లెనిన్‌ ధీరోదాత్తతను ఆవిష్కరించిన మయకోవస్కీ

Jan 15,2024 09:02 #sahityam

”మయకోవ్‌స్కీని మొదటిసారి చదివినప్పుడు నాకు కలిగిన అనుభవం, ఆకాశాన్ని మెరుపులు చీల్చడం చూసినప్పటి లాంటిది. ఆ తిరుగుబాటు, ఆ ఉత్తేజం ఆ ఉరుములు, ఆ జ్వాల….. అన్నీ కొత్తవే. అప్పుడే నా మనస్సులో శాశ్వతంగా విప్లవమూ, మయకోవ్‌స్కీ ఒకటిగా రూపొందించడం జరిగింది.- జూలియన్‌ టూవిమ్‌, పోలిష్‌ కవి.

            వ్లాదిమిర్‌ మయకోవ్‌స్కీ పట్టుమని 37 సంవత్సరాలు కూడా బతకలేదు. అలెగ్జాండర్‌ పుష్కాన్‌ కన్న ఒక్క యేడాది తక్కువ. తన విషాద మరణానికి ఆరేళ్ళ ముందు ”జూబిలీ” అనే గీతంలో మయకోవస్కీ పుష్కిన్‌ కవి కంచు విగ్రహంతో ఇలా అన్నారు :

”త్వరలో

నేను మరణిస్తాను,

మూగ పోతాను,

మరణించిన తర్వాత

మనం ఇద్దరం ఒకరి ప్రక్క ఒకరు

ఇంచు మించు దగ్గరగా నిలుస్తాం

”ప” అనే అక్షరం కింద నువ్వు

”మ” అనే అక్షరం కింద నేను!

మాస్కో నగరంలోని కేంద్ర గోర్కీ వీధిలో పుష్కిన్‌ మయకోవస్కీ చౌకులు దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. నా మట్టుకు నాకు మాస్కో భూగర్భ రైలు మార్గంలోని స్టేషన్‌లన్నింటిలోనూ అందమైనది మయకోవస్కీ పేరు గలది ఒక్కటే అనిపిస్తుంది. ఇది పుష్కిన్‌ వీధికి ఎంతో దూరంలో లేదు.

సోవియట్‌ గ్రంథ విక్రయ సంస్థ లెక్క ప్రకారం … పుష్కిన్‌ గ్రంథాల తర్వాత మయకోవస్కీ రచనలే ఎక్కువగా అచ్చు కావడం, తర్జుమా కావడం జరిగింది.

జార్జియా రిపబ్లిక్‌లోని బాగ్దాదీ అనే చిన్న గ్రామానికి సోవియట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ”మయకోవస్కీ” అని పేరు మార్చారు. ఆ గ్రామం చుట్టూ కొండలు, జేగురు రంగు లోయల నిండా ద్రాక్షతోటలు ఉంటాయి. ఖనీస్‌ ట్సాల్కీ అనే కొండవాగు మయకోవస్కీ గ్రామం గుండానే ప్రవహిస్తోంది.

బాగ్దాదీ గ్రామంలో ఒక అరణ్యకుని కుటుంబంలో మన భావకవి 1893లో జన్మించారు. అతని తండ్రికి కోపం వచ్చినా పట్టలేము. సంతోషం వచ్చినా పట్టలేము. ఆయన గొంతుక పెద్దది. ఆప్యాయత గొప్పది.

మిగిలిన వాళ్ళ కంటే కవుల దృష్టి సూక్ష్మతరమైనది. కాబట్టి చిన్ననాటి దృశ్యాలూ, సంఘటనలూ కవుల మనస్సులలో చిరస్థాయిగా ఉంటాయి.

మయకోవస్కీ పెద్దవాడయ్యాక రాసిన ”నేను ప్రేమిస్తున్నా” అనే గీతంలో తన బాల్యాన్ని ఇలా స్మరించాడు :

”సూర్యుడు చూశాడు. తల పోశాడు వింతగా !

నలుసులాగ నాకు సరిగ్గా కనపడనే లేదే వీడు!

అయినా ప్రయత్నిస్తున్నాను.

వీడి చిరు గుండెలు కొట్టుకొంటున్నాయి.

”చదవడం సరిగ్గా రాకముందే సాహిత్యం తన జీవితంలో ఒక భాగమైంది మయకోవస్కీకి. తల్లి అలెగ్జాండ్రా అలెక్సేవ్నా చదువుతూ వుంటే వినేవాడు. ప్రశాంతమైన కాటుక కళ్ళు ఆమెవి. మనిషి చిన్నదే కాని చూపులు తీవ్రమైనవి. పుష్కిన్‌ మహాకవి పట్ల అందరి కన్నా ఎక్కువ పరిచయం కుదిరింది మయకోవస్కీకి. ఇది యావజ్జీవితమూ అతణ్ణి అంటి పెట్టుకొనే ఉంది.

”నా కాలం గురించీ, నా గురించి నేనే చెపుతున్నా” అనే స్వీయ చరిత్రాత్మక ఖండికల్లో మయకోవస్కీ నిషిద్ధ విప్లవ గేయాల ద్వారా తనకు విప్లవ దృక్పథం అలవడిందని తెలియజేశాడు. ఆనాటి నుంచి కవిత్వమూ విప్లవమూ అతడి మనసులో అల్లుకుపోయాయి. తన జీవిత సర్వస్వాన్నీ అతడు వాటికే అంకితం చేశాడు.

శ్రీ శ్రీ శ్రీ సోవియట్‌ కవి జన తారా మండలంలో మయకోవస్కీది అగ్రస్థానమని ఈనాడు అందరూ అంగీకరించారు. కాని హఠాత్తుగా అతడు విప్లవ మహాకవి కాలేదు. కవితా శిఖరాగ్రాలను చేరుకోవడానికతడెన్నో కష్టాలు పడ్డాడు. ప్రాచీన సాహిత్యం, ముఖ్యంగా బ్లాక్‌, పుస్కిన్‌ల రచనలు అతణ్ని విశేషంగా ప్రభావితం చేసినప్పటికీ మొట్టమొదటిసారి (1913లో) కవితా వ్యాసంగం ప్రారంభించినప్పుడు సంప్రదాయ విరోధిగా సాహిత్య రంగంలో అడుగు పెట్టేడు. ఔను.. అతని తొలి గీతాల్లో వెనుకటి తరాల కవులను అవహేళన చేసే పోకడలు ఎన్నో ఉన్నాయి.

”నాకు తెలుసు

నా చెప్పులో ఒక మేకు గుచ్చుకొంటోంది

అది గెథే భావనా శక్తి కన్నా

భయంకరమైనది.”

ఈ ”చెప్పులోని రాయి” భావాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా కనిపించే గీతాల్లో మయకోవస్కీ తెలియజెప్పినప్పటికీ, ఆ వెంటనే ఇలా అంటాడు.

”నేను చేసిన, చేయబోయిన వాటి

అన్నిటికన్నా మిన్న

ప్రాణంతో స్పందించే ఒక అల్పాల్ప జీవి”

మనుష్యుల మానవత్వంలోను, ప్రాణుల సజీవత్వంలోనూ తన్ను తాను చూసుకునే ఈ చైతన్యమే, విప్లవాత్పూర్వపు విద్యుత్‌ ప్లావితశక్తుల విజృంభణలో తన ”వ్యక్తిత్వాన్ని” చుట్టూవున్న మానవ మహా సముద్రంలో ముంచివేసి అతని చేత ఈ విధంగా రాయించింది.

             ”అదిగో, ఆకలితో ఎదురు తిరిగిన జన సందోహాల అగ్రస్థానాన

మానవుల దూరదృష్టి కుచించుక పోయిన చోట

విప్లవ కంటక కిరీటంలో 1916 ముందుకు

చొరుచుకు రావడం చూస్తున్నాను,

మీ అందరి మధ్య నేను

దాని ప్రవక్తని నేనే!

ఎక్కడెక్కడ బాధ ఉందో అక్కడక్కడ నేనున్నాను,

కార్చిన ప్రతి కన్నీటి బిందువులో

నన్ను నేను సిలువ వేసుకున్నాను.”

***

మయకోవస్కీ 25 అక్టోబరు 1917 తన జీవితంలోకల్లా మరుపు రాని రోజు అంటాడు. ఆ రోజున సోషలిస్టు విప్లవం మొట్టమొదటి రోజున స్మోల్నీకి వెళ్ళి లెనిన్‌ను చూశాడు. అక్టోబరు విప్లవం ప్రత్యక్ష ప్రభావంతో అతడు రాసిన ప్రత్యక్షరమూ ఉత్సవోత్సాహంతో రింగు రింగుమంటుంది. విప్లవానంతర కాలంలో అతడు రాసిన కవిత అక్టోబరు విజయాన్ని సాధించిన విప్లవ ప్రజానీకపు ఘన కార్యాలను కొనియాడే భావగీతాలూ, డైరీలూ, ఈ ప్రజలు, విప్లవ శత్రువుల సాయుధ ప్రతిఘటనను ఛిన్నాభిన్నం చేశారు. వినాశనాన్నీ క్షామాన్నీ జయించారు. సోషలిజం వైపుగా తిరుగులేని ముందడుగు… ఇవే మయకోవస్కీ తన కవిత్వంలో కన్నులను కట్టినట్టుగా అభివర్ణించాడు.

మొక్కవోని ”విప్లవ నావికుడు”గా మయకోవస్కీ తన కవిత్వపు రెక్కలను ఆకాశపుటంచులలోకి విప్పేడు. కంటికి కనిపించిన ప్రతి విషయమూ అతని కవితా వస్తువయింది. ఇందుకెన్నో రచనా వద్ధతులను అనుసరించాడు. హేళన, భావగీతి, ప్రబంధం… ఏది రాసినా అతని నిజాయితీ అందులో ప్రతిబింబించింది. మానవునికీ విప్లవానికి ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు.

”అట్టడుగు అగాధాల నుంచి

కష్ట జీవులు కమ్యూనిజంలోని కొస్తారు.

గనుల గర్భాల నుంచి

కొడవళ్ళ లోంచి,

కార్ఖానాల నుంచి!

నేను నమున్నత కవితా శిఖరాల నుంచి

కమ్యూనిజంలోకి దూకుతాను!

కమ్యూనిజం నా హృదయం, అది వినా

నాకు ప్రేమ లేదు.”

పై విధంగా అతడు ”గృహోన్ముఖంగా” అనే గీతంలో రాశాడు. ”ఉచ్చైస్వనంతో” అనే ఒక అసంపూర్ణ గీతంలో భావితరాల వారిని సంబోధిస్తూ ఇలా అన్నాడు:

”నా పద్యాల నుంచి

ఒక్క రూబుల్‌ కూడా నాకు దొరక లేదు.

వడ్రంగుల బల్లలూ, కుర్చీలూ

మా యింటికి పంపడం లేదు,

కాని నాకు కావలసినదంతా

ఒక చలువ చేసిన చొక్కా

మిగిలినవంటే నాకసహ్యం

నిజం చెపుతున్నా

అవంటీ నా కనిష్టం”

కవిగా మయకొవస్కీ వ్యక్తిత్వం సంపూర్ణమైనది. ఏదైనా కావాలని అతడావాహన చేశాడంటే అందులో అతనికి పూర్తి విశ్వాసమున్నదన్న మాట.

”మానవుణ్ణి హీనస్థితి నుండి

విడుదల చెయ్యడానికి

నిర్మాణాలు చేసేవాళ్ళ

తుడిచే వాళ్ళ

మెరుగుపెట్టేవాళ్ళ పక్షాన నిలబడతాను.

ఇప్పుడు నా దంటూన్న,

ఇక ముందు వచ్చేవారికి మూడింతలవుతూన్న

స్వదేశం గురించి పాడుతాను.”

ఎవరైనా ఒక విషయాన్ని నమ్మితే వెనుక చూపు లేకుండా త్రికరణ శుద్ధిగా దాన్ని ఆచరణలో పెట్టాలి. చూడండి ఈ దిగువ పాదాలు :

”ఎల్లప్పుడూ ప్రకాశించాలి

ఎల్లచోట్లా ప్రకాశించాలి

చిట్టచివరి దాకా ప్రకాశించాలి

ఇదే నా మతం, మంత్రం

సూర్యుడిదీ ఇదే !

మయకోపస్కీ, వర్తమాన భావి కాల ప్రజలకు ధారాదత్తం చేసిన వారసత్వం. ”వ్లాదిమిర్‌ ఇల్విచ్‌ లెనిన్‌” అనే జీవిత చరిత్రాత్మక కావ్యంలో నైనా, ‘కామ్రేడ్‌ నెట్టోకి’కి నా ”సోవియట్‌ పాస్‌పోర్ట్‌’లోనైనా సూర్యకాంతి ఉంది. వెలుతురుంది. లెనిన్‌ ఆశయాల ప్రకారం వికసిస్తూన్న నూతన సమాజం పట్ల అచంచల విశ్వాసం ఉంది.

మయకోపస్కీ గురించి ఎంతయినా చెప్పవచ్చు. అదో అంతంలేని విషయం. కార్మికుల, విద్యార్థుల ఎదుట అతని అనేక ప్రసంగాలు, విదేశ యాత్రలు (ఈ యాత్రలలో అతడు సోవియట్‌ యూనియన్‌ గురించి యథార్థాలను వివరించేవాడు.) బాలబాలికల కోసం రాసిన పద్యాలు (పెత్యా కథ, దుక్కబ్బాయి, పలచని అబ్బాయి సిమా, సముద్రం గురించీ, దీపస్తంభం గురించీ రాసిన పాట ఏమవాలి). ప్రకటనల కవిత్వం, పోస్టర్‌ చిత్రాలు (మయకోవస్కీ మంచి చిత్రలేఖకుడు) ఇటువంటి ఎన్నింటి గురించి అయినా రాయవచ్చు. మయకోవస్కీ జీవితం ఒక జ్వాలలాగ ప్రజ్వలించింది. లెనిన్‌ ఏర్పరిచిన ప్రభుత్వంలో విద్యాశాఖ ప్రజామంత్రి అయిన ఏ.వి.లూనాచర్‌స్కీ ఇలా రాశారు. : ”…. మయకోవస్కీని స్వయంగా ఎరిగిన వారికి గాని, రచనల ద్వారా తెలుసుకున్న వారికి గాని అతడంటే జీవితం అని అర్థం. గంట కొట్టినట్టుండే అతని కంఠధ్వనిలో ఈ జీవితాన్ని చూస్తాను. నేను అతను కావ్యగానం చేస్తున్నా, ఉపన్యసిస్తూన్నా అందులో క్రమబద్ధమైన ఒక లయ ఉంటుంది. ఈ ప్రశాంతి వెనుకనే ఒక బలం ఉంది. ఔను. ఇది తరుగులేని ఒక జీవశక్తి ఎల్లప్పుడూ అతని సంకల్ప బలానికి విధేయంగా ఉంటుంది. జీవితపు మహోన్నత రూపాల్లో ఇదొకటి. మయకోవస్కీ పుస్తకాల్లో ఎక్కడ తెరిచినా జీవితం ఒక వరదలాగా ముంచెత్తుతుంది.

***

జీవితం! జీవితం! జీవితం!

మయకోవస్కీ జీవిత వర్ణనలో ఘటికుడు.

మరి మృత్యువు?

అనుకోనిది, అతి విషాదకరమైనదీ అతని మరణం. ఆత్మహత్య చేసుకున్నాడతను. ”అందరికీ” రాసిన అతని ఆఖరి ఉత్తరంలో ”ప్రేమ నౌక జీవిత పర్వతాన్ని తాకి బద్ధలైంది.” అన్న ఒకమాటతో కేవలం వ్యక్తిగత కారణాలే తన చర్యకు దారితీశాయని చెబూతూ ”లేని పోని ఊహగానాలు చెయ్యకండి” అన్నాడు. అదే ఉత్తరంలో ”ఇది సరియైన పద్ధతి కాదు. దీన్ని నేను సిఫారును చెయ్యను. కాని, నాకు మరో మార్గం లేక పోయింది. అన్నాడు.

మయకోవస్కీలో ఇంత నిరాశాపూరితమైన భావాలు కలిగించిన వ్యక్తి గత కారణాలేవో మనకి తెలియవు. మనకి తెలిసిందంతా అతని వ్యక్తి జీవితం అస్తవ్యస్తమూ అవ్యవస్థితమూ, లోతుగా చూస్తే ఏకాంతమూ అని మాత్రమే! విశాంత్రి లేకుండా పనిచేసి అతని నరాలు అలసిపోయాయని కూడా మనకు తెలుసు. వీధిలో నడుస్తూన్నా. బిల్లియర్డ్స్‌ ఆడుతున్నా, రైలుబండిలో ఉన్నా నిర్విరామంగా తన కవిత్వం మీదనే కృషి చేసేవాడు.

”మయకోవస్కీ మెట్రో (భూగర్భ) స్టేషన్‌”ను స్వచ్ఛమైన ఉక్కుతో చేశారు. ప్రచండమూ, నిరాడంబరమూ, ఆమోఘమూ అయిన ఉక్కు, నాణాల తయారీకి కాదు. తప్పు అంటే దానికి భయంలేదు. చిరకాల మన్నిక గలిగిన ఈ ఉక్కు భూగర్భంలోని విద్యుద్ధీపాలను ప్రతిబింబిస్తుంది. పైన భూమి మీద లెనిన్‌ అనే సూర్యుడు 1920లో యారోస్లాప్‌ రైల్వే లైన్‌ మీదుగా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని మయకోవస్కీని చూడడానికి వచ్చిన లెనిన్‌ ప్రకాశిస్తారు.

(ఇది మయకోవస్కీ రచన ‘లెనిన్‌ కావ్యం’ ముందు మాట. ఈనెల 21న లెనిన్‌ శత వర్థంతి సందర్భంగా శ్రీశ్రీ తెలుగు అనువాదం నుంచి ఇస్తున్నాం.) – అలెగ్జాండర్‌ నెస్తెరెంకో

➡️