నీట మునిగిన ఆశలు

Apr 18,2024 00:17

కార్తిక్‌ మృతదేహం వద్ద కుటుంబీకుల రోధన
ప్రజాశక్తి – మేడికొండూరు :
పేదలైన తల్లిదండ్రుల తమ రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డను ఉన్నత చదువులు చదివించారు. ఇంకొన్నాళ్లు ఆగితే తమ బిడ్డ తమకు ఆసరాగా నిలుస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిలింది. స్నేహితులతో కలిసి కాల్వకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన మండలంలోని పేరేచర్ల గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద బుధవారం జరిగింది. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావు, సుజిని దంపతుల కుమారుడు కార్తిక్‌ మేడికొండూరు మండలం డోకిపర్రులోని యూనివర్సల్‌ కాలేజీలో బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా కళాశాల సెలవు కావడంతో పేరేచర్లలోని దేవాలయం వద్దకు స్నేహితులు సుదర్శన్‌, యశ్వంత్‌, ఇమ్రాన్‌తో కలిసి వచ్చాడు. అనంతరం పేరేచర్ల గ్రామ సమీపంలో ఉన్న గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు వెళ్లి ఈతకు దిగారు. ఈత కొట్టే క్రమంలో నీటిఉధృతికి కార్తీక్‌ కొట్టుకుపోతుండగా కాపాడేందుకు ఇమ్రాన్‌ ప్రయత్నించాడు. అయితే ఇమ్రాన్‌ కూడా కొట్టుకుపోతుండడంతో మిగతా ఇద్దరు కలిసి ఇమ్రాన్‌ను కాపాడారు. కొద్దిసేపటికే కార్తిక్‌ గల్లంతవడంతో మిగతా ముగ్గురు తమ స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా కాల్వ వద్దకు వచ్చి గాలించారు. ఇంతలో సమాచారం అందుకున్న సిఐ డి.జయకుమార్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గల్లంతవగా సాయంత్రం 4 గంటలకు ఘటనా స్థళి నుండి 2 కిలోమీటర్ల దూరంలో కార్తిక్‌ మృతదేహం లభ్యమైంది. కాలేజీ యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు కాల్వ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి భవన నిర్మాణ కార్మికుడు కాగా వారికి కార్తిక్‌ ఏకైక కుమారుడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)కు తరలించారు.
కొమ్మమూరు కెనాల్‌ లో విద్యార్థి గల్లంతు
ప్రజాశక్తి తెనాలి : శ్రీరామనవమి పండుగ పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈత సరదా తీర్చుకునేందుకు బుధవారం సాయంత్రం విజ్ఞాన్‌ లారా కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సంఘం జాగర్లమూడి వచ్చారు. గ్రామంలో సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో కాల్వలో ఈతకు దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే నలుగురు విద్యార్థులు కాల్వ ఒడ్డున ఉండగా గల్లా వంశీకృష్ణ ఈతకు దిగాడు. అతను మునిగిపోతుండగా గమనించిన మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. స్థానికులు కూడా ఆ యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. నీటి ఒరవడికి వంశీకృష్ణ గల్లంతయ్యాడు. వంశీకృష్ణ పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం ఇక్కుర్రుకు చెందిన చెందిన విద్యార్థి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️