సమ్మె శిబిరాల్లో సాహిత్య సృజన

Dec 25,2023 09:39 #sahityam

            పాట పుట్టిందే పనీపాటల్లోంచి కాబట్టి, అనాదిగా అది కష్టజీవి పక్షమే! ఉవ్వెత్తున సాగిన ఉద్యమాల్లోంచి జనంపాట ఉద్భవించింది. ఆ పాటే పోరు నినాదమై, ఉద్యమానికి తోడు నీడైౖ, ఆత్మ విశ్వాసమై నిలబడింది. ప్రజా ఐక్యతను చాటి చెప్పింది. స్వాతంత్య్ర ఉద్యమంలో, వామపక్ష, ప్రజా ఉద్యమాల్లో అలాంటి పాటలు ఎన్నో పుట్టాయి. జనం ఆశను, ఆకాంక్షను గట్టిగా చాటి చెప్పాయి. ”మాకొద్దీ తెల్లదొరతనమూ ..” అని గరిమెళ్ల గొంతెత్తి పాడినా; స్వాతంత్య్ర అనంతరం ”మాకొద్దీ నల్లదొరమ”ని కుసుమ ధర్మన్న కవి ధైర్యంగా అడిగినా – ఆ పాటలను పాలకులు కంపించక తప్పలేదు. అనేకానేక నోళ్లు ఆ పాటలను పదే పదే పాడి ప్రజల ఆకాంక్షను ఆనాటి పాలకులు గ్రహించేలా గర్జించాయి.

పాటైనా, కవితైనా, మరే కళారూపం అయినా ప్రజల భావోద్వేగాల నుంచి పుట్టుకురావడం ఒక సహజమైన ప్రక్రియ. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలూ, సహాయకులూ అప్పటికప్పుడు, అక్కడికక్కడ పాటలను అల్లుకొని, రాగాలను సమకూర్చుకొని, గొంతెత్తి పాడుతున్నారు. వివిధ కళారూపాల్లో తమ ఆకాంక్షలను వెల్లడిస్తున్నారు. జానపద కళలను ఉద్యమ గీతాలతో హుషారెత్తిస్తున్నారు. హరికథ, బుర్ర కథ, కోలాటం… ఒకటేమిటి? అనేక కళలు సమ్మె శిబిరాల్లో సరికొత్త స్వరాలను సంతరించుకుంటున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అంగన్‌వాడీ ఉద్యోగులు తప్పనిసరై విధులను బహిష్కరించి, సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో తాము ఏయే పనులు చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో వివరిస్తూ – పాటలు కూర్చి, పాడుతున్నారు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్న జానపద బాణీలను ఉపయోగించి, ఇలా పదాలను అల్లుతున్నారు.

”రావనా చందనాలో ఎన్నెలా … జగనన్నకు వందనాలో

ఏమయ్యా జగనన్నా – ఎన్నెలో ఎన్నెలా

జీతాలూ పెంచమంటే – ఎన్నెలో ఎన్నెలా

ఉలుకు పలుకు లేకుంటే – ఎన్నెలో ఎన్నెలా

ఎండలోన మేముంటే జగనన్న ..

నువ్‌ ఏసీలోన పడుకుంటివి జగనన్న” అంటూ విజయనగరం జిల్లా సీతానగరంలో అంగన్వాడీలు పాట కట్టి వినిపించారు. తమ కష్టాలను ఏకరువు పెడుతూ, తెలంగాణా కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువే ఇస్తానన్న జగన్‌ హామీని గుర్తు చేస్తూ, తమ డిమాండును వినిపించారు. తాము సమ్మెలో ఉండగా, అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను తాళాలను బద్దలు కొట్టడాన్ని చాలా చక్కని వాదనతో నిరసించారు.

”కరోనా టైములోన – ఎన్నెలో ఎన్నెలా

ఏ అధికారీ రాకపోయే – ఎన్నెలో ఎన్నెలా

సూపర్‌ వైజరు రాకపోయే – ఎన్నెలో ఎన్నెలా

పీడీ గారు రాకపోయే – ఎన్నెలో ఎన్నెలా

మేము లేని టైము చూసి – ఎన్నెలో ఎన్నెలా

తాళాలు పగలు గొడ్తిరి – ఎన్నెలో ఎన్నెలా …” అంటూ ప్రభుత్వం తీరును సూటిగా ఎండగట్టారు. నిజమే కదా! కోవిడ్‌ ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు, ఎవరికి వారు భయపడి ఇళ్లల్లో దాగుండి ఉన్నప్పుడు – తమ ఊరి వారి బాగోగులు చూసు కున్నది ఎవరు? వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరు? పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు సేవలు అందించింది ఎవరు? అంగన్‌వాడీలూ, ఆశా కార్యకర్తలే కదా? ఈ విషయాన్ని పాటలో చక్కగా కూర్చి, ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీలు. ప్రజల కష్టకాలంలో రానివారు ఇప్పుడు ఇలా విరుచుకుపడడం న్యాయమా? అని ప్రశ్నించారు.

అలాగే మరొక జానపద బాణీ ”అక్కా అక్కా అక్కో నీ తమ్ముళ్లొచ్చాం అక్కో ..” వరసలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శిబిరంలో పాట మార్మోగింది. అక్కడి కార్యకర్తలు ఆ పాటను కూర్చి, పాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను రక్షించుకోవటానికి వాటి ద్వారా ప్రయోజనం పొందుతున్న తోటి అక్కలూ, చెల్లెళ్లూ కలిసి రావాలని కోరుతున్నారు.

”అక్కా…అక్కో అక్కో అక్కో నీ చెల్లెళ్లొచ్చామక్కా

ఈ సర్కారోడు అక్కో – మా సెడ్డ కానోడక్కా

మన అంగన్‌వాడీ బడినీ- ప్రైవేటోడికి అక్కా

కట్టబెట్ట జూస్తున్నడక్కా… దాన్ని అడ్డుకోవాలక్కా

బువ్వ పెట్టే బడినీ – బుద్దులు చెప్పే బడినీ

కాపాడుకోవాలక్కా – మనమైక్యం కావాలక్కా” అంటూ మహిళా లోకాన్ని మేల్కొల్పుతున్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు, ఆ చుట్టుపక్కల మహిళలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అనేక సేవలు అక్కడి నుంచే వారికి అందుతాయి. అందుకనే కదా, రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు కేంద్రాలను తాళాలు బద్దలు కొట్టి బలవంతంగా తెరవ బోతుంటే- స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి అడ్డుకుంటున్నారు. తమకూ, అంగన్వాడీ కార్యకర్తలకు ఉన్న బంధాన్ని చాటి చెప్పి, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.

13 రోజులుగా అంగన్‌వాడీ బడి మూత పడడంతో బుజ్జిగాడికి బువ్వ లేదని, ఆటపాటల్లేవని ఆవేదనతో ఒక తల్లి కోణంలో పాటను అల్లారు. ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో గైరమ్మ అనే గ్రామదేవత కొలువులు తీసే సమయం ఇది. అందుకనే ఆ గైరమ్మను ఉద్దేశించి ఈ పాట సాగుతోంది.

”నోమి నోమన్నాల – తుమ్మేతో

నోమన్నలారా – తుమ్మేత

అమ్మ గైరమ్మా – తుమ్మేతో

ఆలకించాలమ్మ – తమ్మేతా”

మా అంగన్‌వాడీ బడి – తుమ్మేతో

మూత బడిపోయింది – తుమ్మేతో

మా బుజ్జిగానికి – తుమ్మేతో

బాలామృతం లేదు – తుమ్మేతా

ఆటపాటలు లేవు – తుమ్మేతో

అక్షరాలూ లేవు – తుమ్మేతా”

బాలింత…చూలింతకు – తుమ్మేతో

బలమైన తిండీ – తుమ్మేతో

పాలు గుడ్డూ లేదు – తుమ్మేతా

పప్పు అచ్చులు లేవు – తుమ్మేతా

అటుకుళ్లు లేవమ్మ – తుమ్మేతా

పాలకులు కదలాలీ – తుమ్మేతో

జీతాలు పెంచాలో – తుమ్మేతా”

అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు సంఘీభావం తెలిపే కోణంలో సాగే పాట ఇది. వారి ద్వారా పిల్లలకు ఏయే సేవలు అందుతున్నాయో ఆ పాట చక్కగా కళ్లకు కట్టేలా చెబుతోంది.

తూర్పు గోదావరి జిల్లాలోని ఒక సమ్మె శిబిరంలో కార్యకర్తలు కవులై అల్లిన మరో పాట ప్రభుత్వ వైఖరిని ఎండగడుతోంది.

”జగనన్నా సామ్రాజ్యమో – ఎన్నెలా

మనకెంతో దౌర్భాగ్యమూ – ఎన్నెలా

మన హక్కుల కోసమూ – ఎన్నెలో ఎన్నెలా

పోరాటం చేస్తుంటే – ఎన్నెలో ఎన్నెలా

బెదిరింపులు ఎన్నెన్నో – ఎన్నెలో ఎన్నెలా

అదిలింపులు ఎన్నెన్నో – ఎన్నెలో ఎన్నెలా

సాధింపులు ఎన్నున్నా ఎన్నెలా

మా పోరాటం ఆగదన్న ఎన్నెలా ”

అంగన్వాడీల ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ సానుకూలంగా స్పందించలేదు. పైగా కొంతమంది అధికారులు, మంత్రులూ బెదిరింపులకు దిగుతూ మాట్లాడారు. అలాంటి ధోరణులకు తాము బెదిరేది లేదని, హక్కులు సాధించుకునే దాకా ఐక్యంగా పోరాటం సాగిస్తామని అంగన్వాడీ ఆశు కవులు నొక్కి వక్కాణిస్తున్నారు.

”ధరలేమో పెరగబట్టె – జీతాలూ పెరగవాయె

తనిఖీలు ఎక్కువయ్యె – రికార్డులు బరువాయె

అభద్రమైన బతుకు – టెన్షన్లు ఎక్కువయ్యె” … అంటూ తమ వాస్తవ కష్టాలనూ వివరించారు.

అలాగే, అంగన్వాడీల సమ్మెకు ప్రజల నుంచి మద్దతు గట్టిగానే లభిస్తోంది. దీనిని ప్రతిబింబిస్తూ ఐద్వా నాయకురాలు గౌరి అల్లిన పాట బుడిబుడి నడకల అంగన్‌వాడీ పిల్లాడిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

”మా ఆయమ్మ నాకూ తుమ్మేతో

బువ్వ తినిపించింది తుమ్మేత

మూతి తుడిసిందమ్మ తుమ్మేత

ముడ్డి కడిగిందమ్మ తుమ్మేత

నేను జల్లిన ఎంగిల్ని తుమ్మేతో

ఆయమ్మ తుడిసింది తుమ్మేతా”

….

”మా టీచరమ్మా తుమ్మేతో

పాట నేర్పిందీ తుమ్మేతా

బొమ్మలు చూపింది తుమ్మేతో

ఆట ఆడించింది తుమ్మేతా

బాగా తినమందీ తుమ్మేతో

బలంగా అవ్వమంది తుమ్మేతా..”

ఈ పాట కూడా అమ్మ తరువాత అమ్మలా అంగన్‌వాడీ ఆయమ్మలు, టీచరమ్మలూ పిల్లలకు చేస్తున్న సేవలను చక్కగా వివరిస్తోంది.

”వందనాలమ్మా నీకూ వందనాలమ్మా” అనే సినిమా పాట ఇప్పుడు అంగన్‌వాడీల గొంతులో ఉద్యమ గీతంగా మారింది. ఈ పాట వింటే జగనన్న గుండె కరగక మానదా అనిపించేలా కార్యకర్తలు సున్నితంగా శ్రావ్యంగా ఆలపించారు.

”అడుగుతున్నామూ జగనన్నా….

అడుగుతున్నామూ

మా తోడు – నువ్వుంటవనూకున్నాం

మా దారి – నీదేనని అనూకున్నాం

మోసపోయామూ జగనన్నా…

మోసపోయామూ

ఆదుకుంటావనుకున్నాం జగనన్నా…

చేరదీస్తావనుకున్నాం

నిత్యవసర ధరలూ… జగనన్నా

పెంచుతూ పోయావ్‌ జగనన్నా

మాకిచ్చే జీతంతో ఓ జగనన్నా

ఒక పూట తిని చూడు ఓ జగనన్నా

రోడ్ల పాలయ్యాం జగనన్నా

మేమూ అప్పుల్లో ఉన్నాం

అమలు చేయన్నా

కనీస జీతం అమలు చేయన్నా

మారాలి అన్నా .. నీ మనసూ మారాలి అన్నా ” అంటూ ఈ పాట సాగింది. అంతే కాదు; ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని, అలాకాక బెదిరిస్తే బెదిరేది లేదని ఆఖరున తేల్చి చెప్పారు.

”నీ బెదిరింపులకు… జగనన్నా… బెదిరేది లేదు

సిఐటియు జెండ – మాకూ అండగుండగ

హక్కులు సాధించ కదులుతామన్నా” అని స్పష్టం చేశారు.

”ఊఁ అంటావా మావా ఊఁఊఁ అంటావా …” అన్న పాట కూడా ఇప్పుడు పోరు పాటైపోయింది. ఈ పాట విని గుంటూరు సమ్మె శిబిరంలో నవ్వుల పువ్వులు విరబూశాయి. ఏ తాళమైనా మా రాగం కలిపేస్తాం.. పోరు పాటగా మార్చేస్తాం అంటూ అంగన్‌వాడీలు ఉత్సాహంగా సమ్మె శిబిరంలో నవ్వులు పూయించారు.

ఊఁ అంటావా జగను –

ఊఁఊఁ అంటావా జగను

నువ్వు ఊఁఊఁ అంటే గనక మేము

ఉగ్రరూపం దాల్చుతాం జగను

టిక్కు టిక్కు టిక్కూ మంటూ ఇన్నాళ్లూ బటన్‌ నొక్కేవ్‌

ఇకపై టైం మాది ఇవిఎం బటన్‌ మేం నొక్కుతాం” అని ఈ పాటలో హెచ్చరించారు.

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సమ్మె శిబిరలో ‘జగన్‌ గోవిందా… గోవిందా’ బాణీలో పాట కూర్చి పాడారు. గుంటూరు జిల్లాలో సమ్మెకు మద్దతుగా అంగన్వాడీలు, కేంద్రాలకొచ్చే పిల్లల తల్లులు కోలాటం ప్రదర్శించారు. పల్నాడు జిల్లా అమరావతిలో ‘భద్రాచలం’ సినిమాలోని ఒకటే జననం.. ఒకటే మరణం పాటకు కోలాటం ఆడారు.

అంగన్వాడీల సమస్యలు, విన్నపాలు, నినాదాలే పాటలుగా మారుతున్నాయి. ఈ కళారూపాలకు అన్నిటికీ కవులు వారే. సంగీత, నృత్య దర్శకులూ వారే. వారి పాటకు కాగితం, కలం అక్కర్లేదు. ”నువ్వో పదం, నేనో పదం కలిపి పాట కట్టేద్దాం.” అన్నట్టు అవలీలగా పాటలు కూర్చి, గానం చేస్తున్నారు. పాటైనా, కవితైనా, ఇతరత్రా ఏ కళారూపమైనా ప్రజల నుంచే పుడతతాయి. ప్రజల ఆశల, ఆకాంక్షల కేతనాలై రెపరెపలాడతాయి. ఇప్పుడు అంగన్వాడీ సమ్మె శిబిరాలను పరికిస్తే – ఆ దృశ్యమే కనిపిస్తోంది. పోరాటానికి పాట ఏ విధంగా ఆయుధమవుతుందో, ఏవిధంగా ఆసరాగా నిలుస్తుందో తెలుస్తోంది. ఈ పోరాటానికి కవులూ రచయితలూ కళాకారులూ కూడా తమ కలాల ద్వారా, గళాల ద్వారా సంఘీభావం తెలపటం చాలా అవసరం.

               – ఎల్‌.శాంతి 76800 86787

పాట ఒక ఆయుధం ..

            పనీ పాటా అనే రెండూ జంటగా ఉంటాయి. పది మంది కలిసి పనిచేస్తున్నప్పుడు, పదిమంది ఒకే ప్రయోజనం కోసం పాటు పడుతున్నప్పుడూ – ‘పాట’ దానికదే పుట్టుకొస్తుంది. పదిమంది కలిసి నడవడమే ‘ఆట’గా పరిణమిస్తుంది. పాట… హాయిగా అలరించి, ఆనందాన్ని ఇవ్వగలదు. బిగిసిన పిడికిలై పెను నిద్దుర వదిలించనూ గలదు. ప్రజాకాంక్ష గెలిచిన చోట అది ఆనంద తాండవవుతుంది. అన్యాయం తలెత్తిన చోట అగ్గిరవ్వై రగులుతుంది.

‘జజ్జనకరె జనారే జనకు జనా జనారె… జజ్జనకరె

జజ్జనకరె జజ్జనకరె జనారే…’ అన్న రాగం భూసామి

గుండెను దడదడ లాడిస్తే … ”బండెనక బండి గట్టీ…

పదహారు బళ్లు గట్టీ… ఏ బండ్లో పోతవు కొడకో” అన్న గానం

నైజాము నవాబును దౌడు తీయించింది. ”హైలెస్సో..

హైలెస్సా… హైలెస్సో.. హైలెస్సా” అన్న హుషారు రాగం

శ్రమజీవి కష్టాన్ని మైమరపించింది.

➡️