అవసరమైన శిశువులకు అమ్మ పాలు

Apr 3,2024 04:30 #Jeevana Stories

అమ్మ పాలను అమృతంతో పోలుస్తారు. నవజాత శిశువులకు అప్పటికప్పుడు పోషకాహారంగా ఉపయోగపడడం ఒక్కటే కాదు; భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదగటానికీ అమ్మపాలు ఎంతగానో దోహదపడతాయి. అయితే, నవీన కాలంలో అనేక కారణాల వల్ల కొంతమంది తల్లులకు అసలు పాలు పడకపోవడమో లేక బిడ్డకు అవసరమైనన్ని పాలు లభ్యం కాకపోవడమో జరుగుతోంది. కొంతమంది తల్లులకేమో తమ బిడ్డకు సరిపోగా, ఇంకా ఎంతో మోతాదులో పాలు మిగిలిపోతాయి. ఈ రెండు పరిస్థితులను సమన్వయం చేస్తూ, కొన్ని దేశాల్లో మదర్‌ మిల్క్‌ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. మన రాష్ట్రంలోనూ ఇప్పుడు అలాంటి మంచి ప్రయత్నం జరుగుతోంది.

రాయలసీమకే తలమానికంగా నిలుస్తున్న తిరుపతి ప్రసూతి వైద్యశాలలో ఇకపై ముర్రుపాలు లభ్యం కానున్నాయి. నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించి, తల్లికి దూరంగా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందే శిశువుల పాలిట మదర్‌ మిల్క్‌ బ్యాంకు కల్పతరువుగా మారనుంది. ఆస్పత్రిలో ప్రసవించి పాలు సమఅద్ధిగా ఉన్న తల్లుల నుంచి ముర్రుపాలు సేకరించి, ఆకలితో బాధపడుతున్న శిశువులకు సరఫరా చేసేందుకు తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు.
తిరుపతి రోటరీ క్లబ్‌ వారి ఆర్థిక సహకారంతో, రూ.30 లక్షల వ్యయంతో తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్‌ మిల్క్‌ బ్యాంకును నెలకొల్పారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ సేవలు అందుబాట్లోకి రానున్నాయి. ఈ ఆస్పత్రిలో నెలకు 600 నుంచి 750 మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. వీరిలో 30 శాతం మంది నెలలు నిండకముందు, తక్కువ బరువుతో జన్మించిన వారే ఉంటున్నారు. వీరిలో చాలా మంది రోజుల తరబడి తల్లికి దూరంగా చికిత్స పొందుతుంటారు. ఇలా తల్లికి దూరంగా ఉన్న, వైద్యులు సిఫార్సు చేసిన 1.5 కేజీల లోపు శిశువులకు మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు ముర్రు పాలు సరఫరా చేస్తుంది. ఇలా నెలకు సగటున 300 మంది పిల్లల ఆకలి తీర్చటానికి మదర్‌ మిల్క్‌ బ్యాంకు ఉపయోగపడుతుందని తిరుపతి ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పార్థసారధి పేర్కొన్నారు.
ముర్రుపాలే శ్రేష్టం
ఈ ఆస్పత్రిలో రోజుకు 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతాయి. కొంతమంది బాలింతలకు ప్రసవం తర్వాత రెండు మూడురోజుల వరకు పాలు పడటం లేదు. పాలు పడని తల్లులే కాకుండా పాలు సమఅద్ధిగా లభించే తల్లుల పాలిట ఈ కేంద్రం ఓ వరంగా మారింది. పాలు పడని తల్లులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందజేస్తుంది. తల్లి వద్ద సమఅద్ధిగా పాలు ఉన్నప్పటికీ.. శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తాత్కాలికంగా ఫీడింగ్‌ నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా తల్లిపాల నిధికి చేరుకుని తమ పాలను దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరు రొమ్ము కేన్సర్‌ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా 300 మంది పిల్లలకు సరిపడా పాలను నిల్వ చేసే సౌలభ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
అత్యంత భద్రంగా నిల్వ
పాల సేకరణకు ముందే వీరికి హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి వైద్య పరీక్షలు చేసి, ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాలను సేకరిస్తారు. ఇలా వీరి నుంచి సేకరించిన పాలను ప్రాసెస్‌ చేసి మైనస్‌ 20 డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. వీటిని ఆరు మాసాల వరకు వాడుకునే అవకాశం ఉంది. తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రొటీన్లతో పాటు శారీరక, మానసిక, ఆరోగ్య వికాసానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల తల్లిపాలలో 65 కిలో కేలరీల శక్తినిస్తాయి. ఇందులో విటమిన్‌ ఎ సహా థయామిన్‌, రైబోఫ్లెవిన్‌, బి12, బి6, సెనథోనిక్‌ ఆమ్లం, బయో టిక్‌, ఫోలిక్‌ ఆమ్లం, సీ,డీ,ఇ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి. బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలు తాగించాల్సి ఉంది. ఇలా కనీసం ఆరు మాసాల పాటు తల్లి పాలే అందించాలి.
తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో మదర్‌ మిల్క్‌ బ్యాంకు సేవలు ప్రారంభించటం చాలా అభినందనీయం. ఇలాంటి ప్రయత్నం వీలైనన్ని అన్ని చోట్లా జరగాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, సేవాదృక్పథం పెంపొందించటానికి అమ్మ పాలు వితరణ చాలా గొప్ప ప్రయత్నం.

తల్లులు దాతృత్వం చాటుకోవాలి
పిల్లలకు ముర్రుపాలకన్నా శ్రేష్టమైనవి ఇంకేమీ లేవు. వైద్యరంగంలో రాయలసీమకే తలమానికంగా నిలుస్తున్న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో 20 శాతం మేరకు బరువు తక్కువ, నెలల తక్కువతో జన్మించే పిల్లలు ఉన్నారు. వీరు 1200 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్నప్పుడు సర్వైవ్‌ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి రోటరీక్లబ్‌ వారు ముందుకొచ్చి మదర్‌ మిల్క్‌ బ్యాంకును ఏర్పాటు చేయడం శుభ పరిణామం. తల్లిపాల ఆవశ్యకతపై ఆసుపత్రిలో ప్రసవించిన వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం. తల్లులూ దాతృత్వం చాటుకుని పాలను మిల్క్‌ బ్యాంకు ఇచ్చేలా చొరవ తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ మిల్క్‌బ్యాంకు విజయవంతం అవుతుందని భావిస్తున్నాం.

– డాక్టర్‌ పార్ధసారధి, సూపరింటెండెంట్‌
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, తిరుపతి

– మారేడుపల్లి రాధాక్రిష్ణ
ప్రజాశక్తి విలేకరి, తిరుపతి

➡️