నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 26,2023 08:36 #Dharna, #muncipal workers
  •  సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత నాలుగేళ్లుగా మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎందురుచూస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు వినతులు సమర్పించినా పరిష్కారం కాలేదు. వినతులు, అభ్యర్థనలతో విసిగిపోయిన కార్మికులు మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. ‘ఒక సంవత్సరం ఓపిక పట్టండి.. ప్రభుత్వం వచ్చిన తరువాత సమస్యలను పరిష్కరిస్తాం’ అని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేదు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన మాట సిఎం జగన్‌ గాలికొదిలేశారు. అందువల్ల మున్సిపల్‌ కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. కార్మికశాఖ ప్రతిపాదనలు మేరకు జిఓ 30 ప్రకారం వాటర్‌ సప్లరు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌ దళం తదితర 8 కేటగిరిలకు వేతనాలు పెంచుతామని మూడేళ్లుగా హామీలతోనే సరిపెట్టేస్తున్నారు. చెత్తను తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, మలేరియా, పార్కుల్లో పనిచేసే వారికి హెల్త్‌ అలవెన్స్‌ ఇప్పటికీ చెల్లించడం లేదు. సర్టిఫికెట్స్‌ లేవనే సాకుతో గత 10-15 ఏళ్లుగా నైపుణ్యంతో కూడిన విధులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమిస్కిల్డ్‌ వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం దగా చేస్తుంది. మున్సిపాల్టీల్లో రోజుకు 12 గంటల వరకు పనిచేస్తున్న క్లాప్‌ డ్రైవర్లకు జిఓ 7ను అమలు చేయడం లేదు. క్లాప్‌ డ్రైవర్లకు నెలకు రూ.18,500 చెల్లించాలని జిఓలో పేర్కొన్నా… దళారులు రూ.9 వేల నుంచి రూ.13 వేలు చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పారిశుధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సంబంధిత మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా మున్సిపల్‌ కార్మికులకు న్యాయం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

➡️