ప్రకృతి సాగు సాకుఎరువులకు కేంద్రంకోత

Jan 11,2024 07:21 #farmers, #fertilizers
  • నేచురల్‌ అగ్రికల్చర్‌పై రాష్ట్రం నుంచి తప్పుడు సమాచారం
  • లేని విస్తీర్ణం ఉన్నట్లు బోగస్‌ వివరాలు
  • ఆ డేటా ఆధారంగా లక్షల టన్నులు కట్‌
  • అదనుకు రైతుకు దొరకని ఫెర్టిలైజర్స్‌
  • వ్యవసాయశాఖలో అంతర్మధనం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం సాకుతో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రసాయన ఎరువులకు కోత పెడుతోంది. ఎరువుల సరఫరా తగ్గిపోవడంతో రైతులకు అదనుకు అవసరమైన ఎరువులు దొరకట్లేదు. ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతున్న తప్పుడు సమాచారమే రైతుల కొంప ముంచుతోంది. లేని ప్రకృతి వ్యవసాయాన్ని ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది. ఇ-క్రాప్‌ బుకింగ్‌ సమయంలో ఉద్దేశపూర్వకంగా బోగస్‌ ఎంట్రీలతో ప్రకృతి సాగు విస్తీర్ణాన్ని రికార్డుల్లో పెంచడం వలన రాష్ట్రానికి అవసరమైన ఎరువులు రావట్లేదని వ్యవసాయశాఖ లోపల్లోపల మధన పడుతోంది. కోత లక్షల టన్నుల్లో ఉందని తెలుస్తోంది. లేని ప్రకృతి సాగు ఉన్నట్లు కలర్‌ ఇస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి హరికిరణ్‌ జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రకృతి వ్యవసాయ వివరాలను తప్పుగా నమోదు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

పెద్ద దందా

కేంద్ర బిజెపి ప్రభుత్వమే ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయాన్ని (జీరోబేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) ఉద్యమం మాదిరి ముందుకు తెచ్చింది. ఆవు ఆధారంగా ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేకంగా నిధులిస్తోంది. ఆవు మూత్రం, పేడతో తయారు చేసే జీవామృతాలు, కషాయాలు, ప్రకృతిలో దొరికే వస్తువులే పంటలకు ఎరువులుగా వేయాలి. రసాయన ఎరువులు వాడకూడదు. గత టిడిపి ప్రభుత్వంలో ఈ వ్యవహారం ముమ్మరంగా నడవగా, వైసిపి వచ్చాకా కొనసాగుతోంది. ఆర్గానిక్‌ మిల్క్‌, ఆర్గానిక్‌ ఉత్పత్తులకు మార్కెటింగ్‌, నాణ్యతా ప్రమా ణాల పరిశీలనకు ప్రత్యేక ల్యాబ్‌లు, బ్రాండ్‌లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అమితంగా ప్రోత్సహిస్తోంది. ఇదంతా కేంద్రం మెప్పు కోసమేనన్న వాదనలూ ఉన్నాయి. గత టిడిపి ప్రభుత్వంలో పని చేసిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారే ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయానికి అన్నీ తానై చూసుకుంటున్నారు. ఏడాదికి అన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం కిందికి తీసుకొచ్చామని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల అంతగా సానుకూలంగా లేరు. ప్రచారం చేసినంతగా విస్తీర్ణమేమీ పెరగలేదు. అదొక స్కామ్‌ అని ఆరోపణలొస్తున్నాయి.వాస్తవ విరుద్ధంప్రతి సీజన్‌లోనూ వ్యవసాయశాఖ ఇ-క్రాప్‌లో సాగులను నమోదు చేస్తోంది. అన్ని పథకాలకూ ఇ-క్రాప్‌ తప్పనిసరి చేసింది. ప్రకృతి వ్యవసాయానికి ఎంపిక చేసిన మండలాల్లో ప్రత్యేకంగా క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ (సిఆర్‌పి) పని చేస్తున్నారు. ఇ-క్రాప్‌లో నమోదు చేస్తున్న రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె) సహాయకులకు సిఆర్‌పిలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల డేటా ఇస్తున్నారు. ఆ డేటాను ఇ-క్రాప్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. సిఆర్‌పిలు ఇచ్చే సమాచారం చాలా మట్టుకు వాస్తవ విరుద్ధంగా ఉంటోంది. ప్రకృతి వ్యవసాయం కిందకు వచ్చిందంటూ పెద్ద ఎత్తున విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. డేటాను కేంద్రానికి పంపుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్రానికి యూరియా, డిఎపి, కాంప్లెక్స్‌, ఎంఒపి వంటి ముఖ్యమైన రసాయన ఎరువుల కేటాయింపులను, సరఫరాను కేంద్రం తగ్గిస్తోంది. ఫలితంగా అదనుకు రైతులకు ఎరువులు దొరకట్లేదని స్వయంగా వ్యవసాయశాఖే చెబుతోంది.

➡️