Namaz Row : గుజరాత్‌ వర్శిటీలో ముస్లిం ఫోబియా

– హాస్టల్‌ నుంచి ఏడుగురు విదేశీ విద్యార్థుల గెంటివేత
అహ్మదాబాద్‌ : బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్‌లో ముస్లిం ఫోబియా విస్తరిస్తోంది. గుజరాత్‌ విశ్వవిద్యాలయంలో ఏడుగురు విదేశీ విద్యార్థులను వర్శిటీ యాజమాన్యం హాస్టల్‌ నుండి వెళ్లగొట్టింది. నమాజ్‌ చేస్తున్న వీరిపై కొందరు దుండగులు దాడి చేసిన అనంతరం వారిని హాస్టల్స్‌ నుండి ఖాళీ చేయించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. హాస్టల్‌ ఆవరణలో నమాజ్‌ చేశారంటూ విదేశీ విద్యార్థులపై మార్చి 16న కొందరు దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తజికిస్థాన్‌, శ్రీలంక విద్యార్థులు దాడి ఘటనతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌, గాంబియన్‌ ప్రతినిధి బృందం యూనివర్శిటీని సందర్శించింది. భద్రతా చర్యలపై యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌తో సమావేశం నిర్వహించింది. ఈ అంశంపై యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నిరజా గుప్తా మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు, తూర్పు ఆఫ్రికాకు చెందిన మరో విద్యార్థి చదువు పూర్తయినా హాస్టల్‌లోనే ఉంటున్నట్లు గుర్తించామని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ వర్క్‌ కారణంగా హాస్టల్‌లో మాజీ విద్యార్థులుగా ఉంటున్నారని అన్నారు. దీంతో వారు ఇకపై హాస్టల్‌లో ఉండాల్సిన అవసరంలేదని, తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పత్రాలను పూర్తి చేశామని, ఇక వారు సురక్షితంగా వారి దేశాలకు వెళ్లవచ్చు అని అన్నారు. మాజీ విద్యార్థులు హాస్టల్‌లో ఉంచడం ఇష్టంలేదని అన్నారు. ఆయా దేశాల రాయబారులకు సమాచారం ఇచ్చామని, హాస్టల్స్‌ను కూడా ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. గుజరాత్‌ యూనివర్శిటీలో సుమారు 300కు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారని అన్నారు.

➡️