జీవిత బీమా పరిశ్రమ 44% పెరుగుదల

Jan 10,2024 11:11 #Lic
  •  ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసి టాప్‌
  •  డిసెంబర్‌లో 94 శాతం వృద్థి

ముంబయి   :  జీవిత బీమా నూతన ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసి దూసుకుపోయింది. 2023 డిసెంబర్‌లో జీవిత బీమా పరిశ్రమ 44 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. ఎల్‌ఐసి ఏకంగా 94 శాతం వృద్థిని సాధించింది. దిగ్గజ ఎల్‌ఐసి మార్కెట్‌ వాటాకు గండి కొట్టాలని భావిస్తున్న ప్రయివేటు సంస్థలకు పెద్ద షాకే.. నూతన బీమా ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసి దాదాపు రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. నూతన ప్రీమియం అనేది నిర్దిష్ట కాలానికి కొత్త పాలసీల నుండి పొందిన ప్రీమియంను సూచిస్తుంది. బీమా సంస్థల వృద్థికి కీలకం. గడిచిన నెలలో జీవిత బీమా పరిశ్రమ రూ. 38,583 కోట్ల విలువైన ప్రీమియంలను సమీకరించింది. ఇది 2022 డిసెంబర్‌లోని రూ.26,838.3 కోట్లతో పోలిస్తే 43.8 శాతం పెరిగిందని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది.

గ్రూప్‌ బిజినెస్‌లో అనేక రెట్లు వృద్థి చెందడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసి ప్రీమియంలు 93.8 శాతం పెరిగి రూ.11,858.5 కోట్ల నుంచి రూ.22,981.3 కోట్లకు చేరాయి. అదే సమయంలో ప్రయివేటు బీమా సంస్థల ప్రీమియంలు 4.15 శాతం పెరిగి రూ.14,979.8 కోట్ల నుంచి రూ.15,601.8 కోట్లుగా నమోదయ్యాయి. ఎల్‌ఐసి గ్రూప్‌ సింగిల్‌ ప్రీమియం వ్యాపారం 195 శాతం పెరిగి రూ. 5,966.9 కోట్ల నుంచి రూ.17,601.9 కోట్లకు చేరుకుంది. ప్రయివేటు బీమా సంస్థ అయిన ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు 20.73శాతం క్షీణించి రూ.4,606.8 కోట్లుగా నమోదయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎన్‌బిపి 3.26 శాతం పెరిగి రూ.2,842.9 కోట్లకు చేరుకుంది. మిగిలిన లిస్టెడ్‌ సంస్థల్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2.89 శాతం పెరిగి రూ. 1,497.3 కోట్లకు చేరుకోగా, మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 17.6 శాతం వృద్థితో రూ.1,213.9 కోట్ల ప్రీమియంలను వసూలు చేసింది.

➡️