అందమైన భాషతో అబద్ధాలు

 సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ప్రజాశక్తి -తిరుపతి సిటీ  :   ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అందమైన భాషతో అబద్ధాలు చెప్పారని, సార్వత్రిక ఎన్నికల కోసమే నరేంద్రమోడీ  ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. తిరుపతి నగరంలోని గంధమనేని శివయ్య భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉపాధి తప్ప… ఉద్యోగాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. పన్నుల వ్యవహారంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అయోధ్య అంశాన్ని లేవనెత్తడాన్ని ఆక్షేపించారు. లౌకిక రాజ్యమైన భారతదేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి, పార్లమెంటు భవన్‌ ప్రారంభోత్సవానికీ ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.  త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కన్నా హీనంగా గవర్నర్‌ ప్రవర్తిస్తున్నారన్నారు.  ఓ గవర్నరు ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అదానికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధమయ్యిందన్నారు. కోడి కత్తిశీను ఐదేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో ఉన్నప్పటికీ జగన్‌ సాక్ష్యం చెప్పడానికి వెళ్లక పోవడం బాధాకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, పెంచలయ్య, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️