గుండె లోతులు కొలిచేవారు

Dec 25,2023 08:17 #sahityam

గుండెల్లేని వాళ్ల గురించి కాదు;

చేతిలో సముద్రాన్ని దాచుకొన్న వాళ్ల గురించి

కుందేలు పిల్లల గుండెల్లోకి

తొంగిచూసిన వాళ్ల గురించి

పసికలువల కళ్ళల్లో వాడిపోతున్న

పసిడి కలల ప్రపంచాన్ని వీక్షించిన వాళ్ల గురించి

మన ఊహా స్వప్నాలు మాతృక లోంచి

ఇంటి గుమ్మంలోకి

దిగివచ్చిన చందమామలు

లయ తప్పుతున్న చిన్నారి గుండెల్లోకి

ప్రాణ వాయువులూదిన

జీవన సంగీత దర్శకులకి

పేదరికం శాపసర్పమై కాటేసిన

చిన్ని పావురాలపై

స్పర్శ సంజీవని ప్రయోగిస్తున్న వాళ్లకి

భవిష్యత్తు కేన్వాస్‌ పైని అసంపూర్ణ చిత్రానికి

విశ్వాసాల హీలింగ్‌ టచ్‌ యిస్తున్న వాళ్ళకి

మన దేహపు రస్తాల పైన విద్యుత్‌ స్పర్శతో

చిన్ని కష్ణ పాదాల ముద్రలు వేసిన వాళ్ళు

మన పిటికెడు గుండె ముద్దలో

ఆర్ధ్రంగా మమతల పూల తోటల్ని నాటిన వాళ్లు

మన అనురాగాల సజీవ సాక్షులుగా

బతుకు వీధుల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న వాళ్లు

రేపటి గాల్లో కలిసిపోతారంటే

బతకగలమా రెప్పపాటైన

దృశ్యం కనుపాపల్లో కదిలితే

గుండెలేని దేవుడిని

శపించాల్సిన అవసరం లేదు

దయగల దేవు ళ్లు ఎందరో మట్టిలో పుట్టాక

కరుణామృతం వర్షించే

క్రీస్తులు మనమధ్యే వున్నాక

వరాలక్కర్లేదు

పిడికెడు సానుభూతి కావాలి

స్పందించి ద్రవించే హృదయం కావాలి

ఈ నేల మీద మనిషిగా పుట్టినందుకు

సగర్వంగా తలెత్తుకు తిరిగే గౌరవం కావాలి

అందుకే మీకుచేతులెత్తినమస్కరిస్తున్నాను

గుండెల్లో గునపాలు గుచ్చే నేలలో

గుండె గాయానికి మలాము రాసే

మహాత్ములు మీరు…

– ఈతకోట సుబ్బారావు 94405 29785

➡️