాయంలో పెట్టుబడి లేకపోవడం వల్ల పురుషులు తరచుగా ప్రత్యామ్నాయ జీవనోపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. గతంలో పురుషులు మాత్రమే చేసిన అనేక పనులను ఇప్పుడు మహిళలూ చేస్తున్నారు. వీరి పేదరికం వల్ల మహిళల్లో పోషకాహారలోపం అధికంగా ఉంది. దీంతో రక్తహీనతతో వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా సమయంలో ఆకలితో అలమటించిన కుటుంబాలు ఎన్నో. వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోగా, వీరి భూములను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే పనిలో ఉంది.

పండ్ల పంటల సాగు..

నీటి వనరులు ఉన్నప్పటికీ, విభిన్న వాతావరణం పర్వతాల్లో కనిపిస్తోంది. కొన్ని సమశీతోష్ణ, ఉప ఉష్ణమండల, ఉష్ణమండల పండ్ల పంటల సాగు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉసిరి, ఇతర పండ్ల పంటలైన ఖర్జూరం (ఫీనిక్స్‌ డాక్టిలిఫెరా) నిమ్మ, నేరేడు, మామిడి, కొబ్బరి, దానిమ్మ వంటి పండ్ల పంటలు విరివిగా పండుతాయి. పీచు, వాల్‌నట్‌, పామ్‌ పండ్లు కొన్ని ప్రాంతాల్లో పండుతాయి. ఆకురాల్చే పండ్ల పంటల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఒమన్‌లోని అల్‌ జబల్‌ అల్‌ అఖ్దర్‌ (నిజ్వా), వాడిమిస్టల్‌ (నఖల్‌) పర్వత ప్రాంతాల్లో దానిమ్మ పండ్లకు దేశంలో చాలా డిమాండ్‌ ఉంది. పర్వతాలు అనేక ఖనిజాలకు మూలం. జమ్మూకాశ్మీర్‌ ప్రాంతాల్లో యాపిల్‌, ఖర్జూరం, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల తోటలు, కాఫీ, కోకో, సుగంధ ద్రవ్యాలు పండుతాయి. మరిన్ని ఉత్పత్తుల ఉత్పత్తికి సమృద్ధిగా పర్వత ప్రాంతాలు నిలుస్తున్నాయి.

ఎత్తయిన శిఖరాలు..

మనదేశంలో ఎత్తయిన శిఖరాల్లో కాంచన్‌జంగా ఒకటి. ఇది మనకు, నేపాల్‌కు సరిహద్దు ప్రాంతంలో ఉంది. 8,586 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే మూడవ ఎత్తయిన శిఖరం. ఈ శిఖరం మనదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని గొప్ప హిమాలయ శ్రేణిలో భాగం. ఈ పర్వతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ పట్టణం అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నందాదేవి శిఖరం రెండవ ఎత్తయిన పర్వతం. గర్వాల్‌ హిమాలయ ప్రాంతంలో 7,816 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది అందమైన వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉంటుంది. దేశానికి రక్షణగా మరికొన్ని శిఖరాలు ఉన్నాయి.

రక్షణగా హిమాలయాలు..

మన దేశంలో హిమాలయాలు అనేక జీవనదులకు పుట్టినిల్లు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. అంతేకాదు విదేశాల నుంచి దేశానికి రక్షణ ఇస్తున్నాయి. పర్వతారోహకులు కూడా ఎక్కువ మక్కువ చూపేది ఇక్కడున్న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడంపైనే. ఇప్పుడు ఈ ప్రాంతం కాలుష్యంతో నిండిపోవడంతో ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. దీంతో భూమి వేడెక్కి, హిమనీ నదులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పర్వతాలలో ఉన్న మంచు కూడా కరిగి, ఆకస్మిక వరదలు వస్తున్నాయి. సుందర్‌లాల్‌ బహుగుణ వంటి పర్యావరణ ప్రేమికులు హిమాలయ పర్వతాలను రక్షించి, ప్రకృతి అందాలను కాపాడాలని ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపారు. కరోనా నేపథ్యంలో పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో పడి, గత రెండేళ్లుగా సందడి తగ్గింది. ఇక్కడ మరిన్ని వేసవి విడిది కేంద్రాలను ఏర్పాటు చేసి, పర్యాటకులకు తగిన సదుపాయాలు, భద్రత కల్పించాలి. వారి సంఖ్య పెరిగితే విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడే వాటిని రక్షించగలం. చాలామంది క్లీనింగ్‌ అండ్‌ గ్రీనింగ్‌ పేరుతో పర్వతాలపై ఉన్న ప్లాస్టిక్‌, చెత్తను తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలు మరింతగా కృషి చేయాలని ఆశిద్దాం. పర్వతాలను పరిరక్షించుకుందాం.

థ్రిల్‌గా ట్రెక్కింగ్‌..

పల్లెలను కప్పి వేస్తూ, తుపానులను ఎదుర్కొంటూ, అద్భుతమైన లోయల అందాలను ఆవహిస్తూ, హైకర్లు అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ, ఎత్తుగా నిలబడి ఉన్న ప్రకృతి యొక్క అత్యంత అందమైన భూభాగాలలో పర్వతాలు ఒకటి. వీటిని చూసేందుకు ప్రతి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ప్రకృతిని ఇష్టపడేవారు పర్వత ప్రాంతాలపై ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. ఇది మనసుకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పర్వతారోహకులు ఎక్కువగా ట్రెక్కింగ్‌ ఇష్టపడుతున్నారు. పర్యాటక సంస్థల వారు గ్రూపులుగా ట్రెక్కింగ్‌కి తీసుకుని వెళుతుంటారు. దారి మధ్యలో పచ్చని లోయలు, మెలికలు తిరుగుతున్న గాట్‌ రోడ్లు, మంచుతో కప్పబడిన శిఖరాలు, అక్కడక్కడ పచ్చని గ్రామాలు, మరెన్నో ప్రకృతి దృశ్యాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చీకటి పడినప్పుడు దారి మధ్యలో గుడారాలు వేసుకుని ఉండొచ్చు. వెంట తెచ్చుకున్న వంట సామాగ్రితో వండుకుని తినొచ్చు కూడా. ఆ అనుభవం మధురంగా.. రెండు, మూడు రోజులు నుంచి వారం రోజులు సాగుతుంది.

పద్మావతి 9490099006

➡️