‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 20,2023 22:25 #approves, #Criminal' Bills, #Lok Sabha

– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్‌

– ప్రతిపక్షాల ఆగ్రహం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను రికార్డు స్థాయిలో సస్పెండ్‌ చేసి, బిజెపి దానికి జీహూజూరు అనే పార్టీల సభ్యులు మాత్రమే సభలో ఉన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ఈ బిల్లులపై తూతూమంత్రంగా చర్చ జరిపారు. అనంతరం మూజువాణీ ఓటుతో ఆమోదించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చకు సమాధానం ఇచ్చారు. ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్యధార (బిఎస్‌) చట్టాలు తీసుకొచ్చేందుకు అదే పేర్లతో మూడు కొత్త బిల్లులను ఆమోదించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తరువాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను లోక్‌సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. టెలి కమ్యూనికేషన్‌ బిల్లు ఆమోదంలోక్‌సభలో టెలి కమ్యూనికేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ సేవలను బిల్లు పరిధిలోకి చేర్చారా లేదా అని కనీసం ముగ్గురు ఎంపిలు అడిగినప్పటికీ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేయలేదు. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అలాగే రాజ్యసభలో సిజిఎస్‌టి రెండో సవరణ బిల్లు ఆమోదం పొందింది. మరో ఇద్దరు సస్పెన్షన్‌ పార్లమెంట్‌లో భద్రత వైఫల్య ఘటనపై చర్చించాలని, కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ వేస్తూ ఆందోళన చేసిన మరో ఇద్దరు ఎంపిలను సస్పెండ్‌ చేశారు. బుధవారం సిపిఎం ఎంపి ఎఎం ఆరీఫ్‌, కేరళ కాంగ్రెస్‌ ఎంపి థామస్‌ చజికదన్‌లను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు. తాజా సస్పెన్షన్‌ తో ఈ సెషన్‌లో సస్పెండ్‌ అయిన వారి సంఖ్య 143కి చేరింది. సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్‌ ఎలా చేస్తారంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతున్నారు. సస్పెండ్‌ను నిరసిస్తూ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు.

➡️