రూ.3.55 లక్షలతో నాబార్డు రుణ ప్రణాళిక : వ్యవసాయశాఖ మంత్రి కాకాని

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయంతో పాటు పలు ప్రాధాన్యత రంగాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3.55 లక్షల కోట్ల అంచనాలతో నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి సోమవారం వెలగపూడి సచివాలయంలో విడుదల చేశారు. నాబార్డు ఆధ్వర్యాన రాష్ట్ర పరపతి సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2024-25ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ.. ఈ ఫోకస్‌ పేపర్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో బ్యాంకర్లు రూపొందించనున్న వార్షిక రుణ ప్రణాళిక (ఎసిపి)కు దిక్సూచిగా ఉండనుందని పేర్కొన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ కనెక్టివిటీ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు కృషిని అభినందించారు. నాబార్డుతో పాటు బ్యాంకర్లు కూడా మౌలిక సదుపాయాల కల్పనకు రుణాలివ్వాలని కోరారు. కౌలు రైతులకు, సిఆర్‌సి కార్డుదారులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను మంత్రి కోరారు. కార్యక్రమంలో నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎంఆర్‌ గోపాల్‌, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ ఆర్‌కె మహానా, ఎస్‌ఎల్‌బిసి కన్వీనరు ఎం రవీంద్రబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

➡️