చిన్న కాకి

Dec 9,2023 09:26 #feature

             ఒక పెద్ద మర్రిచెట్టు మీద కాకులన్నీ తమ గూళ్లను నిర్మించుకుని పిల్లలతో హాయిగా జీవిస్తున్నాయి. ఇంతలో వేరే ప్రాంతం నుంచి ఒక చిన్న కాకి ఆ చెట్టు పైకి నివాసం ఏర్పరచుకోవాలని వచ్చింది. ఇది గమనించిన మిగిలిన కాకులు ఇక్కడ గూడు కట్టుకోవడానికి వీలు లేదంటూ వాదించడం మొదపెట్టాయి. ఎవరెన్ని చెప్పినా నువ్వు ఇక్కడ ఉండరాదు అంటూ ఏకతాటిపై నిలబడ్డాయి.

చేసేదిలేక ఆ చిన్నకాకి పక్కనున్న చెట్టు తొర్రలో చిన్న ఉడుత పిల్లతో నేస్తంగా జీవించడం మొదలు పెట్టింది. ఉడుత తెచ్చిన ఆహారం కాకి, కాకి తెచ్చిన తిండి ఉడుత పంచుకొంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి.

కొన్ని రోజుల తరువాత మర్రిచెట్టు దగ్గర అన్ని కాకులూ ఏదో ఆందోళనగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఏమైందో కనుక్కుందామని అక్కడికి వెళ్ళిన చిన్నకాకికి ఎవ్వరూ సమాధానం చెప్పకుండా విసుక్కుని పంపించేశారు. అప్పుడు అటుగా వస్తున్న ఉడుత ‘పాపం ఒక కాకి పిల్ల ప్రాకుతూ వెళ్ళి చిన్న బొరియలోకి దూరేసిందంట, అందులో నుండి రాలేక అరుస్తూ వుంది. ఎవ్వరూ ఆ బొరియలోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు’ అని జరిగిన విషయం చెప్పింది.

చిన్న కాకి వెంటనే బొరియ దగ్గరికి వెళ్లి తన చిన్న శరీరం ఇందుకు ఉపయోగపడుతున్నదని చెప్పి, అందులోకి వెళ్ళి కాకి పిల్లను బయటకు తీసుకువచ్చింది. దాని సాహసానికి, సహాయానికి కాకులన్నీ సంతోషించాయి. తమ తప్పు తెలుసుకున్న మిగిలిన కాకులు ఆ చిన్న కాకిని తమతోపాటు ఉండమని, ఒక మంచి గూడును కూడా నిర్మించి ఇచ్చాయి. స్నేహం మరువని చిన్న కాకి ఉడుతకు కూడా మంచి గూడు కట్టించి తనతో పాటు ఉండమన్నది. ఆకారం బట్టి, ఎవరినీ అంచనా వేయకూడదని భావించి అప్పటి నుంచి కాకులన్నీ చక్కగా కలసి మెలసి జీవించ సాగాయి.

– సింగంపల్లి శేష సాయి కుమార్‌, 86396 35907.

➡️