తల్లి తరువాత తల్లి

Dec 17,2023 11:50 #details
  • వండటం, తినిపించడం అన్నీ వారే
  • అయినా కనికరం లేని ప్రభుత్వం
  • అంగన్‌వాడీలపై మొండి వైఖరి
  • రికార్డులు స్వాధీనం చేసుకోవాలని సూపర్‌వైజర్ల ఆదేశాలు
  • వెంటనే సమస్యను పరిష్కరించాలని సిఐటియు డిమాండు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పిల్లలను కనీ పెంచడం తల్లి బాధ్యత అని చెబుతారు. అటువంటి తల్లి కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళుతూ పిల్లలను వదిలేసి వెళితే వారి మంచీ చెడు చూసుకుని వారికి తిండిపెట్టడం, తినకపోతే బతిమిలాడి, కథలు చెప్పి సొంత బిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుతూ వారి కడుపు నింపేది అంగన్‌వాడీలు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిల్లలు అంగన్‌వాడీలు పెడితేనే అన్నం తినేంతగా అలవాటుపడ్డారు. అలా కడుపునింపే అంగన్‌వాడీలు నేడు వారు కడుపు నింపుకోవడం కోసం సమ్మెలోకి వెళ్లారు. అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. మొండిగా వ్యవహరిస్తోంది. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే విధుల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై అంగన్‌వాడీలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని నాయకులు చెబుతున్నారు. మరోవైపు సెంటర్లలో రికార్డులు స్వాధీనం చేసుకోవాలని సూపర్‌వైజర్లకు ఆదేశాలు జారీచేశారు. వారు సెంటర్లకు చేరుకుని తాళాలు పగులకొట్టించి రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ చర్యను చాలా ప్రాంతాల్లో ప్రజలే అడ్డుకుంటున్నారు. సెంటర్లలో వస్తువులేమైనా పోతే దానికి సూపర్‌వైజర్లు, అందులోకి వెళ్లినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంగన్‌వాడీలు హెచ్చరిస్తున్నారు.

12వ తేదీ నుండి అంగన్‌వాడీ సంఘాలు సమ్మెలోకి వెళ్లినా ప్రభుత్వంలో చలనం లేదు. చర్చించినా గ్రాట్యుటీ, మెరుగైన వేతనం వంటి ప్రధాన అంశాలను దాటేస్తున్నారు. దీంతో సెంటర్లకు తాళాలు పడ్డాయి. వాటిని వెంటనే తెరవాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. కలెక్టర్ల ఆదేశాల మేరకు వాటిని వార్డు, విలేజ్‌ సెక్రటేరియట్‌ సిబ్బంది తాళాలు పగులగొట్టి తెరుస్తున్నారు. దీనిపై గ్రామాల్లో ప్రజల నుండి ప్రతిఘటన వస్తోంది. వార్డు సెక్రటరీలు కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన వాళ్లం ఇలా ఘర్షణ పెట్టుకోలేమని తేల్చిచెబుతున్నారు. సిఐడిఎస్‌ ప్రాజెక్టు అధికారులు మాత్రం బలవంతంగా తాళాలు పగులకొట్టించి తెరిపిస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను పిలిపించి పిల్లలకు భోజనం వండాలని కోరగా రోజుకు రూ.500 కూలీ ఇస్తేనే చేసి పెడతామని వారు తేల్చిచెప్పారు. వారి పని వెలకట్టలేనిదిఅంగన్‌వాడీ సెంటర్లలో వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఉదయం 8.30 గంటలకల్లా సెంటర్‌కు చేరుకుని శుభ్రం చేస్తారు. అనంతరం పిల్లలకు వంట మొదలుపెడతారు. మరోవైపు ఇంటింటికీ తిరిగి పిల్లలను తీసుకురావడం, తల్లులు పనికి వెళితే చిన్న పిల్లలను చంకనేసుకుని తీసుకెళ్లడం అన్నీ అంగన్‌వాడీలే చేస్తుంటారు. మారాం వేస్తే వారికి సర్దిచెప్పడం, సమయానికి మెనూ ప్రకారం భోజనం తినిపించడం చేస్తుంటారు. 12 గంటలకు నిద్రపుచ్చుతారు. సాయంత్రం మరలా పిల్లలందరినీ వెంటబెట్టుకుని వెళ్లి ఇళ్లదగ్గర వదలిపెట్టి వస్తుంటారు. నిజంగా వారు చేసే సేవలు వెలకట్టలేనివి. అంగన్‌వాడీ విధుల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులవారే. అలాగే ఒంటరి మహిళలు ఎక్కువే.

ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి : సిఐటియు డిమాండ్‌

అంగన్‌వాడీలకు సిఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని, వేతనాలు పెంపు, గ్రాట్యుటీ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు కోరారు. సమ్మె అనేది కార్మికుల హక్కు సుప్రీం కోర్టు కూడా ఐసిడిఎస్‌ పరిధిలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశించిందని, గౌరవ వేతనమా, ఇంకోటా అనేది పేరు ఏది పెట్టినా వాళ్లూ కార్మికులేనని 15 రకాల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. వారికీ సర్వీసు కండిషన్లు ఉన్నాయని వివరించారు. నోటీసు ఇచ్చి మరీ సమ్మెకు వెళ్లారని, దీన్ని భగం చేయాలనే పేరుతో కొంతమంది దుందుడుకు చర్యలకు దిగుతున్నారని, వారిని స్ట్రైక్‌బ్రేకర్స్‌ అంటారని అటువంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశమూ ఉంటుందని వారు తెలిపారు. ఈ ఏడాది మే 10వ తేదీ నుండి అంగన్‌వాడీలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల తరువాత అంగన్‌వాడీలతో చర్చలు జరిపిన మంత్రులు ఇప్పుడు సిఎంతో మాట్లాడాలని చెబుతున్నారని, దీనిపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ లేదని, మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు న్యాయం చేయాలంటే వారిపట్ల ఏ మాత్రమూ గౌరవం ఉన్నా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లక్షా మూడువేల మంది మొత్తం మహిళలే సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు.

ఎక్కువమంది పిల్లలు అంగన్‌వాడీ సెంటర్లలోనే బాల్యాభ్యాసం చేస్తున్నారని, దీన్ని సక్రమంగా నడపడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోట్లాడి మహిళలకు న్యాయం చేయాలన్నారు. సమస్య పరిష్కార దిశగా కాకుండా మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రం అంతా స్తంభించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని, ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు, పార్టీలూ మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. అంగన్‌వాడీలతోపాటు చాలామందికి వేతనాలు పెంచడం లేదని, విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న వారికీ, మూడు లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంచడం లేదని తెలిపారు. కరువు భత్యమే రూ.3600 ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

➡️