నాయకులందరికీ ఆదర్శం మహత్మా జ్యోతీరావ్ ఫూలే : కలెక్టర్ జె.నివాస్

ప్రజాశక్తి-కాకినాడ : భారతదేశంలో ఉన్న మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహత్మా జ్యోతీరావ్ ఫూలే అని, ఆయన కాంక్షించిన సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జె.నివాస్ కోరారు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి పురస్కరించుకుని గురువారం స్థానిక జీజీహెచ్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ ఎన్వీవీ.సత్యనారాయణ, కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, పలువురు ప్రముఖలు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చనన్నారు. భారతదేశంలో ఉన్న మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహత్మా జ్యోతీరావ్ ఫూలే అని కలెక్టర్ తెలిపారు. మన దేశంలో మహాత్మా అని గాంధీజీ, జ్యోతీరావ్ ఫూలే ఇద్దరు వ్యక్తులను మాత్రమే మనం గౌరవంగా పిలుచుకుంటున్నామని ఏదైనా మార్పు మనలో వచ్చాకే సమాజంలో మార్పు వస్తుందనే దానికి ఉదాహరణగా జ్యోతీరావ్ ఫూలే నిలిచారన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్నా సమయంలో తన భార్యకు ముందుగా విద్యనందించి ఆమె ద్వారా మహిళల విద్య వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీనల వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. ఏ జాతి వల్ల భేదాలు రాకూడదని ఆయన సంకల్పించారన్నారు. ఈనాటికి ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాకినాడ జిల్లా వాసులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం.లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎ. వెంకటలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి.రమణమూర్తి, జౌళి శాఖ ఏడీ పెద్దిరాజు, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు టీవీబీ ప్రసాద్, ఎన్.రాజేశ్వరి, బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు.

➡️