మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. కర్ఫ్యూ విధించిన యంత్రాంగం 

Jan 19,2024 08:18 #curfew, #Manipur violence

ఇంఫాల్‌ : మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లాలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది.

బుధవారం రాత్రి తౌబాల్‌ జిల్లాలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దుండగులు దాడి చేశారు. దీంతో ముగ్గురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఇంఫాల్‌ ఆస్పత్రికి తరలించారు. మొదట దుండగులు తౌబాల్‌ జిల్లా ఖంగాబాక్‌ ప్రాంతంలోని మూడవ ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ కాంప్లెక్స్‌పై దాడికి పాల్పడ్డారు. బలగాలు ధీటుగా స్పందించాయని అధికారులు వెల్లడించారు. అనంతరం తౌబాల్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి తెగబడ్డారని తెలిపారు.

దీంతో జిల్లా యంత్రాంగం తౌబాంగ్‌లో కర్ఫ్యూ విధించింది. అయితే ఆరోగ్యం, మీడియాతో సహా అత్యవసర సేవకులను కర్ఫ్యూ నుండి మినహాయించింది. కోర్టులు, విమానాశ్రయాలకు వెళ్లేవారికి కూడా మినహాయింపునిస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది.

బుధవారం సాయంత్రం తెంగ్నోపాల్‌ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్‌పై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు కమాండోలు మరణించారు.

➡️