అసెంబ్లీలో హాజరు పల్చన

Feb 8,2024 10:03 #AP assembly meetings
low Attendance in the assembly
  • సభకు వచ్చినా లాబీల్లోనే కాలక్షేపం 
  • 70 శాతం ఖాళీ కుర్చీలతోనే సభా నిర్వహణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనసభ, శాసనమండలిలో ఓటాన్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సభ్యుల హాజరు పల్చగా ఉంటోంది. నాలుగు రోజుల సమావేశాల్లో ఇప్పటికి మూడు రోజుల్లో అధికార పక్ష సభ్యుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలకు గానూ కేవలం 60 నుంచి 70 మంది హాజరవుతున్నారు. అందులోనూ ఎక్కువ మంది సభలో కొద్దిసేపు కూర్చొని బయటకు వస్తున్నారు. ఫలానా సభ్యులు మాట్లాడాలని చీఫ్‌ విప్‌ నిర్ధారించి సమాచారం ఇస్తే వారే సభకు వస్తున్నారు. ఎక్కువ మంది లాబీల్లో, మంత్రులు, విప్‌ల ఛాంబర్లలో కూర్చుని వారి నియోజకవర్గం పనులు, రాజకీయపరమైన కార్యకలాపాలపై చర్చించుకుం టున్నారు. తాజాగా బుధవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై చర్చించుకోవడం కనిపించింది. బిజెపి, టిడిపి, జనసేన పొత్తు ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరిగింది. ఎక్కువ మంది సమావేశాలకు హాజరుకాకపోవడం, హాజరైనా సభల్లో కూర్చొని చర్చల్లో పాల్గొనకుండా బయటకు వెళ్తున్న పరిస్థితి ఉభయ సభల్లో కనిపించింది. మంగళ, బుధవారాల్లో టిడిపి సభ్యులు ప్రతిరోజూ శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే సస్పెండ్‌ అవుతున్నారు. మండలిలో సస్పెన్షన్‌ పర్వర లేకున్నా సభ్యుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంటోంది. టిడిపి, పిడిఎఫ్‌ సభ్యులు ఎక్కువగా చర్చల్లో పాల్గొంటున్నారు. అధికార పార్టీ సభ్యులు చీఫ్‌ విప్‌, విప్‌లు ఎవరి పేర్లు అయితే మాట్లాడేందుకు ఛైర్మన్‌కు ఇస్తారో వారే ఉంటున్నారు. మిగతావారు అడపాదడపా వచ్చి వెళ్తున్నారు. వైసిపిలో ఇప్పటికే ఎక్కువ మందికి సీట్లు మార్చడంతో పలువురు ఎమ్మెల్యేలు సభకు రావడం లేదనే ప్రచారం ఉంది. అంతేకాకుండా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు లేకపోవడం వల్ల ఎక్కువ మంది రావడం లేదంటున్నారు. మంత్రులు మాత్రం శాసనసభకు హాజరవుతున్నారు. శాసనమండలికి మాత్రం ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు కౌన్సిల్‌లో కేవలం 8 మంది సభ్యులు పాల్గొనగా, సభా నాయకుడి తరఫున మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమాధానం ఇచ్చారు. శాసనసభలో మాత్రం సిఎం జగన్‌ సమాధానం ఇచ్చారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టగా, మండలిలో పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ప్రవేశపెట్టారు. గురువారం బడ్జెట్‌పై చర్చ అనంతరం సభామోదంతో ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.

➡️