జిందాల్‌ ప్రవేశంతో నష్టాల కొలిమి

Apr 10,2024 07:41 #losses, #visaka, #visaka steel plant
  • వికటించిన కేంద్రం ఆర్థిక చిట్కాలు
  • అగాథంలో ‘విశాఖ ఉక్కు’

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెట్టేసే కుట్రలు కొనసాగిస్తోంది. ప్లాంట్‌లోని విభాగాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వచ్చిన కేంద్రం… తాజాగా ఐరన్‌, కోక్‌ల విషయంలో జిందాల్‌పై ఆధారపడేలా చేసి మరింత నష్టాల కూపంలోకి ప్లాంట్‌ను తోసేసే కుట్రలకు తెగబడింది. 2021 జనవరి 20న కేంద్రంలోని బిజెపి సర్కారు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం వ్యూహాత్మక అమ్మకం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి విశాఖలోనూ, రాష్ట్రంలోనూ ఉద్యమం కొనసాగుతోంది. 2022 జనవరిలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను మూసేసి ‘మీ డబ్బులు మీరే తెచ్చుకుని ప్లాంట్‌ను బతికించుకోండి’ అన్న… మోడీ సర్కారు ఆదేశాలకు స్టీల్‌ యాజమాన్యం సై అంటూ జిందాల్‌కు స్వాగతం పలికింది. 2023లో జిందాల్‌ను ప్లాంట్‌లోకి మోడీ తెచ్చారు. ఆ తర్వాత ఉత్పత్తి పూర్తిగా కుంటుపడింది. రాయబరేలిలోని రూ.2 వేల కోట్ల ఫోర్జ్‌ వీల్‌ ఫ్యాక్టరీ (స్టీల్‌ప్లాంట్‌కు చెందినది)ని సైతం రూ.19 కోట్లకు అమ్మేశారు. ఆ డబ్బులు ఇంతవరకూ ప్లాంట్‌కు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వకుండా, అప్పు కూడా బ్యాంకుల నుంచి పుట్టనివ్వకుండా ప్రభుత్వ ధనమంతా ప్లాంట్‌కే ధారపోసినట్లు బిజెపి ప్రచారం చేస్తోంది. ప్రజలను తప్పుదోవపట్టించి కార్మిక పోరాటాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు కొనసాగిస్తోంది. కరోనా కాలం రెండేళ్లలో కేవలం రూ.800 కోట్లు మాత్రమే స్టీల్‌ అమ్మకాలు జరిగాయి. ఆనాడెప్పుడూ కార్మిక, ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది రాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు స్టీల్‌ అమ్మకాలు జరిగినా జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, అధికారులు జీతాలకు సైతం నోచుకోని తాజా పరిస్థితులపై అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘కోల్‌ ‘ బదులు కోక్‌ కొంటూ…
ఇతర దేశాల నుంచి కోల్‌ దిగుమతి చేసుకుని కోక్‌ తయారు చేసుకోవడం ప్లాంట్‌లో ఆనవాయితీగా ఉండేది. మోడీ ప్రభుత్వం నిర్ణయంతో నేరుగా జిందాల్‌ దగ్గర కోక్‌ కొనుక్కోవడం మొదలైంది. ప్లాంట్‌కు కోకోవెన్‌ బ్యాటరీలు ఐదు ఉన్నా వీటిల్లో ఉత్పత్తి తగ్గించుకుని జిందాల్‌ నుంచి నేరుగా కోక్‌ కొనుగోలు చేయాలనే నిర్ణయించడం వల్ల టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనపు భారం ప్లాంట్‌పై పడుతోంది. వాస్తవానికి 420 కుషింగ్స్‌ రోజుకు తయారు చేసుకునే కెపాసిటీ స్టీల్‌ప్లాంట్‌కు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తిని 60 శాతానికిపైగా తగ్గించుకుని జిందాల్‌పై పూర్తిగా ఆధారపడేలా కేంద్రం చేసిన నిర్ణయంతో ప్లాంట్‌ ఆర్థిక పరిస్థితి దినదినగండంగా మారింది. ఎన్‌ఎండిసి నుంచి ఐరన్‌ ఓర్‌ను ప్లాంట్‌ తీసుకునేది. ఎన్‌ఎండిసితో ప్లాంట్‌కు కాంట్రాక్టు ఉంది. రోజుకు ఎనిమిది ర్యాకులు కావాలి. జిందాల్‌ ఎంట్రీ తర్వాత సరాసరి ఐదు ర్యాకులు కూడా రావడం లేదు. కేంద్రం ఇవ్వనీవ్వడం లేదు. ఒక ర్యాకులో నాలుగు వేల టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉంటుంది. ఐరన్‌ ఓర్‌ ప్లాంట్‌కి లేదు కాబట్టి పెల్లెట్స్‌ వాడాలన్న కేంద్రం ఆదేశాలను స్టీల్‌ యాజమాన్యం పాటిస్తోంది. ఇది కూడా జిందాల్‌ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఐరన్‌ ఓర్‌ ధర రూ.5 వేలు. అయితే, రూ.12 వేలకు స్టీల్‌ప్లాంట్‌ పెల్లెట్స్‌ కొంటోంది. ఇది మరో భారంగా ప్లాంట్‌కు పరిణమించింది. అంటే, కోల్‌ బదులు కోక్‌ కొంటూ… ఐరన్‌ ఓర్‌ బదులు పెల్లెట్స్‌ కొంటూ భారం పెంచారు. ఈ రెండింటి ద్వారా జిందాల్‌కు కోట్ల రూపాయలను కేంద్రం, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కలిసి దోచిపెడుతున్నాయి. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3లోకి జిందాల్‌ ఎంట్రీ ఇవ్వడానికిగానూ కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం మరలా 90 వేల టన్నులను ప్లాంట్‌ ఇవ్వడంతో మరింత అగాథంలోకి ఉక్కు కర్మాగారం నెట్టబడుతోంది.

➡️