ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట

Mar 17,2024 11:51 #MLC, #Poems, #relief

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట లభించింది. వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న విషయం విదితమే. శనివారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల తరువాత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతినిచ్చింది. అయితే.. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరగా అందుకు కోర్టు సానుకూలంగా స్పందించింది.

” ప్రతిరోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కవితను కలవొచ్చు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు ” అని కోర్టు తెలిపింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున న్యాయవాదులు, స్పెషల్‌ పీపీ ఎన్‌కే మట్టా, ఈడీ స్పెషల్‌ కౌన్సిల్‌ జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. విచారణలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి.. కవితకు ధైర్యం చెప్పడానికి వెసులుబాటుగా ఉంటుందని, కచ్చితంగా న్యాయం గెలుస్తుందని.. కోర్టులపై తమకు నమ్మకం ఉందని బిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు.

కాగా.. ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే కవిత ఉన్నారు. కాసేపట్లో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. కవిత స్టేట్మెంట్‌, విచారణ ప్రక్రియ మొత్తం ఈడీ అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ, మనీలాండరింగ్‌పైనే ఈడీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. వారం రోజులపాటు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. కవితను కలిసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో.. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులు కలవనున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జాన్సన్‌ నాయక్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కవిత అరెస్ట్‌ అయిన తర్వాత కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లి.. అక్కడే ఉండి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు.. కవిత భర్త అనిల్‌ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని.. అనిల్‌తో పాటు మరికొందరికి నోటీసులు అందాయి. విచారణకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిపై న్యాయనిపుణులతో అనిల్‌, కేటీఆర్‌ చర్చిస్తున్నారు.

➡️