మిర్చి యార్డులో మచ్చుకాయల చిచ్చు – ముఠామేస్త్రీపై దాడి

Jan 12,2024 08:14 #mirchi muta workers‚, #nirasana

– కార్మికుల నిరసన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:గుంటూరు మిర్చి యార్డులో మచ్చుకాయలు (శ్యాంపిల్స్‌) తీయడాన్ని నిషేధించడంపై ముఠా కార్మికులు నిరసన తెలిపారు. వసంతరావు అనే ముఠా మేస్త్రీ మచ్చుకాయలు తీసుకువెళ్తు ండగా ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు అడ్డగించారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వసంతరావుపై సెక్యూరిటీ గార్డు చేయి చేసుకున్నారు. దీంతో ముఠా కార్మికులు విధులు బహిష్కరించి గుంటూరుాసత్తెనపల్లి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పరిపాలనా కార్యాలయాన్ని ముట్టడించారు. యార్డు బయట గోడలకు ఉన్న వైసిపి నాయకుల ఫ్లెక్సీలను చించివేశారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, చైర్మన్‌ నిమ్మకాయల రాజ్‌నారాయణ తదితరుల ఫ్లెక్సీలను తొలగించారు. కొంతకాలంగా యార్డులో మచ్చు కాయల విషయంపై పాలకవర్గానికి ముఠా కార్మికులకు మధ్య వివాదం కొనసాగుతుంది. రైతుల అనుమతితోనే మచ్చుకాయలు తీసుకుంటున్నామని కార్మికులు వాదిస్తుండగా రైతులకు నష్టం చేకూర్చే పనులను అనుమతించబోమని చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ స్పష్టం చేశారు. మచ్చుకాయల పేరుతో ఒక్కొ బస్తాకు రెండు కిలోల వరకు ఉచితంగా తీసుకుంటున్నారని దీనిని ఆమోదించే ప్రసక్తే లేదని చైర్మన్‌ తెలిపారు. దీంతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన వివాదంలో ముఠా మేస్త్రీ వసంతరావుపై చెయ్యి చేసుకున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించామని అధికారులు తెలిపారు.

➡️