రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి : కౌలు రైతుల సంఘం

Dec 20,2023 13:15 #ntr district
michaung cyclone ex gratia

ప్రజాశక్తి-చందర్లపాడు : మండలంలోని కొడవటికల్లు‌ గ్రామ సచివాలయం‌ వద్ద బుధవారం కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతు, కౌలు రైతులకు పంట నష్టపరిహారం వెంటనే అందించాలని ఆందోళన నిర్వహించడం జరిగింది. అనంతరం సచివాలయ కార్యదర్శికి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ డిసెంబర్ 5,6 తేదీల్లో వచ్చిన మించౌంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలకు రైతు,కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రాఫ్ట్ నమోదు కాని కౌలు రైతులు, రైతులకు కూడా నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుఫాను వల్ల పూర్తిగా దెబ్బతిని రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వెంటనే ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల చేసే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రాపు నమోదుకాని ధాన్యం రైతుల పేరునే ధాన్యం కొనుగోలు జరపాలని అన్నారు.తుఫాను కారణంగా నష్టపోయిన వారికి వరికి ఎకరానికి 25వేలు,వాణిజ్య పంటలకు 50 వేల నష్ట పరిహారం ఇవ్వాలి. ఈ క్రాపు, సిసిఆర్సి కార్డుతో సంబంధం లేకుండా పంట నష్టపరిహారాన్ని కౌలు రైతులకు ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి. నిబంధనలను సడలించి అన్ని పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం మండల అధ్యక్షుడు గుమ్మళ్ల ఏడుకొండలు, నాగినేని వెంకట రామారావు, జంపాని వెంకటేశ్వరరావు, ఎం పరమేశ్వరరావు, ఎన్ హనుమంతరావు సి.హెచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️