అసత్యాలు, అర్ధ సత్యాలు!

Apr 13,2024 05:36 #Editorial

ఎన్నికల కోసం ఆపదమొక్కులు గురించి చాలా విన్నాం. కాని కమలనాథులు అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం తీవ్రమైన విషయం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కని నినదించి 32 మంది యువకిశోరాల ప్రాణ బలిదానంతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో వంద శాతం వాటాలనూ అమ్మాలనే లక్ష్యంతో 2021 జనవరి 27న వ్యూహాత్మకంగా కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానీ ఉక్కు కార్మికులు, రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించడమేగాక విశాఖలోని శ్రామిక జనావళి మద్దతుతో నిరంతరాయంగా సాగించిన ఉద్యమం ఫలితంగా కేంద్రం ఉక్కును అమ్మలేకపోయిందన్నది పచ్చి నిజం. వాస్తవాలను కప్పిపుచ్చి స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించడం కోసం వాటాలు అమ్మకుండా మెరుగ్గా నడిపించడానికి కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టినట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి ఇటీవల వ్యాఖ్యానించడం ముమ్మాటికీ ప్రజలను తప్పుదారి పట్టించడమే! కేంద్ర ప్రభుత్వంపట్ల విశాఖ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలను చల్లార్చడానికి చేసిన విఫలయత్నం తప్ప వేరు కాదు. ఇలాంటి అసత్యాలతో కార్మికులు, ప్రజలు మోసపోరని కాషాయ దళం గుర్తెరగాలి.
దేశంలోని ప్రైవేట్‌, పబ్లిక్‌ సెక్టార్‌ స్టీల్‌ప్లాంట్‌లన్నీ రెండేళ్లలో లాభాల్లో నడవగా విశాఖ ప్లాంట్‌ రెండేళ్ల నుంచి రూ.4వేల కోట్లకుపైగా నష్టాల్లోకి వెళ్లడానికి బిజెపి ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేముంది? దక్షిణకొరియా పోస్కోతో కేంద్రం ఎంఓయు చేసుకోవడం, మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను జిందాల్‌కు అప్పగించడం విశాఖ స్టీల్‌ను కారుచౌకగా అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే కదా! స్టీల్‌ ప్లాంటు అక్కడే ఉంటుందనీ భూములు ఎక్కడికీ పోవనీ గత మూడేళ్లుగా జివిఎల్‌ వంటి కొందరు బిజెపి నేతలు చెబుతూనేవచ్చారు. ప్రైవేట్‌కు అమ్మితే 22వేల ఎకరాల ప్లాంట్‌ భూములు రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకు మళ్లిపోతాయని చిన్న పిల్లవానికి కూడా తెలుసు. కనుక కమలనాథులు ఇప్పటికైనా మాయమాటలు మాని నూరుశాతం అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని, ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపు, తక్షణమే ఎన్‌ఎమ్‌డిసి నుంచి ముడి ఖనిజాన్ని సరఫరా చేయించడం వంటి చర్యలు చేపట్టాలి.
రాజధాని అమరావతి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం తాజాగా రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విషయంలో చిత్ర విచిత్ర విన్యాసాలకు పాల్పడడం తగని పని. రాష్ట్ర రాజధాని ఎక్కడో తేలిన తరువాతే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్‌బిఐ తాజాగా ఓ లేఖ రాయడం వంచనకు పరాకాష్ట. రాజధానిని విశాఖపట్నం తరలిస్తామన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ తప్పు పట్టలేదు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమనీ, తామేమీ చేయలేమంటూ హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. అంతేగాక రిజర్వుబ్యాంకు విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్దమై రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది. 2023 జనవరి 31న రాసిన లేఖలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం గురించి ప్రస్తావించారు. ఆ ఏడాది అక్టోబర్‌ 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన మరో లేఖలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరారు. ఎంత విస్తీర్ణం కావాలి, ఏయే సదుపాయాలుండాలన్నది సవివరంగా పేర్కొంటూ భవనాన్ని ఐదు సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని కోరారు. ఆర్‌బిఐ నుండి వరుసగా వస్తున్న లేఖల నేపధ్యంలో ఆ మేరకు విశాఖలో భవనాన్ని కూడా సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి. వాస్తవాలిలా ఉండగా రిజర్వుబ్యాంకు రాజధాని ఏదో ఖరారైతేనే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్‌బిఐ తాజాగా లేఖ రాయడం ఎవరిని మభ్య పుచ్చడానికి? కేంద్ర ప్రభుత్వ పెద్దల సలహా లేకుండా ఆర్‌బిఐ వైఖరి ఒక్కసారిగా మారడం సాధ్యమా? ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని కేంద్రం ఏనాడో గజిట్‌ ప్రకటించింది. పార్లమెంటులోనూ చెప్పింది. అయినా ఈ విన్యాసానికి పూనుకోవడం అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలని ఆందోళన చేస్తున్న రైతులను మభ్యపుచ్చడానికి తప్ప వేరేమీకాదు. రాష్ట్రంలో నిరంతర ఆందోళనల్లోవున్న కార్మికులను, రైతులను తప్పుదారి పట్టించే యత్నాలను విరమించుకొని వాస్తవాలు వెల్లడించాలి. లేకపోతే తెలివైన తెలుగు ప్రజలు కేంద్రానికి కంగు తినిపిస్తారు.

➡️