హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

  •  నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో గురువారం స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర 48వ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించి, సమస్యల పరిష్కారించాలని, అడిషనల్‌ క్వాంటమ్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సంఘాలతో చర్చించకపోవటం వల్లే అనేక సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవట్లేదన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డిఎ అరియర్స్‌, అడిషనల్‌ క్వాంటమ్‌పై ఈ నెలఖారులోగా ఉత్తర్వులు జారీ అవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎపి జెఎసి మాజీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఎపి జెఎసి చైర్మన్‌ కెవి శివారెడ్డి, ఎపిఎన్‌జిఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా డి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులుగా జిఎన్‌ అబ్దుల్‌ కరీం, సెక్రెటరీ జనరల్‌గా జి ప్రభుదాసు, కోశాధికారిగా శర్మ, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా బి పెద్దన్నగౌడ్‌ తదితరులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పెన్షనర్ల పాల్గొన్నారు.

➡️