మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్‌

Feb 23,2024 10:26
  • నేటి నుండి మూడు రోజుల పాటు నిరసనలు
  • యువరైతు మృతిపై సిటింగ్‌ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి
  • ఎస్‌కెఎం జనరల్‌బాడీ సమావేశం పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యోయసమ్మతమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా, మార్చి 14న ఢిల్లీలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ నిర్వహణకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) గురువారం పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 23 (శుక్రవారం) నుంచి వరుసగా మూడు రోజుల పాటు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చండీగఢ్‌ లోని కిసాన్‌ భవన్‌లో జరిగిన ఎస్‌కెఎం జనరల్‌ బాడీ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, హర్యానా, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, పంజాబ్‌ నుండి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. హర్యానా పోలీసుల కాల్పుల్లో అమరుడైన శుభ్‌ కరణ్‌ సింగ్‌కు సమావేశం నివాళులర్పించింది. ఆ కుటంబానికి కోటి రూపాయలు పరిహార చెల్లించాలని డిమాండ్‌ చేసింది.

రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు కేంద్రం పన్నిన కుట్రలో భాగమే బుధవారం నాటి కాల్పుల ఘటన అని ఎస్‌కెఎం విమర్శించింది. ఈ కాల్పులకు నైతిక బాధ్యత వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, హర్యానా సిఎం, ఎంఎల్‌ ఖట్టర్‌ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. రైతులపై దమనకాండకు పాల్పడిన పోలీసులపై సెక్షన్‌ 302 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని ఎస్‌కెఎం డిమాండ్‌ చేసింది.

పోలీసులు ధ్వంసం చేసిన 100 టక్టార్లకు మరమ్మత్తుల ఖర్చులు ఇవ్వాలని కూడా కోరింది. మాజీ ఎస్‌కెఎం సభ్యులతో సంప్రదింపులు జరపడానికి జనరల్‌ బాడీ సమావేశం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హన్నన్‌ మొల్లా, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, యుధవీర్‌ సింగ్‌, దర్శన్‌ పాల్‌, రమీందర్‌ పాటియాలా కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఈ నెల 23న అంటే శుక్రవారం బ్లాక్‌ డే పాటించాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా దిష్టిబొమ్మలదగ్ధం, కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర/ సెక్టోరల్‌ ఫెడరేషన్ల సంయుక్త వేదిక ఇప్పటికే బ్లాక్‌ డేకి పిలుపునిచ్చిందని, జిల్లా, స్థానిక, గ్రామ స్థాయిలో నిరసనను విజయవంతం చేసేందుకు రైతులు, కార్మికులు సమన్వయం చేసుకుంటామని తెలిపింది. అబుదాబీలో డబ్ల్యుటిఓ కాన్ఫరెన్స్‌ ప్రారంభం కానున్న సందర్భంగా ఆ రోజున అంటే ఫిబ్రవరి 26న క్విట్‌ డబ్ల్యుటిఓ డేగా పాటించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాక్టర్లతో కవాతు నిర్వహించాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది.

మార్చి14న జరిగే మహా పంచాయత్‌కు సంఘీభావంగా విద్యార్థులు, యువత, మహిళలు, సాంస్కృతిక కార్యకర్తలు, చిరు వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది

➡️