చిన్న పరిశ్రమలను చిదిమేసిన మోడీ సర్కార్‌

Mar 11,2024 10:43 #Congress, #Mallikarjun Kharge, #MSME

ఏకంగా 2.5 కోట్ల సంస్థలు మూత
మల్లికార్జున ఖర్గే విమర్శలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి అమల్జేస్తున్న బడా కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల దేశంలోని చిన్నపరిశ్రములు చితికిపోయాయని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏకంగా 2.5 కోట్ల చిన్న, మధ్య తరహా సంస్ధలు (ఎంఎస్‌ఎంఇ) మూతపడ్డాయని ఖర్గే తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో 1.3 కోట్ల ఎంఎస్‌ఎంఇలు పెరిగితే మోడీ హయాంలో మూసివేతలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల ఉపసంహరణ, లోపభూయిష్ట జిఎస్‌టి, కోవిడ్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణాల వల్ల చిన్న పరిశ్రములు చితికిపోయాయని ఆయన తెలిపారు.  ఎంఎస్‌ఎంఇల్లో ఉద్యోగుల సంఖ్య కూడా ఈ పదేళ్లలో క్రమంగా క్షీణించిపోయిందన్నారు. 2013-14 కాంగ్రెస్‌ హయాంలో ఎంఎస్‌ఎంఈల్లో 11.14 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి పొందగా 2022-23 (మోడీ ప్రభుత్వ హయాం)లో ఉద్యోగుల సంఖ్య 11.1 కోట్లుగా ఉందని గుర్తు చేశారు. 2020 మే 12న ప్రధాని నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఎంఎస్‌ఎంఇలకు ప్రత్యేక ప్యాకేజ్‌ ప్రకటిస్తూ గొప్పగా ప్రచారం చేసుకున్నా.. వాస్తవంలో ఆ ప్యాకేజీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. ప్రధానమంత్రి ముద్ర పథకం దుస్థితి కూడా అంతేనని ఆయన తప్పుబట్టారు. ఈ పథకం కింద గరిష్ఠ పరిమితిగా రూ.10 లక్షలు రుణం మంజూరుకు అవకాశమున్నట్లు ప్రచారం చేస్తుంటే.. సగటున కేవలం రూ. 52 వేల మాత్రమే రుణంగా అందుతోందని ఖర్గే తెలిపారు.

➡️