ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్

ఢిల్లీ : ‘సంసద్ మే భీ కేజ్రీవాల్, డిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్’ అనే నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్‌తో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ “నా కుటుంబంగా ఉన్న ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేశాను. ” ఆప్ పాలిస్తున్న ఢిల్లీ, పంజాబ్‌లలో మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంది” అని  కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తుందని కేజ్రీవాల్ అన్నారు  ఏడుగురు ప్రతిపక్ష అభ్యర్థులను పార్లమెంటుకు పంపడం ద్వారా తనను “బలపరచాలని” ప్రజలను కోరారు. ఢిల్లీలో ఎన్నుకుని అధికారంలోకి తెచ్చినందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నారని అన్నారు. మొహల్లా క్లినిక్‌లను బుల్‌డోజర్‌లతో కూల్చివేశారని, ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని, ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్-మేలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

➡️