నీటిఎద్దడి నివారణకు చర్యలు

జిల్లాలో నీటిఎద్దడి నివారణకు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

* కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. మంచినీటి పరిస్థితి, విద్యుత్‌ సరఫరా అంశాలపై ప్రతిరోజూ నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా వాటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు నిధులు అందుబాటులో ఉంచామని, ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా 24 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లాలో వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతో పాటు వేడిగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు, పెంచిన కూలి గురించి జిల్లా గణాంకాలను వివరించారు. సమావేశంలో జిల్లాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.వెంకటేశ్వరరావు, ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఇ డోల తిరుమలరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీరు పి.సుగుణాకరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జాన్‌ బెనహర్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ పొన్నాడ సుధాకర్‌ పాల్గొన్నారు.

➡️