Lok Sabha polls : బరిలో లేని మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా.. ఆ పార్టీని ముందుండి నడిపించాలని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బిజెపితో తలపడేలా పార్టీని అన్నివిధాలా సన్నద్ధం చేసి ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించేందుకు ఖర్గే కృషి చేయాలని సీనియర్‌ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నేతల అభిప్రాయం మేరకు ఆయన లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీకి దిగడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా కర్ణాటక గుల్బార్గా నియోజకవరగం నుంచి ఖర్గే పోటీ చేయాలని ఆ పార్టీ వర్గాలు భావించాయి. ఆయన పేరును కర్ణాటక సీనియర్‌ నేతలంతా గతవారం ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ ఖర్గే మాత్రం ఆయన అల్లుడు రాధాకృష్ణను ఆ స్థానం నుంచి నిలబెట్టే అవకాశం ఉంది. ఆయన పేరును నామినేట్‌ చేసే అవకాశమున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
కాగా, ఖర్గే గుల్బార్గా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కానీ 2019లో ఓడిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఎగువ సభలో ఈయన పదవీకాలం మరో నాలుగేళ్లు ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఆయన పోటీ చేయకపోవడంపై ఖర్గే మాట్లడుతూ.. ‘నేను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమిత్రం కావాలని కోరుకోవడం లేదు. దేశమంతటా దృష్టి కేంద్రీకరించాలనుకుటున్నాను.’ అని అన్నారు. ఇక ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే కర్ణాటక సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా లేరని సమాచారం.
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటే పోటీ చేయకూడదనే దాఖలు లేవు. గతంలో అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఖర్గే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.

 

➡️