తృణమూల్‌ ఎంపీ మిమిక్రీపై రభస

Dec 21,2023 08:10 #Parliament Session
mimicry in parliament

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన మాక్‌ పార్లమెంటు తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి కల్యాణ్‌ బెనర్జీ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ను అవమానించేలా మిమిక్రీ చేశారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఉపరాష్ట్రపతి కార్యాలయం కూడా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జగదీప్‌ ధన్కడ్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ చేసి..తన విచారాన్ని వ్యక్తీకరించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ‘ఇలాంటి అవమానాలు నా లక్ష్యాన్ని మార్చలేవు’ అని ధన్కడ్‌ సామాజిక మాధ్యమాల్లో తన స్పందన తెలియజేశారు. తనను అవమానించినా భరిస్తాను కానీ, పార్లమెంటును అవమానిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మిమిక్రీ అంశంపై తీవ్రంగా స్పందించారు. ధన్కడ్‌పై సదరు ఎంపీ పార్లమెంటు కాంప్లెక్స్‌ మిమిక్రీ చేయడాన్ని చూసి తాను విస్తుపోయానని, ప్రజా ప్రతినిధులకు భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని, కానీ ఆ వ్యక్తీకరణ నిబంధనలకు లోబడి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ఉపరాష్ట్రపతిని అనుసరిస్తూ మిమిక్రీ చేయడం తీవ్రమైన దుష్రప్రవర్తన అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ధన్కడ్‌ను ప్రత్యక్షంగా కలిసి ఓం బిర్లా విచారం వ్యక్తం చేసినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. మరోవైపు పార్లమెంటులో ఎన్‌డిఎ సభ్యులు కూడా తృణమూల్‌ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమతమ స్థానాల్లో నిలబడి నిరసన తెలియజేశారు. ఎవరినీ ఉద్దేశించినది కాదు : కల్యాణ్‌ బెనర్జీ అయితే తాను చేసిన మిమిక్రీ ఎవరినీ ఉద్దేశించినది కాదని మాక్‌ పార్లమెంటులో మిమిక్రీ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు. మాక్‌ పార్లమెంటు లోక్‌సభ గురించా, రాజ్యసభ గురించా అనేది తానెక్కడా చెప్పలేదన్నారు. తనకంటే సీనియర్‌గా, మాజీ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా ధన్కడ్‌ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఎవరు ఎవరినీ అవమానించారు? : రాహుల్‌ ఈ ఘటనపై బిజెపి నేతల వాదనను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ధీటుగా తిప్పికొట్టారు. ఎవరు ఎవరినీ అవమానిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా రికార్డు స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయగా తామంతా పార్లమెంటు ఆవరణలో కూర్చొని నిరసన తెలిపామని, ఆ దృశ్యాలను తాను కూడా ఫోన్‌లో రికార్డు చేశానని రాహుల్‌ పేర్కొన్నారు. కానీ ఎవరు? ఎవరిని అవమానించారో అందరికీ తెలుసన్నారు. సుమారు 150 మంది ప్రతిపక్షాల ఎంపీలను బయటకు నెట్టేశారని, వారి గురించి ఏ మీడియాలోనూ చర్చ జరగడం లేదని ఆయన వాపోయారు. అదానీ, రఫేల్‌, నిరుద్యోగం వంటి వాటిపైనా చర్చ జరపడం లేదన్నారు. ప్రతిపక్షాల ఎంపీలు సభ వెలుపల కూర్చుంటే ..మిమిక్రీ పెద్ద ద్రోహమైనట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మీడియా సంస్థలు కొన్ని వార్తలను చూపించాలని, అది వారి బాధ్యత అని రాహుల్‌ హితవు పలికారు. రాహుల్‌ వీడియో తీయకుంటే..: మమతప్రతిపక్ష సభ్యుల నిరసన దృశ్యాలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వీడియో తీశారని, ఆయన వీడియో తీయకపోతే ‘మిమిక్రీ’ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆమె బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కల్యాణ్‌ బెనర్జీ మిమిక్రీని రాహుల్‌ చిత్రీకరించినందునే వివాదం మొదలైందన్నారు. కుల ప్రస్తావన ఎందుకు? : ఖర్గే’తన కులంపై దాడి జరగిందని జగదీప్‌ చెప్పడం ఏమాత్రం సబబు?’ అని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు. ‘ఎవరైనా సరే రెచ్చగొట్టే మాటలకు దూరంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. ‘సభలో మాట్లాడేందుకు నన్ను కూడా చాలాసార్లు అనుమతించలేదు. నా సామాజిక తరగతిపైనా ఆ ప్రభావం ఎక్కువే. అంతమాత్రాన నా కులంపై దాడి జరిగిందని నేను ఎప్పుడైనా ప్రస్తావించానా?’ అని ఖర్గే నిలదీశారు.

➡️