ఫైనల్‌కు ముంబయి

Mar 5,2024 08:04 #Cricket, #Mumbai
Mumbai for the final
  •  సెమీస్‌లో తమిళనాడుపై ఇన్నింగ్స్‌ 70పరుగుల తేడాతో గెలుపు
  • రికార్డుస్థాయిలో 47వ సారి తుదిపోరుకు

ముంబయి: రంజీట్రోఫీ టైటిల్‌ను 41సార్లు చేజిక్కించుకున్న ముంబయి జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో ముంబయి జట్టు ఇన్నింగ్స్‌ 70పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు శార్దూల్‌ ఠాకూర్‌(109) శతకానికి తోడు బౌలింగ్‌లోనూ (2/48, 2/16) రాణించి ముంబయి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 232 పరుగులు వెనుకబడి సోమవారం మూడో రోజు ఆటను ప్రారంభించిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. బాబా ఇంద్రజిత్‌(70) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. వాష్టింగ్టన్‌ సుందర్‌(4), సాయి సుదర్శన్‌(5), విజరు శంకర్‌(24) తీవ్రంగా నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో ములాని(4/53) నాలుగు వికెట్లు తీయగా.. శార్దూల్‌ ఠాకూర్‌, మోహిత్‌ అవస్థి, తనూష్‌ కోటియన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146పరుగులకే ఆలౌట్‌ కాగా.. ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేసింది. ఆ జట్టు 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో శార్దూల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు హార్దిక్‌ తామోర్‌తో కలిసి 105 పరుగులు, తనుష్‌ కొటియాన్‌(38 బ్యాటింగ్‌) కలిసి 9వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. శార్దూల్‌ ఔటైనా.. తుషార్‌ దేశ్‌పాండేతో కలిసి తనుష్‌ కొటియాన్‌(126 బంతుల్లో 12 ఫోర్లతో 89 నాటౌట్‌) చివరి వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో విదర్భ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 343పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఇప్పటికే మధ్యప్రదేశ్‌పై 261పరుగుల ఆధిక్యతను సంపాదించింది. విదర్భామధ్యప్రదేశ్‌ జట్ల మధ్య జరిగే మరో సెమీస్‌ విజేతతో ముంబయి జట్టు మార్చి 10నుంచి వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్లో తలపడనుంది.

➡️