ఇజ్రాయిల్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ను తగ్గించిన మూడీస్‌

Feb 11,2024 11:00 #credit ratings, #downgrades, #Israel, #Moody

జెరూసలేం : ఇజ్రాయిల్‌ ప్రభుత్వ క్రెడిట్‌ రేటింగ్స్‌ను మొట్టమొదటిసారిగా మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ శుక్రవారం రాత్రి తగ్గించింది. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రభుత్వ కాన్‌ టివి న్యూస్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఎ వన్‌గా వున్న రేటింగ్‌ను ఎ టు కి తగ్గించింది. ‘సుస్థిరమైన’ స్థాయి నుండి ‘నెగిటివ్‌’ స్థాయికి మార్చింది. హమస్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన 12 రోజులకు అంటే అక్టోబరు 19న ఇజ్రాయిల్‌ ఎ వన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గించేందుకు సమీక్ష కోసం పెట్టినట్లు మూడీస్‌ తెలిపింది. అనూహ్యమైన, హింసాత్మక ఘర్షణగా ఆ సైనిక చర్యను వ్యాఖ్యానించింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం, వాటి పర్యవసానాలన్నీ ఇజ్రాయిల్‌కు రాజకీయ ముప్పును కలిగించే అవకాశాలు ఎక్కువున్నాయని అదే ఈ రేటింగ్స్‌ తగ్గించడానికి ప్రధాన కారణమని మూడీస్‌ పేర్కొంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయిల్‌ ప్రభుత్వ, శాసన సంస్థలు బలహీనపడతాయని, ఆర్థిక బలం కూడా తగ్గుతుందని తెలిపింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వ రుణాలు అధ్వాన్న స్థితిలో వున్నాయని పేర్కొంది. కాగా దీనిపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందిస్తూ, ఇజ్రాయిల్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వుందని స్పష్టం చేశారు. ఇలా రేటింగ్స్‌ తగ్గడమన్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేదని అన్నారు. ఈ యుద్ధంలో విజయం సాధిస్తే మళ్లీ ఈ రేటింగ్‌ పెరుగుతుందని, తాము విజయం సాధిస్తామని చెప్పారు.

➡️