అధ్యక్షుడికి వ్యతిరేకంగా అర్జెంటీనాలో భారీ నిరసనలు

Dec 23,2023 10:40 #Argentina

బ్యూనస్‌ ఎయిర్స్‌ : ప్రజా వ్యయాన్ని తగ్గిస్తానానే హామీతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షులు, పచ్చి మితవాది జేవియర్‌ మిలైకి వ్యతిరేకంగా అర్జెంటీనాలో ప్రజలు ఆందోళనకు దిగారు. మిలై ఆర్థిక చర్యలను వ్యతిరేకిస్తూ వేలాది మంది అర్జెంటీనియన్లు రాజధాని బ్యూనస్‌ ఎయిర్‌ వీధుల్లో నిరసన చేపట్టారు. పేదలకు ఆర్థిక మద్దతు కల్పించాని డిమాండ్‌ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అధ్యక్ష భవనం ఎదుట ఉన్న చారిత్రాత్మక మీటింగ్‌ పాయింట్‌ ప్లాజా డి మయో స్క్వేర్‌ ర్యాలీగా చేరుకున్నారు. మిలై ప్రమాణస్వీకారం చేసిన ప్రాంతంలోనే నిరసన చేపట్టారు. మిలై నియంతలా వ్యవహరిస్తున్నారని నినాదాలిచ్చారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఇది శాంతియుత ర్యాలీ అని, ఆందోళనలు, ఘర్షణలు కోరుకోవడం లేదని వామపక్ష నాయకులు అధ్యక్షుడు ఎడ్వార్డో బెల్లిబోనీ తెలిపారు.

అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్‌ మిలై ఈ నెల 10 బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గతవారం అర్జెంటీనా కరెన్సీ విలువను 54 శాతం తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే సబ్సిడీలను, ప్రభుత్వ సేవలను రద్దు చేశారు. అర్జెంటీనా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే ఈ చర్యలు తప్పవని మిలై పేర్కొన్నారు.

➡️