పాక్‌ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓటు హక్కును కాలరాస్తున్న పురుషాధిక్యత

దుర్నాల్‌, పాకిస్తాన్‌ : పాకిస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో పితృస్వామ్య పురుషాధిక్య భావజాలం అక్కడి మహిళల ఓటు హక్కును కాలరాస్తోంది. వయోజనులందరికీ ఓటు వేసే హక్కు వున్నప్పటికీ సామాజికంగా ఛాందసవాద భావాలు కలిగిన పాక్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఇంకా గ్రామపెద్దల పితృస్వామ్య వ్యవస్ధ చెల్లుబాటు అవుతోంది. వారి కమ్యూనిటీల్లో వీరు గట్టి ప్రభావాన్ని చూపిస్తారు. పంజాబ్‌లోని దుర్నాల్‌ గ్రామంలో 50 ఏళ్ళ పై చిలుకు నుండి ఈ నిషేధం అమలవుతోంది. ఇందుకు వారు అనేక చిల్లర కారణాలను చూపిస్తారు. పురుషులతో బాటూ ఆడవారు కూడా ఓటు వేయడానికి వెళితే ఇంట్లో పనిపాటలు, పిల్లల సంరక్షణ ఎవరు చూస్తారు? అని కొంతమంది, స్థానిక అల్లర్లు, ఘర్షణల నుండి ఆడవారిని కాపాడేందుకే అని మరికొందరు సాకులు చెబుతున్నారు. నిరక్షరాస్యత బాగా వున్న రోజుల్లో ఏళ్ళ క్రితం జరిగిన చిన్నా చితక సంఘటనలను ఇందుకు కారణాలు చూపిస్తున్నారు. మరికొంతమంది ఇదొక సాంప్రదాయం అంతేనని ముక్తాయింపులు ఇస్తున్నారు. ఖైబర్‌ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని కొహిస్తాన్‌ పర్వత ప్రాంతంలో గత నెల్లో మత పెద్దలు సమావేశమై ఎన్నికల ప్రచారంలో మహిళలు పాల్గొనడం ఇస్లామ్‌ విరుద్దమని ప్రకటించారు. ఓటు వేయాలని వున్నా తమ భర్తలు విడాకులు ఇస్తారేమోనన్న భయం తమను వెనక్కి లాగుతోందని రాబినా కౌసిర్‌ తెలిపారు. ఆమె హెల్త్‌కేర్‌ వర్కర్‌గా చేస్తున్నారు. మహిళలు ఓటింగ్‌లో పాల్గొనకపోతే ఆ నియోజకవర్గంలో ఎన్నిక చెల్లదని చెప్పేందుకు తమకు అధికారం వుందని పాక్‌ ఎన్నికల కమిషన్‌ చెబుతున్నప్పటికీ వాస్తవానికి పురోగతి మందకొడిగానే వుంది.

➡️