ఛైర్మన్‌గా నర్సింగ్‌ యాదవ్‌

Apr 24,2024 23:05 #Sports

డబ్ల్యుఎఫ్‌ఐ అథ్లెట్స్‌ కమిషన్‌కు ఏడుగురు సభ్యులతో నూతన కమిటీ
న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ) అథ్లెట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కామన్వెల్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మాజీ రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ ఎన్నికయ్యాడు. ఏడు స్థానాలకు ఎనిమిది అభ్యర్థులు బరిలో నిలువగా.. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఏడుగురు సభ్యులు ఎన్నికయ్యారు. సాహిల్‌(ఢిల్లీ), ఎఎస్‌ స్మిత(కేరళ), భారతీ భాఘే(యుపి), ఖుష్ఫూ ఎస్‌ పవార్‌(గుజరాత్‌), నిక్కి(హర్యానా), శ్వేతా దూబే(బెంగాల్‌) కమిషన్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏడుగురు సభ్యుల కమిటీ ఛైర్మన్‌గా నర్సింగ్‌ యాదవ్‌ను ఎన్నుకుంది. ప్రతి ఫెడరేషన్‌లోనూ ఓ క్రీడాకారుడు తప్పనిసరిగా ఉండాలని గవర్నింగ్‌ బాడీ గతంలో నిబంధన విధించడంతో నర్సింగ్‌ యాదవ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. నర్సింగ్‌ యాదవ్‌ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు గాయం కారణంగా క్వాలిఫికేషన్‌ పోటీలకు దూరం కాగా.. డబ్ల్యుఎఫ్‌ఐ అతడ్ని నేరుగా ఆ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది. దీంతో స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అప్పట్లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ అప్పీల్‌ను తిరస్కరించడంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గన్నాడు. ఆ తర్వాత డోప్‌టెస్ట్‌ పట్టుబడినా జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ(నాడా) క్లియరెన్స్‌ ఇచ్చింది. అయినా అంతర్జాతీయ డోపిక్‌ నిరోధక మండలి(వాడా) నర్సింగ్‌ యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధం విధించింది. 2020తో అతనిపై విధించిన నిషేధం ఎత్తివేశారు.

➡️