వైసిపికి ఎంపి బాలశౌరి రాజీనామా

Jan 14,2024 09:07 #MP, #resigns, #YCP
  • టిడిపిలోకి వెళ్లేందుకు పెనమలూరు ఎమ్మెల్యే సారథి యత్నాలు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపికి మచిలీపట్నం ఎంపి బాలశౌరి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం లేఖను పంపారు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితునిగా పేరున్న బాలశౌరి రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. బాలశౌరికి, మచిలీపట్నం ఎంఎల్‌ఎ పేర్ని వెంకట్రామయ్య (నాని)కి మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య (ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపకులు) భవన్‌ నిర్మాణానికి (యూనియన్‌ బ్యాంకు కార్యాలయం) ఎంపి చొరవతో రూ.40 కోట్లు మంజూరైనా కార్పొరేషన్లో ప్లాన్‌ అప్రూల్‌ కాకుండా నాని అడ్డుపడ్డారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధిష్టానం విడుదల చేసిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల రెండో జాబితాలో నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)ను మచిలీపట్నం ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. మూడో జాబితా విడుదలైనా మచిలీపట్నం ఎంపి బాలశౌరికి పేరు లేకపోవడంతో ఆయన కినుక వహించారు. ఈ క్రమంలోనే వైసిపికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ మచిలీపట్నం ఎంపి స్థానం నుండే పోటీ చేసేందుకు ఆయన జనసేన పార్టీ, టిడిపి నేతలను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో పార్ల మెంట్‌, అసెంబ్లీ స్థానాలు ఆశించి భంగపడిన వైసిపి నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు రాజీనా మాలకు సిద్ధపడుతు న్నారు. పెనమలూరు వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కొలుసు పార్థసారథి ఇటీవల వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలోనే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తనను గుర్తించలేదని వ్యాఖ్యానించారు. వైసిపి మూడో జాబితాలో పెనమలూరు అసెంబ్లీనియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి జోగి రమేష్‌ పేరు ప్రకటించింది. పెడన సిట్టింగ్‌ ఎంఎల్‌ఎగా ఉన్న ఆయనన పెనమలూరు ప్రాంత నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక నేతల్లో ఎవరినైనా ఇన్‌ఛార్జిగా నియమించాలని శనివారం ఆందోళనలకు దిగారు. పెడనకు మంత్రి జోగి స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రామును వైసిపి నియమించింది. ఇప్పటి వరకు అక్కడ మంత్రి జోగి, ఉప్పాల హారిక గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. పార్టీ అధిష్టానం జోగికి స్థానచలనం కలిగించడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. దీంతో, సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు అలకబూనారు. వెలంపల్లికి సహకరించబోమని విష్ణు, ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. అక్కడ వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎగా ఉన్న రక్షణ నిధికి ఈసారి టికెట్‌ ఇవ్వకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వైసిపి విజయవాడ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్‌ కూడా ఆ పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2019 నుంచి పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌తోపాటు పలువురు నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భవకుమార్‌ మాట్లాడుతూ ‘పార్టీని వీడొద్దని నాపై తీవ్ర ఒత్తిడి ఉంది. టిడిపి నేతలతోనూ సంప్రదిస్తున్నా. కార్యకర్తలు, శ్రేమోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. వైసిపిని వీడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

➡️