భూ కేటాయింపుల్లో అవకతవకలు : నాదెండ్ల మనోహర్‌

nadendla manohar on irregularities in land allotments

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం పరిశ్రమల కోసమంటూ కేటాయించిన భూ కేటాయింపుల్లో పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో అపారెల్‌ పార్కు కోసం ఇచ్చిన 350 ఎకరాలను ఇతర అవసరాలకు మళ్లించారని, కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం ఇచ్చిన 350 ఎకరాలు ఇతర అవసరాలకు మళ్లించడంపై చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సిఎం క్లియరెన్స్‌ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. తమకు కేటాయించిన 2,680 ఎకరాల్లో కృష్ణపట్నం అల్ట్రా మెగాపవర్‌ ప్రాజెక్టును నిర్మించలేమని, తాము బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన రూ.300 కోట్లను తిరిగి ఇచ్చేయాలని ఆ సంస్థ 2016లో ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. ఆయా భూములను వెనక్కి తీసుకోకుండా అదే సంస్థలో భాగస్వామైన రిలయన్స్‌కు కట్టబెట్టిందని ఆరోపించారు. మిర్చి రైతులను ఆదుకోవాలి : నాగబాబుతుపాను వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్‌ చేశారు. ఎకరాకు లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు.

➡️