దినసరి సంత మార్కెట్ కు కాంట్రాక్టర్ల డుమ్మా

Jan 31,2024 17:27 #Anantapuram District
market contractor absent
  • నష్టపోతున్నామన్న స్పందించని కార్పొరేషన్ అధికారులు
  • వేలం నిర్వహించామా చేతులు దులుపుకున్నామా
  • ఇది అధికారుల తీరు – కాంట్రాక్టర్ల వ్యాఖ్య

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి నగరంలో దినసరి సంత మార్కెట్ వేలం దినసరి సుంకం వసూలు చేసుకునేందుకు బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో నిర్వహించిన వేలంపాట టెండర్ కు కాంట్రాక్టర్లు దూరంగా ఉండిపోయారు. సంత వేలం పాట నిర్వహణకు కార్పొరేషన్ కమిషనర్ దూరంగా ఉండిపోయారు. ఈ వేలంపాటకు సంబంధించిన సమాచారం కూడా పత్రికలకు అందజేయని పరిస్థితి నెలకొంది రెవెన్యూ అధికారుల మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్లు సైతం దినసరి మార్కెట్ వేలం పాటలో పాల్గొనలేదు వేలం పాటలో పాల్గొనక పోవడానికి అధికారుల నిర్వహణ వైఫల్యమే కారణంగా కాంట్రాక్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి దినసరి సంత వేలంపాట టెండర్ నిర్వహించామా చేతులు దులుపుకున్నామా అన్న తీరున కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. దినసరి సంత మార్కెట్ సుంకం వసూలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. నగరంలోకి వచ్చే లారీల నుంచి సుంకం వసూలు చేయాలంటే వారు వ్యాపారుల పేరు చెబుతున్నారని వ్యాపారుల వద్దకు వెళితే లారీల వాళ్ళదే బాధ్యత అంటూ చేతులు దులుపుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. పట్టుబట్టి లారీల వాళ్ళ నుంచి సుంకం వసూలు చేయాలంటే వాళ్లు 100కు డయల్ చేసి తమను వేధిస్తున్నారని కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తున్నారని వాపోయారు వారి ఫిర్యాదు పై తప్పు చేసిన వారిలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి నిలబడాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు తమ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవుడిగా మారుతోందని వారు వేదన చెందుతున్నారు. ఈ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తే వారు వినిన విన్నట్టుగా వ్యవహరిస్తూ కాలం వెళ్ళదిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులు పడడం కంటే ఊరికే ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పోటీదారులు వచ్చి వేలంపాట విపరీతంగా పెంచకుండా చూసుకోవాల్సి కూడా ఉంటుందన్నారు. ఏదైనా సర్దుబాటు చేసుకుంటే రింగ్ అయినారు అంటూ విమర్శలు వస్తాయని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల నుంచి సహకారం రాక అటు సుంకం వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించటం కష్టతరమవుతుందని పేర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు లారీ యజమానులతో చర్చించి వారి నుంచి వసూలు చేసేలా అధికారులు సమాచారం వారిరువురికి అందజేసి సమస్య పరిష్కరిస్తే టెండర్ లో పాల్గొనేందుకు వీలవుతుందని వారు తెలిపారు. ఆ దిశగా కమిషనర్ మేఘ స్వరూప్ చర్యలు చేపడితే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే వేలంపాటలు నిర్వహించిన ప్రతి సంవత్సరం ఇదే తంతు కొనసాగుతున్న అధికార యంత్రాంగం ఎలాగో అలాగా కాంట్రాక్టర్ను బతిమాలి టెండర్లు వేయించి కాలం వెళ్లదీస్తున్న తంతు నడుస్తోంది తరువాత పట్టించుకోవటం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం దినసరి సంత మార్కెట్ వేలంపాట నిర్వహణలో సాధారణంగా కమిషనర్ పాల్గొని టెండర్ నిర్వహించటం పరిపాటియని వారు పేర్కొంటున్నారు.

➡️