సినిమాలకు ఊరి పేర్లతో స్థానిక సౌరభం!

Mar 4,2024 10:06 #jeevana, #movies

ఊరి పేర్లతోనూ, గ్రామీణ నేపధ్యంలో వస్తున్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఊరి పేరుకు తోక తగిలిస్తూ టైటిల్‌ పెట్టి తీస్తున్న సినిమాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. స్థానికతకు తోడు టైటిల్‌ భలే ఉందనే పేరుతో చాలామంది ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. టైటిల్‌ కూడా కీ రోల్‌ పోషిస్తుండటంతో దర్శక నిర్మాతలు ఏరికోరి మరీ సినిమాలకు ఊరి పేర్లు పెట్టేస్తున్నారు. ఆయా సినిమాలు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊర్ల పేర్లతో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. గతంలో పలు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం మరికొన్ని వస్తున్నాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పలాస, బెదుర్లంక, రంగస్థలం, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌, ఊరుపేరు బైరవకోన తదితర సినిమాలు వచ్చాయి. సింహాచలం, శ్రీశైలం, బద్రినాథ్‌, స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్‌, బెజవాడ, ద్వారక, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. మచ్చుకు కొన్ని సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు : హీరో సుహాస్‌, హీరోయిన్‌ శివాని నగరం నటించిన ఈ సినిమాకు దుష్యంత్‌ కటికనేని దర్శకత్వం వహించారు. అంబాజీపేటలో 2007 నేపథ్యంలో కథ సాగుతుంది. బ్యాండ్‌ పార్టీలో పనిచేసే మల్లి, కోటీశ్వరుడైన వెంకట్‌ చెల్లెలుతో ప్రేమలో పడతాడు. అప్పటి పరిస్థితులను, ఎమోషన్స్‌ను దర్శకుడు బాగా చూపించారు.

ఊరు పేరు బైరవ కోన : హీరోగా సందీప్‌ కిషన్‌, హీరోయిన్లుగా వర్ష బోల్లమ్మ, కావ్య థాపర్‌ నటించారు. హీరో, అతని స్నేహితుడు ఒక దొంగతనం చేసి అనుకోకుండా బైరవకోనలోకి వస్తారు. వీరితోపాటుగా హీరోయిన్‌ కూడా ఊర్లోకి వస్తుంది. ఈ క్రమంలో అనేక ట్విస్టులు సాగుతాయి. అసలు ఈ భైరవకోనకూ, మిగతా ఊర్లకు తేడా ఏంటీ? అంటూ అసలు కథలోకి తీసుకెళ్తారు.

బెదురులంక : హీరో కార్తికేయ నటించిన చిత్రం ఇది. ఈ సినిమా షూటింగు ఎదుర్లంకలో జరిగింది. 2012లో ప్రపంచం అంతం అవుతుందని గ్రామ ప్రజలు భయపడుతున్న క్రమంలో గ్రామ పెద్ద ఇద్దరు నకిలీ దేవతలను సృష్టించి గ్రామస్తులను భయపెట్టి వారి నగలను దోచుకోవాలని ప్రయత్నిస్తాడు. గ్రామంలో శాంతిని నెలకొల్పటానికి హీరో ప్రయత్నిస్తాడు.

కేరాఫ్‌ కంచరపాలెం : విజయవాడకు చెందిన వెంకటేష్‌ మహాకు కంచరపాలెంతో అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో చక్కటి కథతో ఈ సినిమా రూపొందించాడు. తక్కువ బడ్జెట్‌తో 50 మంది స్థానికులతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చోటు దక్కించుకున్న తొలి తెలుగు చిత్రం ఇది.

భీమిలి : కబడ్డీ నేపధ్యంలో హీరో నాని నటించిన చిత్రం భీమిలి (కబడ్డీజట్టు). ఇందులో నాని కబడ్డీ టీం భీమిలికి చెందింది కావటంతో టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా కూడా హిట్టయ్యింది.

పలాస : తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధాస్‌ మీడియా పతాకంపై ధ్యాన్‌ అట్లూరి నిర్మాణ సారధ్యంలో కరుణకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. రక్షిత్‌, నక్షత్ర, రఘు కుంచె తదితరులు నటించారు. 1978 ప్రాంతంలో అగ్ర కులాలవారు తమ స్వార్థం, రాజకీయ బలంతో అణగారిన వర్గాలను ఎలా అణచివేశారనే ఇతివృత్తంగా ఈ సినిమా సాగింది.

అన్నవరం : పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఈ సినిమా తీశారు. చెల్లికి తోడుండే అన్నయ్య క్యారెక్టర్‌లో ఆయన నటించారు. ఈ సినిమాలో పవన్‌ పేరు ‘అన్నవరం’.

గంగోత్రి : అల్లు అర్జున్‌ తెరంగేట్రం చేసిన సినిమా ఇది. రాఘవేంద్రరావు దర్శకుడు. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా నేపధ్యం ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు. హీరోయిన్‌ పేరు కూడా గంగోత్రి.

బొంబాయి : బొంబాయిలో మతకల్లోలాల్లో ఇరుగ్రూపుల మధ్య జరిగిన గొడవలు, రక్తపాతం, ప్రాణనష్టాలను ఈ సినిమాలో చూపించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అదే సిటీ పేరుపెట్టారు.

అరుణాచలం : రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం. తమిళనాడులోని ప్రసిద్థ క్షేత్రం కూడా అరుణాచలమే. భద్రాచలం : హీరో శ్రీహరి నటించిన ఈ సినిమాను దర్శకుడు ఎన్‌.శంకర్‌ చేశారు. పట్టుదల ఉంటే సాధించొచ్చు అని చెప్పే కథ.

అనంతపురం : తమిళ సినిమాను తెలుగులోకి డబ్బింగ్‌ చేసి ‘అనంతపురం’ పేరు పెట్టారు.

హనుమాన్‌ జంక్షన్‌ : ఏలూరుకి సమీపంలోని హనుమాన్‌జంక్షన్‌ పేరుతో కూడా సినిమా వచ్చింది. ఈ పట్టణం పేరుతో జగపతిబాబు, అర్జున్‌, వేణు హీరోలుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇలా చెప్పుకుంటూ చాలా సినిమాలే ఉన్నాయి. స్థానికత జోడించి సినిమాలకు పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునేలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని స్థానికత, భాష, యాసలను ఉపయోగిస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా సినిమాగా ‘పుష్ఫ’ పాన్‌ ఇండియా సినిమాగా నిలిచింది. తాజాగా నాగచైతన్య, రామ్‌చరణ్‌ ఉత్తరాంధ్ర నేపధ్యంతో సాగే సినిమాలపై దృష్టి సారించారు.

 

➡️