Nagaland : ప్రశాంతంగా తొలి దశ

60.03 శాతం పోలింగ్‌
అత్యధికం బెంగాల్‌లో 77.57 శాతం
అత్యల్పం బీహార్‌లో 47.49 శాతం
నాగాలాండ్‌లో ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌
21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌
అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకూ..

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :18వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి దశ ప్రశాంతంగా ముగిసింది. అయితే పోలింగ్‌ చాలా తక్కువగా నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకు జరిగింది. 60.03 శాతం పోలింగ్‌ నమోదయిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 77.57 శాతం, అత్యల్పంగా బీహార్‌లో 47.49శాతం పోలింగ్‌ నమోదయింది. ఇది చాలా తక్కువ శాతం పోలింగ్‌గానే అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం.. తమిళనాడులో 72.09 శాతం, రాజస్థాన్‌లో 50.95 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.61 శాతం, మధ్యప్రదేశ్‌లో 63.33 శాతం, మహారాష్ట్రలో 55.29 శాతం, అస్సాంలో 71.38 శాతం, చత్తీస్‌గఢ్‌లో 63.41 శాతం, ఉత్తరాఖండ్‌లో 53.64 శాతం, మణిపూర్‌లో 68.62 శాతం, మేఘాలయాలో 70.26 శాతం, మిజోరాంలో 54.18 శాతం, నాగాలాండ్‌లో 56.77 శాతం, త్రిపురలో 79.90 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకాశ్మీర్‌ లో 65.08 శాతం, లక్షద్వీప్‌లో 59.02 శాతం, అండమాన్‌ నికోబార్‌ దీవులులో 56.87 శాతం, పుదుచ్చేరిలో 73.25 శాతం నమోదయింది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 65.46 శాతం, సిక్కిం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 68.6 శాతం ఓట్లు పోలయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కూచ్‌ బెహార్‌లో బిజెపి, టిఎంసి మధ్య ఘర్షణలు జరిగాయి.
మణిపూర్‌ లో కాల్పులు.. ఇవిఎంలు ధ్వంసం
మణిపూర్‌లో ఉద్రిక్తతల నడుమ తొలి దశ పోలింగ్‌ జరిగింది. ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొయిరాంగ్‌ కాంపు ప్రైమరీ స్కూల్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. మరికొన్ని చోట్ల దుండగులు ఇవిఎంలను ధ్వంసం చేశారు. ఇలా ఉద్రిక్తతల నడుమనే సాగిన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
పోలింగ్‌ ముగిసే సమయానికి ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలో 68.62 శాతం పోలింగ్‌ నమోదైంది. బమన్‌ కాంపు, సెక్మైజిన్‌ ఖునావో మమాంగ్‌, ఖోంగ్‌మాన్‌ జోన్‌-5, ఖురారు తొంగమ్‌ పోలింగ్‌స్టేషన్‌లలో ఇవీఎంలను ధ్వంసం చేసిననట్లు సమాచారం. అదేవిధంగా అరపాటి మానింగ్‌, మొయిరాంగ్‌ కాంపు ప్రైమరీ స్కూల్‌, వాంగూ, తమ్నపాక్పీ పోలింగ్‌ స్టేషన్‌ల దగ్గర కాల్పుల ఘటనలు జరిగాయి. అదేవిధంగా ఖైడెమ్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలింగ్‌ను నిలిపివేశారు. కాగా, మణిపూర్‌ రాష్ట్రం మొత్తాన్ని రెండు లోక్‌సభ నియోజకవర్గాలుగా విభజించారు. అందులో ఒకటి ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం కాగా, రెండోది అవుటర్‌ మణిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం. తొలి విడతలో ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ నిర్వహించారు.

నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌ నమోదైంది. ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (ఎఫ్‌ఎన్‌టి)ని ఏర్పాటు చేయాలని తూర్పు నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఎన్‌పిఓ) 2010 నుంచి డిమాండ్‌ చేస్తున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించకపోవడంపై ఏడు గిరిజన సంఘాలతో కూడిన ఈ సంస్థ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం ఏ రాజకీయ పార్టీని అనుమతించబోమని పేర్కొంది. అలాగే 20 అసెంబ్లీ సీట్లున్న ఆరు జిల్లాల్లో పబ్లిక్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా, ఈ ఆరు జిల్లాల్లో సుమారు నాలుగు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. దీంతో 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు భారీగా బందోబస్తు ఉంచారు. అయితే తూర్పు నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఎన్‌పిఒ) నిరసన పిలుపునకు ఆరు జిల్లాల ప్రజల మద్దతిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌కు సంఘీభావంగా శుక్రవారం ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఓటింగ్‌ నమోదు కాలేదని ఎన్నికల అధికారి తెలిపారు.

➡️