కోతి – మామిడి పండు

Dec 23,2023 10:57 #sahityam

ఆకలితో ఒక్క కోతి

అలమటించసాగెను

అడవిలో అటునిటు

చూసుకుంటూనడిచెను.

 

ఒక్కచోట తియ్యనైన

మావిపండు దొరికెను

అబ్బబ్బో అనుకుంటూ

కూర్చుని తిన సాగెను.

 

తియ్యని ఇలాటి పండు

ఇంతవరకు చూడలే

ఇంకా కొన్ని దొరికినా

అందరికి పంచెదను

 

అనుకుంటూ వానర

మాలోచించ సాగెను

అంతలో కాకి బావ

అక్కడికేతెంచెను.

 

కోతి తన మనసులో

మాట విప్పి చెప్పెను

దానికి ఆ కాకి బావ

మంచి సలహా ఇచ్చెను

 

ఈ అడివిన మామిడి

తక్కువగా వున్నవి

పండు టెంక పాతిన

కొత్తమొక్క వొచ్చును.

 

కాకి మాట విన్నకోతి

గొయ్యతీసి టెంకపాతె

నీరు పోసి పాదు చేసి

మంచిగా సాగు చేసే.

 

కోరిక ఫలియించెను

మావిపిలకలొచ్చేను

ఆనతి కాలంలోనే

గున్నమావి పూసేను

 

కొమ్మకొమ్మ కాసెను

పక్షులొచ్చి చేరెను

మొక్కేసిన కోతమ్మకు

అభినందన తెలిపెను

 

తిన్నపండు విత్తనంబు

పాతండోయ్ బాలలు

మొక్కలొచ్చి కాపు కాసి

పండ్ల నిచ్చు పిల్లలు

– కూచిమంచి నాగేంద్ర,91821 27880.

➡️