అలవిగాని పనులు

Jan 28,2024 11:44 #Stories
money cock story

అనగనగా ఒక అడవి. మరీ పెద్దది కాదు. అందులో చంచల అని ఒక కోతి ఉంది. దానికొక కొడుకు, పేరు మారుతి. ఒక్క కొడుకు అని చంచల గారాబంగా పెంచింది. మారుతీకి పెళ్లి వయస్సు వచ్చింది. చంచల సంబంధాలు చూడసాగింది.

ఆ అడవిలో పులులూ, సింహాలు ఉండేవి కాదు. అందువల్ల చుట్టుపక్కల ఊర్ల నుంచి వనభోజనాలకి జనాలు వస్తుండేవారు. వారిలో ఆడపిల్లలు, పెద్దలు వచ్చి సందడి చేసేవారు. వారి అందం, చురుకు చూసి మారుతీ సరదా పడేవాడు. అలాంటి అందమైన అమ్మాయినే తీసుకొచ్చి, పెళ్లి చేయమని కోరాడు.

అప్పుడు చంచల ‘బాబూ! కోతిలా ఉన్నా కులమింటి పిల్లని చేసుకోవాలని పెద్దల మాట. ఇకపోతే మనం నిజంగానే కోతులం. మానవజాతి అభివృద్ధి చెందిన జాతి. నీ వంటి కోతికి ఇచ్చి పెళ్లి చేయరు. ఆ ఆలోచన మానుకో’ అంది.

అయినా మారుతీ వినలేదు. తమకీ, మనుషులకీ భేదం ఏమీ లేదని, మనిషి చేసే పనులన్నీ తానూ చేయగలనని వాదించింది. మానవజాతి పిల్లనే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. పైలోకంలో ‘గాంధారికి గాడిదతో పెళ్లి చెయ్యలేదా? అప్పుడు జాతులు వేరే కాదా?’ అని ఎదురు మాట్లాడాడు. ఈ విషయం ఒక గాడిద తమ గొప్పతనం గురించి చెప్పినప్పుడు మారుతీకి తెలిసింది. కానీ దాని వెనకాల ఉన్న దేవ రహస్యం తెలియదు కదా అని చంచల మనసులో అనుకుంది. ఎంత నచ్చజెప్పినా మూర్ఖత్వంతో మారుతీ వినలేదు.

ఇక చేసేదిలేక చంచల అనాకారి (కోతి) లా ఉన్న ఒక అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి తండ్రి దగ్గరకు వెళ్లి అడిగింది. అత్యంత పేదరికంలో, తిండికి కూడా లేని తండ్రి దీనస్థితి చూసింది. డబ్బు, బంగారం ఆశ చూపింది. పిల్లని ఇవ్వమని కోరింది.

కోతిలా ఉన్న తన పిల్లని ఎవ్వరూ పెళ్లి చేసుకోరని బెంగపడ్డ తండ్రికి చంచల సంబంధం నచ్చింది.

డబ్బు, బంగారానికి ఆశపడ్డాడు. పెళ్లి చేసేందుకు సరేనన్నాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి అయింది. మామ కోరికపై చంచల మారుతీని కొద్ది రోజులపాటు అత్తింట్లో వదిలి వెళ్లింది. మారుతీని చేసుకున్న రాధ ఏ పనీ చేసేది కాదు. తనని చేసుకోవటమే మారుతీ అదృష్టమని అనుకునేది. మారుతీ కూడా అలాగే అనుకునేవాడు. అందువల్ల అన్ని పనులూ మారుతీనే చేసేవాడు. కష్టమైనా భరిస్తూ ఉండేవాడు. రాధే కాకుండా మామ కూడా ఇంటి పనులన్నీ చేయించేవాడు.

పిల్లని ఇవ్వడమే గొప్ప అని భావించి కూలి పనులకు పంపించేవాడు. బజారుకు తీసుకెళ్లి, కోతులాట ఆడించి డబ్బు సంపాదించేవాడు. సరిగా ఆడక పోతే కొట్టేవాడు. రాధాకానీ, ఇంట్లోవారు గానీ మారుతీ బాధని పట్టించుకునేవారు కాదు. పనికిపోయి ఇంటికి వచ్చినా, ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. మారుతీ నివాసం దొడ్లో ఉన్న చెట్టు మీద ఏర్పరచారు. ‘నీకు ఇదే అలవాటు కదా’ అని హేళనగా మాట్లాడేవారు. అయినా రాధ మీద ప్రేమతో మారుతీ భరిస్తూ ఉండేవాడు. ఈ విషయాలన్నీ తల్లి చంచలకు తెలియకుండా జాగ్రత్తలు పడేవాడు. అయినా తండ్రి, కూతుళ్లుతృప్తి చెందేవారు కాదు. అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లి డబ్బు తెమ్మని మారుతీని ఇబ్బందిపెట్టేవారు. కానీ తల్లికి భయపడి మారుతీ అడవికి వెళ్లేవాడు కాదు. తల్లి దగ్గర అంత డబ్బులేదని, ఇంకా ఇవ్వలేదని చెప్పేవాడు.

ఒకరోజు రాధ తండ్రి ‘వీడి తల్లి నుంచి ఇక మనకి డబ్బు రాదు. వీడూ కొత్త ఆటలు ఆడలేకపోతున్నాడు. మారుతీని సర్కస్‌ వాళ్ళు అడుగుతున్నారు. అమ్మేస్తాను. ఆ డబ్బూ, వీడి అమ్మ ఇచ్చిన బంగారం అమ్మీ, నీకు మంచి అబ్బాయిని చూసి, పెళ్లి చేస్తా.’ అని రాధతో అన్నాడు.

‘మారుతీ గురించి చంచల అడిగితే?’ అంది రాధ.

‘పారిపోయాడని చెబుదాం!’ అన్నాడు నవ్వుతూ. రాధ కూడా సంతోషంగా సరేనంది. చెట్టుపై నుంచి వింటున్న మారుతీకి దుఃఖం ఆగలేదు.

రాధకు తన మీద ప్రేమ లేదని అర్థమైంది. నిజానికి తనకి అడవిలో ఏ పనీ ఉండదు. ఇష్టమైన పళ్ళు తింటూ స్నేహితులతో ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద దూకుతూ ఆడుకునేది. తల్లి తెచ్చిన పండ్లు తింటూ కాలం వెళ్లదీసింది. ఇప్పుడు తల్లి ప్రేమ లేదు. ఆ సంతోషమూ లేదని మనసులో అనుకుంది.

ఈ మనుషుల మధ్యకొచ్చి నానా అగచాట్లు పడుతున్నాడు. ఆ రాత్రంతా బాగా ఆలోచించింది. అందరూ నిద్రిస్తున్న సమయం చూసి, నెమ్మదిగా చెట్టు దిగి పారిపోయింది. అడవిలోకి చేరింది. తల్లిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. మారుతీ ఏమి చెప్పకపోయినా, చంచలకు అంతా అర్థమైయ్యింది. కొద్దిరోజుల తర్వాత కోతి జాతికి చెందిన కోతిపిల్లని చూసి, మారుతీతో వివాహం చేసింది. ఆ కోతితో కలిసి, మారుతీ హ్యాపీగా ఉంది. అందుకే పిల్లలూ అలవిగాని పనులు చేయరాదు అన్నారు పెద్దలు.

– ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, 98494 64017

➡️