వేగుచుక్క

Dec 3,2023 13:30 #Sneha

               సాయం సంధ్య వేళ. ఆ నగరానికి పశ్చిమాన ఉన్న ఎత్తయిన కొండమీద సుధాకరం ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కొండపైనున్న పెద్ద బండరాయి మీద ఓ ‘ప్రశ్న’ల్లే కూర్చుని ఉన్నాడు. నగరాన్ని అందులోని సమస్త ప్రాణికోటిని వెలివేసి, ఆకాశానికి మెడ చాచి ఎగిరేందుకు సిద్ధంగా కూర్చున్న పక్షిలా ఉన్నాడు. కొండగాలిని పీల్చుకుంటూ దూరంగా అస్తమిస్తున్న సూర్యుడ్ని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎన్నడూ లేనిది సుధాకరానికి సూర్యాస్తమయం ఆ క్షణమెందుకో కొత్తగా అనిపించింది. అంతకు ముందెప్పుడూ అంతెత్తున ఉన్న కొండ చివర బండరాయి మీద నుండి ఆ దృశ్యం చూడకపోవడం వల్ల కాబోలు! ‘మనం చూసే దృష్టి కోణం నుండే ఏదైనా కొత్తగా కనిపిస్తుందేమో, జీవితం కూడా అంతేనేమో!!’ అనుకున్నాడు.ఒక్క క్షణకాలం ఆ రోజు పొద్దున్న జరిగిన గలాటా సుధాకరం కళ్లల్లో కదలాడింది. జరిగింది తలుచుకుంటే నెత్తి మీద ఎవరో మెత్తని సుత్తితో బాదుతున్నట్టు తలనొప్పిగా అనిపించింది. పాలిథిన్‌ కవర్లో నుండి క్వార్టర్‌ బాటిల్‌, డిస్పోజబుల్‌ గ్లాసు, మంచినీళ్ల బాటిల్‌ తీసుకుని ఒబ్బిడిగా రాయి మీద పెట్టుకున్నాడు. మరోసారి చుట్టూ పరికించి చూసి, క్వార్టర్‌ బాటిల్‌ మూత తీశాడు భాస్కరం.సూర్యుడు పడమటికి ఇంకిపోయాక అప్పటికే నింగిలో నల్లగా కమ్ముకున్న మబ్బులు గొడుగులల్లే తేలుతున్నాయి. ఒక ‘లార్జ్‌ పెగ్‌’ కలుపుకుని మెల్లగా గొంతులో పోసుకోబోయి, ఓసారి తలొంచి కొండ కిందకి చూశాడు. దూరంగా ‘పేక మేడల్ని’ అమర్చిన మ్యూజియంలా ఉంది నగరం! మనుషులంతా బొమ్మలే, సృష్టి ‘దేవుడు ఆడే ఆట’ అనుకున్నాడు సుధాకరం. చిన్నగా తల పంకించి చుక్క మందునైనా గొంతులో పోసుకోకుండా గ్లాసు పక్కన పెట్టేశాడు. చల్ల చల్లని సాయంత్రపు గాలికి మనసు తేలికవుతూ ఉంది. తేలికపడ్డ మనసు తేలుతూ, తూగుతూ గతంలోకి పరుగులు తీస్తుంది.ొ

***

సుధాకరం నగరానికి వచ్చిన కొత్తల్లో- అగ్గిపెట్టెలాంటి చిన్న రేకుల షెడ్డులో నలుగురు కొలీగ్స్‌తో సర్దుకుని బతికేవాడు. అది కూడా వాళ్ళు పనిచేసే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్‌ చేసిన గది. సుధాకరానికి అప్పటికింకా పెళ్లవలేదు. వాళ్ళుండే గదిని ఆనుకుని ఇంకో ఐదు గదులు. కొన్ని ఫ్యామిలీలు, ఇంకొందరు బ్యాచిలర్సు. చుట్టూతా ఒంటిటుక ప్రహరీ గోడ. అన్నింటికీ ఒక్కటే కామన్‌ బాత్రూమ్‌. ఆ బాత్రూమ్‌ ముందు గంటల కొద్దీ నిరీక్షణ. ఇంకో పక్క ఆఫీస్‌ టైం టెన్షన్‌. కొత్తగా పెట్టిన ఓ ‘ట్రావెల్స్‌ కంపెనీ’ లో పని చేసేవాడు సుధాకరం. గుమస్తా ఉద్యోగం. ఒకప్పుడు గోదావరి, పంట కాలువల్లో ఈదులాడిన ఆ మనిషి చుక్క నీళ్లు ఒంటిమీద పడితే గంగలో మునిగినంత భాగ్యంగా ఫీలయ్యేవాడు. మెల్లమెల్లగా నగర జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకుంటున్న సుధాకరం, ఒక్కోసారి పచ్చని ఊరుని వదిలేసి వచ్చినందుకు నొచ్చుకునేవాడు. ఆనక పల్లె కడుపు మాత్రమే నింపుతుంది, పట్నం అయితే కడుపుతో బాటు జేబు కూడా నింపుతుందనుకుని అయిష్టంగానే నగరంలో పాతుకుపోయాడు.కాలం గడిచే కొద్దీ సుధాకరం పని చేసే సంస్థ మెల్లగా లాభాల్లోకి వచ్చింది. కుర్రాళ్ళకి కూడా కొద్దిగా జీతాలు పెరిగినారు. వాళ్ళకి ఇచ్చే కంపెనీ రూములు కూడా మారినై. కొంచెం అఫీషియల్‌ ఏరియాలో పెద్ద అపార్ట్మెంట్‌లో ‘సింగిల్‌ బెడ్‌ రూమ్‌’ ప్లాటు! గతం కంటే కొంచెం విశాలం, ఇంకొంచెం సౌకర్యం. రాత్రిళ్ళు భోజనం చేశాక మిద్దె మీదకి వెళ్తే, కొంచెం దూరంలో ఉన్న బస్తీలో ఇళ్లు.. కొన్ని చిన్నపిల్లలు ఆడుకుంటూ విరిచేసిన ఆటబొమ్మల్లా, ఇంకొన్ని అటూ ఇటూ విసిరేసిన ఎంగిలి ఇస్తరాకుల్లా కనిపించేవి. బస్తీలో జనం పుట్టలో నుండి బయటికి వస్తున్న చెదపురుగుల్లా కనిపించేవారు. అలా చూస్తూ అపార్ట్మెంట్‌ మిద్దె మీద నిలబడ్డ సుధాకరానికి ఆ క్షణం తానొక్కడే ఏనుగు అంబారీ ఎక్కి, ఊరేగుతున్నంత ఆనందం కలిగేది. ఆకాశంలో చుక్కలన్నీ ఆ మిద్దె మీద నుండి తమని తుంచుకోమని కిందకి వంగిన మల్లెల్లా తోచేవి. పెళ్ళైతే ఇలాంటి అపార్ట్మెంటుల్లోనే సంసారం పెట్టాలనుకునేవాడు. పక్క ప్లాటుల్లో ఉండే ఆడోళ్ళ మాదిరిగా, తను చేసుకున్న అమ్మాయి కూడా నిత్యం సంపెంగరేకులా నవనవలాడుతూ, మత్తెక్కించే పరిమళంతో గుమగుమలాడాలని కలలు కనేవాడు. తను కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకుని, పసలపూడి వంశీ గారి కథల్లో గొప్పగా చెప్పే పిఠాపురం నూర్జహాన్‌ సెంటుని ఒంటికి అద్దుకుని, చుక్క చెమట పట్టని ఉద్యోగం వెలగబెట్టాలని కలలు కనేవాడు.సుధాకరం నగరానికి వచ్చిన మూడేళ్ళకి చెల్లి పెళ్లి అయ్యింది. ఊళ్ళో ఉన్న ఎకరంన్నర పొలంలో అరెకరం కట్నంగా ఇచ్చి, పెళ్లి ఖర్చులకని కొంత అప్పు చేసి ఆ పిల్ల పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. అరెకరం పోగా సుధాకరం వాటాకి ఇంకా ఎకరం మిగిలింది. చెల్లి పెళ్ళైన ఏడాదికి సుధాకరానికి పెళ్ళి కుదిరింది. ఒకప్పుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ మనిషి. పరిస్థితులు అనుకూలించలేదు. ఆదర్శాన్ని తుంగలో తొక్కి, పెళ్లి ఖర్చుల కోసమైనా కట్నం తీసుకోక తప్పలేదు. పిల్ల పేరు వాసంతి. మనిషి వసంతంలా ఉండేది పెళ్ళైన కొత్తల్లో. బి.ఇడి చదివింది. డి.యస్సీ నోటిఫికేషన్‌ కోసం చూస్తుండగానే పెళ్లైపోయింది. చదువుకున్న అమ్మాయి అయితే టౌన్లో వేన్నీళ్ళకి చన్నీళ్ళ సాయంగా ఉంటుందని చెప్పి మరీ సుధాకరాన్ని ఒప్పించి, పెళ్ళి చేశాడు వాళ్ళ నాన్న.ఆషాఢం వెళ్ళిపోయాక వాసంతిని తీసుకొద్దామని రూముల కోసం వెతికాడు సుధాకరం. అన్నాళ్ళు ఊహల్లో బతికిన ఆ మనిషి, పెళ్లయ్యాక తొలిసారిగా వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ఉక్కిరి బిక్కిరైపోయాడు. అతడు కలలుగన్న అపార్టుమెంట్లలో ప్లాట్లు అతడికొచ్చే జీతానికి అందని ద్రాక్షే అయ్యాయి. బస్తీల్లో రేకుల షెడ్ల ‘రెంటు’లు కూడా అతని జీవితాన్ని, జీతాన్ని ఎగతాళి చేశాయి. చివరాఖరికి స్లమ్‌ ఏరియాలోని ఆ రేకుల షెడ్లే గతయ్యాయి. రెండు మూడు పోర్షన్లకి కలిపి ఒకటే కామన్‌ బాత్రూమ్‌. కొన్నాళ్లపాటు అపార్ట్మెంట్‌ కల్చర్‌కి అలవాటుపడ్డ ప్రాణం బస్తీలో ఉండేందుకు గిలగిల్లాడింది. రోజూ రాత్రుళ్ళు భోజనాలయ్యాక సుధాకరం బస్తీలో షెడ్డు అరుగు మీద కూర్చుని, దూరంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్‌ని తదేకంగా చూసేవాడు. ఎప్పటికీ అందని చందమామల్లే తోచేవి అవి. ఆ అపార్టుమెంట్లో మిద్దెపై నుండి వాడెవడో తననిప్పుడు ఎలా చూస్తూ ఉన్నాడో అన్న భావన గుండెని మెలిపెట్టేసేది. వాసంతి కూడా నగరంలో ఆ బస్తీ వాతావరణానికి అంత తొందరగా సర్దుకోలేకపోయింది. చీకటి పడితే చాలు.. బస్తీ కుక్కల అరుపులతో దద్దరిల్లిపోయేది. తాగుబోతుల వీరంగంతో గుండెలు గుల్లయిపోయేవి. బస్తీ మధ్యలో నుండి అనకొండలా మెలికలు తిరుగుతూ పోయిన ‘నాలా’లో నుండి గాలివాటంగా వచ్చే కుళ్ళు కంపు కడుపులో పేగుల్ని మెలిపెట్టేసేది. రాత్రుళ్ళు ఆ కంగాళీతో అదురు బెదురుగా కన్ను మూతపడిందో లేదో తెల్లగా తెల్లారకుండానే బస్తీలో నీళ్ల కుళాయిల దగ్గర ముష్టి యుద్ధాల కర్ణ కఠోరపు ధ్వనులు. ఆడంగుల వీరవిహారాలు, వికారపు మాటలు.. అంతకుముందే బస్తీలో బతికిన సుధాకరానికి అవన్నీ కొత్తగా ఏమీ అనిపించలేదుగానీ ఆ జనాల మధ్యలోకి వెళ్లాలంటే వాసంతి హడలి సచ్చేది. బస్తీకి వొచ్చిన కొత్తల్లో ప్రతిరోజూ సుధాకరమే నీళ్ల కుళాయి దగ్గర ఒకరిద్దరు ఆడోళ్లని బతిమాలి, బామాలి ఒకట్రెండు బిందెలు తెచ్చుకునేవాడు. వాసంతి వైభోగాన్ని చూసి బస్తీల్లో ఆడోళ్ళంతా వాసంతిని చూసి ‘తిప్పులాడి’ అంటూ మూతి మూడు వంకర్లు తిప్పేవాళ్లు. వాసంతి నొచ్చుకునేది. ఓ రోజు ఆ ఆడోళ్ళ వెటకారపు మాటలు సుధాకరం చెవుల్లో పడ్డాయి.ఆ రోజు రాత్రి పక్కలోకి చేరుతూ ‘నీకేమైనా మంచి ఉద్యోగం దొరికితే మంచిరూమ్‌కి మారదాంలే వసూ!’ అన్నాడు. వాసంతి ఏం మాట్లాడకుండానే అతడి మీద చెయ్యేసింది. ఓ రోజు ప్రెయివేట్‌ స్కూల్‌లో ఇంటర్వ్యూకి వెళ్లిన వాసంతి నగరంలో తను ఉద్యోగం చేయలేనని ఖరాఖండిగా చెప్పేసింది. తెలుగు మీడియంలో చదివిన తను ఇంగ్లీష్‌ మీడియంలో పాఠాలు చెప్పడం వల్లకాని పని అని తెగేసి చెప్పేసింది. ‘అంత చదువూ చదివాక టీచర్‌ ఉద్యోగం తప్ప, ఇంకేం చేయలేనని అది కూడా గవర్నమెంట్‌ ఉద్యోగమైతేనే’ అని కుండబద్దలు కొట్టేసింది. గవర్నమెంట్‌ నోటిఫికేషన్‌ కోసం చూసి చూసి, సుధాకరం ఊసూరుమనిపోయాడు.కొంచెం కొంచెంగా వాసంతి బస్తీ ఆడోళ్లతో దోస్తీ కట్టింది. వాళ్లతో మెల్లగా కలిసిపోయింది. పెళ్లప్పుడు కొన్న కొత్త చీరలు సింగారాలతో కొన్నాళ్ళ పాటు బస్తీలో ఒక వెలుగు వెలిగిన వాసంతి.. మరి కొన్నాళ్లకి రంగెలిసిపోయిన ఆ చీరల్లోనే వెలవెలబోయింది. కాలం కరిగే కొద్దీ వాసంతిలో వసంతం కనుమరుగైపోయింది. రంగూ, పొంగూ కొండెక్కింది. కట్టూ, బొట్టు మారిపోయింది. పోనుపోనూ తను కూడా బస్తీ మనిషైపోయింది. కాస్తో కూస్తో చదువుకుని బళ్ళో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ ఇంట్లో పనులన్నీ అయిపోయాక వీధి అరుగు బండల మీద కూర్చుని, బస్తీలో ఆడాళ్ళతో ముచ్చట్లు పెట్టేది. గతమంతా చెప్పి, తెగ మురిసిపోయేది. ప్రస్తుతాన్ని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకునేది. ఇంట్లో ఏమీ లేనప్పుడు వాళ్ళదగ్గరే ఉప్పో, పప్పో చేబదులు తెచ్చుకునేది. ఉన్నప్పుడు తిరిగిచ్చేసేది. పోను పోనూ ఖాళీగా ఉండటం కష్టమనిపించి, సాయంత్రాలు బస్తీలోని నలుగురైదుగురు పిల్లల్ని పోగేసుకుని ఏమీ తీసుకోకుండా ఊరికే పాఠాలు చెప్పి, ఆ తృప్తితో మనసుని వెలిగించుకునేది. ఆ బస్తీ వాళ్ళ మనసుని కూడా గెలుచుకునేది. బస్తీ జనాలంటే ‘మనుషులు ముతకే గానీ మనసులు మెతక సుమీ!’ అనుకుంది. ఆ మాటే సుధాకరంతో అంది ఓరోజు. సుధాకరం ముఖం చిట్లించాడు. బస్తీ అన్నా, ఆ జనాలన్నా అస్సలు నచ్చరు సుధాకరానికి.పెళ్ళైన ఏడాదికే తల్లయిపోయింది వాసంతి. పసి పిల్లని సాకుతూ మనిషి వాడిన మల్లై పోయింది. పిల్లతో పాటే ఖర్చూ పెరిగింది. సుధాకరం పనిచేసే సంస్థ కాలంతో పాటు పెరిగి పెద్దదైపోయింది. కానీ సుధాకరం మాత్రం ఎదుగు బొదుగూ లేకుండా అక్కడే ఉండిపోయాడు.కంపెనీలు ఎదిగినంత తొందరగా అందులో పనిచేసే ఉద్యోగుల జీతాలు, జీవితాలు ఎదగవని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న సుధాకరం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉక్కిరిబిక్కిరై పోయాడు. ఎటు పోవాలో, ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మనిషికి.’టౌన్లో అంతగా బతకలేకపోతే ఊరొచ్చేరు రా!’ అన్న వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి సుధాకరానికి. ఆ ఆలోచనలో ఉండగానే ఓ రోజు ఊరి నుండి ఫోనొచ్చింది.’ఓరేరు పెద్దా! చెల్లి పెళ్లి ఖర్చుల కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయిరా! ఓ అరెకరం అమ్మేద్దాం అనుకుంటున్నాను. నువ్వేం అంటావ్‌?!’ అనడిగాడు వాళ్ళ నాన్న. సుధాకరం ఏమీ అనలేదు. ఏమన్నా అనకపోయినా పొలం అమ్మకం ఆగదని సుధాకరానికి తెలుసు. ఆ ఫోనొచ్చాక ఊరెళ్లిపోవాలన్న ఆలోచన మాత్రం వదులుకున్నాడు. కాకపోతే ఆ బస్తీ వొదిలేసి బయటకెక్కడికైనా పోవాలి అనుకున్నాడు. బస్తీకి వచ్చి, అప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయి.ఓ రోజు ఉన్నట్టుండి ఈ నెలాఖరుకల్లా బస్తీ వదిలి వెళ్ళిపోదామని వాసంతితో చెప్పాడు. ‘అయ్యో, ఇక్కడ మనకి అందరూ అలవాటైపోయారు కదండీ. కొత్తగా ఇంకోచోటికి అంటే అక్కడ జనాలు ఇంకెలా ఉంటారోనండీ!’ అంది.సుధాకరం వాసంతి వైపు తీక్షణంగా చూశాడు. ‘మనమెలాగూ మురికిపట్టుకుపోయాం. నా కూతురి జీవితమైనా మనలా కాకూడదు. ఈ జనాల మధ్య మురికిలో పెరక్కూడదు. అంతే! వచ్చే నెలాఖరుకల్లా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. అన్నీ సర్దిపెట్టు’ అని తెగేసి చెప్పేశాడు సుధాకరం. ‘ఎక్కడికి?’ వాసంతి అడిగింది. సుధాకరం దగ్గర సమాధానం లేదు. విసురుగా బయటకెళ్లిపోయాడు. ఓ ఆదివారం బస్తీ వదిలి షోకేసులో బొమ్మల్లాంటి అపార్ట్మెంట్ల మధ్య రూమ్‌ కోసం జల్లెడ పట్టాడు. అన్నీ ఐదారు అంతస్తుల బిల్డింగులే. ఇంకా పెద్దవి కూడానూ. వాటి మధ్యలో అక్కడక్కడా రెండు మూడు అంతస్తుల బిల్డింగులు. అక్కడేమైనా తన తాహతుకి తగ్గ రూము దొరుకుతాదేమోనని ప్రయత్నం చేశాడు. అతడి జీతానికంటే ఓ రెండు మూడు వేలు ఎక్కువే ఉంది రెంటు. ఓ అపార్ట్మెంట్‌ పార్కింగ్‌ ఏరియాలో ఇస్త్రీ చేస్తున్న ‘ఆసామి’ని అడిగేడు- ‘అన్నా! ఇక్కడేమైనా తక్కువలో రూములు దొరుకుతాయా?!’ అని. సుధాకరాన్ని ఎగాదిగా చూశాడు ఆ మనిషి.’అదిగో ఆ ఎదురుగ్గా ఉన్న మూడంతస్తుల బిల్డింగ్లో మొన్నే మానేశాడు ‘వాచ్‌మెన్‌’ పని ఉందేమో అడిగి చూడు’ అనేశాడు. ‘వాచ్‌మెన్‌ డ్యూటీ కాదన్నా.. రూమ్‌ కావాలి’ అన్నాడు సుధాకరం కాస్తంత బిడియపడుతూ.’అదిగో…ఆ ఎదురుగ్గా చెట్టు కింద సిగెరెట్‌ కాలుస్తున్నాడే.. ఆ మనిషే ఆ బిల్డింగ్‌ ఓనరు. ఓ పాలి అడిగిచూడు. ఆ గది అద్దెకిస్తాడేమో!’ అనేసి తల అటుతిప్పేశాడు ఆ మనిషి. ఆ చెట్టు కిందున్న మనిషి పక్కనున్న ‘డాబర్‌ మెన్‌’ డబ్బున్నోళ్ల అహంకారాన్ని కళ్ళ నిండుగా నింపుకుని గుర్రుమంటూ సుధాకరం వైపు చూసింది. సుధాకరం భయపడుతూనే వెళ్ళాడు ఆ మనిషి దగ్గరకి. ‘డాబర్‌ మెన్‌’ మొరిగింది. బిల్డింగ్‌ ఓనర్‌ వారించాడు. సుధాకరం భయపడుతూనే విషయం చెప్పాడు. బిల్డింగ్‌ ఓనర్‌ నోరు తెరిచాడు. ‘అద్దె ఆరువేలు. తాగి తందనాలు ఆడితే ఊర్కొనేది లేదు. వొచ్చేపోయే చుట్టాలంటే అస్సలు కుదరదు’ కచ్చితంగా చెప్పేశాడు ఆ ఇంటి ఓనరు. కుక్క అరుపు, ఓనరు హెచ్చరింపు ఒకేలా వినిపించాయి సుధాకరానికి. బుద్ధిమంతుడిలా తలాడించాడు సుధాకరం.బస్తీలో రూమ్‌ ఖాళీ చేసి, సామాన్లు ఆటోలో ఎక్కిస్తుంటే పక్క పోర్షన్‌లో ఉండే హుస్సేన్‌ వచ్చి సాయంగా ఓ చెయ్యేశాడు. ‘సార్‌! మీలాంటి చదువుకున్నోళ్ళు మా బస్తీ వదిలేస్తుంటే చానా బాధగా ఉంది సార్‌. మేడం గారి దయవల్ల సర్కారీ బళ్ళో అక్షరం ముక్కైనా రాని మా పిల్లోళ్లు ఇప్పుడిప్పుడే నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటున్నారు. ఏ పొద్దూ పిల్లల్ని ఏ పనికో పాటకో పొమ్మనే మా ఇంటిది మీ వల్ల పిల్లల చదువుల విలువెంతో తెలుసుకునింది. మీలాంటోళ్ళు బస్తీలో ఉండాలి సార్‌’ అనేసి ముఖం దిగాలుగా పెట్టుకున్నాడు. ఇంతకముందెప్పుడూ మాట వరసకైనా పలకరించేటోడు కాదు ఆ మనిషి. నిజం చెప్పాలంటే ఆ మనిషి ఆహార్యం నచ్చక సుధాకరమే పలకరించే అవకాశం ఇవ్వలేదెప్పుడూ. చుట్టుపక్కల ఆడోళ్ళు వాసంతిని చుట్టుముట్టేశారు. ఒకరిద్దరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. ఆటో బయల్దేరుతుంటే ఇంటి ఎదురుగా ఉండే ‘టిఫిన్‌ బండి’ మల్లేషు వచ్చి పునుగులు, బజ్జీలు కట్టిన పొట్లాల కవరిచ్చి ‘సార్‌! మీరు టిఫిన్‌ తినేటప్పుడు రాజకీయాల కుళ్ళు గురించి, చదివిచ్చే వెలుగు గురించి చెబుతుంటే అలాగే వినబుద్ధేసేది సార్‌. మీలాంటోళ్ళు వెళ్లిపోతే బస్తీలో మంచి, చెడు గురించి చెప్పేది ఎవరు సార్‌.. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి సార్‌!’ అంటూ వాసంతి ఒడిలో ఉన్న పిల్ల బుగ్గ పుణికి, ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళు తనని ‘సార్‌!’ అని సంబోధిస్తుంటే సుధాకరం మనసులో ఎక్కడో చిన్నపాటి సంతోషం. గుండె కించిత్‌ గర్వంతో ఉప్పొంగింది.

***

ొొొకొత్తింటి ముందు పచ్చని చెట్లు. విశాలమైన రోడ్లు. ఎదురింటి ప్లాట్ల బాల్కనీల్లో మోడ్రన్‌ డ్రెస్సుల్లో పసుపు, మైనం కలగలిపి చేసిన బొమ్మల్లా వెలిగిపోతున్న పసుపుపచ్చని జనాలు. సుధాకరం రూము, సెల్లార్‌లో మెట్ల పక్క గది. చిన్నదే అయినా చిన్నపాటి అల్మెరాలు, సన్‌సైడ్‌లతో ఒబ్బిడిగా ఉంది గది. ఆ గది పక్కనే బాత్రూమ్‌. ‘హమ్మయ్య!’ అనుకున్నాడు సుధాకరం. ఆ అపార్ట్మెంట్‌ కల్చర్‌లో బతికితే పెద్దోళ్ళకి సభ్యత, సంస్కారాలు అలవోకగా వొచ్చేస్తాయని, పిల్లలు వాళ్ళ పిల్లతో ఆడుతూ ఉంటే కాసిన్ని తెలివితేటలు, మంచి నడవడిక అబ్బుతాయని గట్టిగా నమ్మేవాడు సుధాకరం. అందుకే కావాలనే అక్కడి రూమ్‌కి మారాడు. అఫీస్‌లో అడ్వాన్స్‌ అడిగి తెచ్చిన డబ్బుల్తో రోజు వారీ కోసమని తక్కువలో వాసంతికి ఓ రెండు చీరలు, బుజ్జి దానికి రెండు గౌన్లు, తనకో షార్టు, టీషర్టు కొనుక్కు తెచ్చుకున్నాడు సుధాకరం. రోమ్‌కి వెళ్ళినప్పుడు రోమన్‌లా ఉండాలని సుధాకరంకి ఎక్కడో చదివినట్టు గుర్తు!కొత్తింటికొచ్చిన రోజే సెల్లార్‌ గేట్‌ స్పేర్‌ తాళం చెవి సుధాకరానికి ఇచ్చాడు ఇంటి ఓనరు.’నమ్మకమేమో!’ అనుకున్నాడు సుధాకరం. సరిగ్గా ఆ రాత్రి పన్నెండు గంటలకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్‌ రింగయ్యింది. కొత్త నెంబర్‌! ఎవరోనని ఎత్తితే ‘బాబూ.. కాస్త గేటు తియ్యవా?!’ పరిచయం లేని గొంతులో కాస్త అభ్యర్థన. తాళం తీసి గేటు తీయగానే లోపలకొచ్చింది ఓ ఖరీదైన కారు. ‘ఓ బాబూ! నేను పై ప్లాట్‌లో అద్దెకి ఉంటాను. పొద్దునడిగితే బిల్డింగ్‌ ఓనరిచ్చాడు నీ నెంబరు. ఆఫీస్‌ నుండి వచ్చేసరికి అప్పుడప్పుడు కొంచెం లేటవుతుంది. ఏమనుకోకుండా గేటు తీసి పెట్టవోరు!’ సుధాకరం సమాధానం కోసమైనా చూడకుండా మెట్లెక్కి పైకెల్లిపోయాడా పెద్ద మనిషి. గేటు తియ్యమనడం కంటే ‘ఏవోరు’ అన్న ఏకవచన సంబోధనే కాస్త ఇబ్బంది పెట్టింది సుధాకరాన్ని. ఈ డబ్బున్నోళ్లంతా పేదోళ్లందరిని ‘ఏరా.. ఒరేరు.. ఏవోరు’ అని పిలవడానికి భూమ్మీద పడగానే దత్తత తీసేసుకుంటారు కాబోలు అనుకున్నాడు సుధాకరం. ఓనరు తాళంచెవి చేతికి ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటో అప్పుడే అర్థమైంది. ఒకరోజు జొమాటో, ఇంకోరోజు స్విగ్గీ, మరొకరోజు అమెజాన్‌. పైప్లాట్లలో అద్దెకుండే వాళ్ళ అడ్రెస్స్‌ కన్ఫర్మేషన్‌ కోసం రోజూ తలుపు కొడుతూనే ఉన్నారు. బిల్డింగ్‌ పై ప్లాట్‌లలో ఓ పది కుటుంబాలు అద్దెకుంటాయి. ప్రతిరోజూ రాత్రిళ్ళు బయటకెళ్ళొచ్చి, ఎవరో ఒకరు ఫోన్‌ కొడుతూనే ఉన్నారు- గేటు తీయమని! వీకెండ్‌ రోజుల్లో అయితే రెండు, మూడుసార్లు లేవాల్సొచ్చేది. అంత చేసినా ఏ ఒక్కరూ మాట వరసకైనా మాట కలపరు. పగటిపూట ‘సెల్లార్‌’ లో ఆడుకుంటున్న బుజ్జిదాన్ని చూసి, ముచ్చటపడుతున్న పిల్లల్ని సైతం కలవనీయకుండా విసురుగా లాక్కుపోతారు. వాసంతి ఒక్కత్తే అయిపోయింది బిల్డింగ్‌లో. ఓ రోజైతే బిల్డింగ్‌లో ఒకామె ఓ ప్లాస్టిక్‌ కవర్‌ తీసికొచ్చి ఇచ్చింది. కవర్‌ నిండా సగం సగం తినేసి వొదిలేసిన కేక్‌, బిస్కెట్‌ ముక్కలు. సగం సగం కొరికి వదిలేసిన చాక్లెట్‌లు. వాసంతి కళ్ళల్లో కన్నీళ్లు గిరుక్కున తిరిగాయి. ‘ఏమనుకుంటున్నారండీ వీళ్లంతా! ఏమీ ఇవ్వకపోయినా బాధ అన్పించదు. ఇలా సగం తినేసిన ఎంగిలి పెడితే…’ అంటూ తెగ బాధ పడిపోయింది. సుధాకరం వాసంతిని దగ్గరకి తీసుకున్నాడు.కాలం గడుస్తుంది. సుధాకరం ఆఫీస్‌కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. బస్తీకి ఇక్కడికి ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతడికి. ఆ తేడా ఏంటో తెలియడం లేదు. వాసంతికి మాట్లాడే మనుషుల్లేక పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఎక్కడైనా డ్యూటీకి పోదామంటే పిల్ల చిన్నదాయే. ‘ఈ ఏడాది పిల్లని కాన్వెంట్లో వేసేద్దాం. ఏదైనా డ్యూటీకి పోతే కాస్తంత పొద్దుపోతుంది నీక్కూడా!’ అన్నాడు సుధాకరం. నిలువునా తలాడించింది వాసంతి.

***

ొొొసుధాకరం వాళ్ళు ఆ రూంలోకి వచ్చి నెల రోజులు దాటేసింది. రోజూ ఏదో పంచాయితీనే అక్కడ. ఈ రోజు పొద్దున్న కూడా బిల్డింగ్‌ ఓనర్‌తో ఓ చిన్నపాటి యుద్ధం.సుధాకరం దుమ్ము పట్టేసిన బైక్‌ని తుడుస్తూ కూర్చున్నాడు సెల్లార్‌లో. మూడేళ్ళ బుజ్జిది బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆడుకుంటుంది అక్కడే. గదిలో వాసంతి వంట చేస్తుంది. వాకింగ్‌కి వెళ్లొచ్చి, వీధిలో ఎవరితోనో బాతాఖానీ పెట్టాడు బిల్డింగ్‌ ఓనరు.కర్కశత్వాన్ని కళ్ళ నిండా నింపుకుని, ఆయన పక్కనే అటూ ఇటూ తిరుగుతుంది ‘డాబర్‌ మెన్‌’. వీధిలో నుండి అప్పుడప్పుడూ సెల్లార్‌ వైపు చూస్తూందది. సుధాకరం చూస్తూనే అలర్ట్‌గా ఉన్నాడు.’ఏవండీ ఫోన్‌ ! మీ మేనేజర్‌ గారనుకుంటా’ వాసంతి పిలిచింది. కాస్త తొందర్లో ఫోన్‌ తీసుకుని చిటికెలో వచ్చేద్దామని లోపలికెళ్ళాడు ఆ మనిషి. అంతే.. ఒక్కసారిగా కెవ్వుమంది సెల్లార్‌లో పాప. ఒక్క ఉరుకులో బయటకొచ్చేలోపే పాప జబ్బని పట్టేసింది ‘డాబర్‌ మెన్‌’. పక్కనే ఉన్న కర్రని తీసి, వెనకా ముందు చూడకుండా కుక్క వీపు మీద బలంగా ధబీధబీమని దెబ్బలేశాడు సుధాకరం. ‘డాబర్‌ మెన్‌’ పాపని వదిలేసి సుధాకరం మీదకి ఎగబడింది. ప్రాణాలకి తెగించాడు సుధాకరం. సింహమల్లే విరుచుకుపడ్డాడు. ఓ రెండు దెబ్బలు పడగానే, లేని తోకని ముడిచింది ‘డాబర్‌ మెన్‌’. బిల్డింగ్‌ ఓనరు గుండె పగిలింది. వీపు మీద కర్ర దెబ్బ బలంగా పడేసరికి కుక్క కెవ్వుమని అరుస్తూ మెట్లపైకి పరుగుతీసింది. పాప గుక్క పట్టి ఏడుస్తూనే ఉంది. కుక్క కరిచిన చోట ఎర్రగా కందిపోయి రెండు గాట్లు పడి, ఎర్రగా రక్తం దారకట్టింది. వాసంతి పిల్లని ఒళ్ళోకి తీసుకుని, గుడ్డతో గాయాన్ని వత్తి పట్టి కళ్ళ నిండుగా కన్నీరు పెట్టుకుంది. ‘కుక్కని చంపేద్దామనుకున్నావా?!’ బిల్డింగ్‌ ఓనరు గొడవెట్టుకున్నాడు సుధాకరంతో. ‘పిల్లని చంపేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా?!’ వాసంతి నిప్పులు తొక్కిన కోతై పోయింది. మాట మాటా పెరిగింది. పెద్ద గొడవే అయ్యింది. పైన అద్దెకుండే వాళ్ళు కిందకొచ్చారు. ఎదురింటి అపార్టుమెంట్లో వాళ్ళు బాల్కనీలో నుండి కొందరు, గేటు ముందుకొచ్చి ఇంకొందరు మెడలు సాగదీశారు. అందరూ చోద్యం చూస్తుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఓ అరవై ఏళ్ళ వయసున్న ఓ పెద్దావిడ కళ్ళల్లో మాత్రం జాలి మంచులా కురిసింది. కాకపోతే బిల్డింగ్‌ ఓనరంటే ఏదో తెలియని భయం ఆవిడ ముఖాన్న మబ్బులా కమ్మేసింది. ‘ఇక్కడ కూడా కొద్దో గొప్పో మనసున్న మనుషులుంటారన్న మాట!’ అనుకున్నాడు సుధాకరం. బిల్డింగ్‌ ఓనర్‌ వాలకం చూశాక అక్కడ ఉండాలంటే కంపరమేసింది.వాసంతిని, బుజ్జిదాన్ని తీసుకుని సెల్లార్‌లో నుండి విసురుగా రోడ్డు మీదకి వచ్చేశాడు సుధాకరం. బుజ్జిదానికి కట్టు కట్టించి, ఇంజెక్షన్‌ ఇప్పించాడు. వస్తూ వస్తూ వాళ్ళిద్దర్నీ ఊరి బస్సెక్కించేశాడు సుధాకరం. ‘బైక్‌’ మీద పిచ్చిపట్టినట్టు ఎక్కడెక్కడో తిరిగాడు. జరిగింది గుర్తుకొస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి.గాయపడ్డ బుజ్జిదాన్ని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.’కాస్త ఏమరుపాటుగా ఉండుంటే బుజ్జిది ఏమయ్యేదో! ఇంకా అక్కడే ఉంటే ఏదో ఒకరోజు ఆ ‘బ్లడీ డాగ్‌’ బుజ్జిదాన్ని పొట్టన పెట్టేసుకుంటది!’ సుధాకరం బుర్రలో బాంబుల మోత. ఏం చేయాలో అర్థం కాక అస్థిమితంగా నగరం మొత్తం తిరిగి తిరిగి చివరాఖరికి ఒక క్వార్టర్‌ బాటిలు, మంచినీళ్లు తీసుకున్నాడు సుధాకరం. జనారణ్యానికి దూరంగా పశ్చిమాన అంతెత్తున్న కొండకింద బైక్‌ పార్క్‌ చేసి కొండెక్కాడు. కొండ చివరి అంచు వరకూ ఎక్కి, బండరాయి మీద కూర్చున్నాడు.. ఒక పెద్ద ‘ప్రశ్న’ల్లే!ొొొ

***

సన్నగా పడుతున్నాయి వాన చినుకులు. గాఢమైన ఆలోచనల్లో కూరుకుపోయిన సుధాకరం మెల్లగా తేరుకున్నాడు. మెల్లగా సందె చీకట్లు కమ్ముకుంటుంటే.. కళ్ళు నులుముకుని, తేరిపారా కొండ కిందకి చూశాడు. కొండ కింద పెద్ద పెద్ద భవంతుల ‘నగరం’ కూడా అంతక ముందెప్పుడో అపార్ట్మెంట్‌ మిద్దె మీద నుండి చూసిన ‘బస్తీ’లా చెల్లాచెదురుగా కనిపించింది. ప్రశ్నకి సమాధానం దొరికింది. ఏదో తత్త్వం బోధపడినట్టు తల కాస్త పంకించాడు. ‘నిజానికి బస్తీలో మురికి ఉండొచ్చేమోగానీ వాళ్ళ మనసు లైతే మురికి కాదు, కొంతమంది డబ్బున్నోళ్ల మనసు మాదిరిగా ఇరుకు కాదు. వాసంతి సాయంతో ఆ మురికి బస్తీలోనే ‘అక్షర యజ్ఞాని’కి శ్రీకారం చుట్టి, తెల్లతెల్లని పసి కలువల్ని వికసింప చేయాలనుకున్నాడు. బుజ్జిదాన్ని కూడా ‘కలువ కొలను’ లోనే ఉంచి, పెంచాలకున్నాడు. అనుకున్నదే తడవుగా కొండరాయి మీద నుండి ఠక్కున పైకి లేచి, నిటారుగా నిలబడినాడు సుధాకరం. ఇప్పుడా మనిషి, కొత్త ఉషోదయానికి ఆహ్వానం పలకడానికి కొండ చివర మొలిచిన నిలువెత్తు ‘వేగుచుక్క’ ల్లే మెరుస్తున్నాడు. సగం ఖాళీ అయిన క్యార్టర్‌ బాటిల్‌ని, నిండుగా ఉన్న మందు గ్లాసుని కొండరాయి మీద నుండి బలంగా తన్నేశాడు. ఇకపై సుధాకరానికి దాని అవసరం ఉండకపోవొచ్చు. విశ్వాసం నిండిన గుండెతో పిడికిల్ని గట్టిగా బిగించాడు. చురకత్తుల్లాంటి అడుగుల్ని ‘బస్తీ’ వైపు విసురుగా వేస్తూ అప్పుడే జ్ఞానోదయం అయిన యోగిలా కొండ దిగిపోయాడు సుధాకరం. హోరున కురుస్తుంది వాన. సుధాకరం ఆలోచనలకు మల్లే చినుకై మొదలైన వాన కుండపోతై కురుస్తూ నగరాన్ని ముంచేస్తుంది.

                                                                        – శ్రీను కుడుపూడి 8919262864

➡️