మూఢ విశ్వాసం

Mar 17,2024 06:59 #Kavitha, #Sneha

రామకృష్ణ పరమహంస
రాణీ రాన్మణీదేవి
ఆధ్వర్యంలో కట్టిన
ఆలయాన అర్చకుండు

పరిపాటిగ ఆలయమును
పరిశుభ్రం చేయువేళ
పొరపాటున శ్రీకృష్ణుని
కరమొక్కటి విరిగిపోయె!!

‘విరిగిన ఆ విగ్రహముకు
తిరిగి పూజ చేయరాదు!
కొత్తబొమ్మ ప్రతిష్టించ
ఉత్తమ’ మని భక్తులనిరి!!

వెనువెంటనె రామక్రిష్ణ
అనిరి ఇలా భక్తులతో
‘అకటా! మీ రాణిగారి
అల్లుని కొక ప్రమాదమున

చెయ్యి విరిగి పోయినచో
చికిత్స చేయుదురు గాని
కొత్త అల్లుడొకని మరల
కోరి కోరి తెస్తారా?’

ఆ మాటలు భక్తులలో
ఆలోచన కలిగించెను!
తమది మూఢ విశ్వాసం
తప్పే అది అనిపించెను!!

శ్రీకృష్ణుని విగ్రహానికి
చేతిని అతికించినారు!
ఆ విగ్రహమునకె మరల
అర్చన లొనరించినారు!!

రాముడు, కృష్ణుడు తానై
రామకృష్ణ ఇల వెలసిరి!
మూఢ విశ్వాసములను
గాఢముగా నిరసించిరి!!

– అలపర్తి వెంకట సుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ
బాల సాహిత్య పురస్కార గ్రహీత)
9440805001

➡️