ఆ లేఖ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం : ఐలు

న్యూఢిల్లీ :   ఇటీవల 600 మంది న్యాయవాదుల బృందం సిజెఐకి రాసిన లేఖపై ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) ఆదివారం స్పందించింది. ఆ లేఖ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నమని వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అవినీతి బహిర్గతమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొంది. సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్‌ సాల్వే, ఆదిష్‌ అగర్వాలా సహా సుమారు 600 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌కి ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఆ లేఖ న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించేందుకు నిరంతరం పోరాటం చేసే బాధ్యతాయుతమైన న్యాయవాదులు, న్యాయవాదుల ఫోరమ్‌కు వ్యతిరేకంగా ఉందని ఐలు నేతలు, సీనియర్‌ న్యాయవాది, ఎంపి బికాస్‌ రంజన్‌ భట్టాచార్య, సీనియర్‌ న్యాయవాది పి.వి. సురేంద్రనాథ్‌లు పేర్కొన్నారు.

గతంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ మౌలిక సూత్రాలపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నప్పుడు ఈ న్యాయవాదుల బృందం మౌనం వహించిందని అన్నారు. బాధ్యతాయుతమైన పదవులను కలిగిన వ్యక్తులు న్యాయ సమీక్షపై దాడి చేశారని తెలిపారు. పార్లమెంటు ఆధిపత్యంతో కేంద్రం న్యాయవ్యవస్థ ప్రాథమిక నిర్మాణం, న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక పాత్రను పోషించాలని డిమాండ్‌ చేసిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో ప్రభుత్వం ప్రత్యక్ష జోక్యం చేసుకుందని ఐలు పేర్కొంది.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు ఉన్నత పదవులను కట్టబెట్టడంలో మునిగితేలుతోందని ఐలు పేర్కొంది. పలు సందర్భాల్లో కొలీజియంను అగౌరవపరిచే నిర్ణయాలు కూడా తీసుకుంటుందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోయ్‌ను   పదవీవిరమణ అనంతరం మోడీ ప్రభుత్వ రాజ్యసభకు నామినేట్‌ చేసిందని,  జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన ఆరువారాలలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారని ఐలు ఈ సందర్భంగా పేర్కొంది.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసుపై తీర్పు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి)లు ఇచ్చిన నివేదికలను వారు జీర్ణించుకోలేకపోతున్నారని  తెలిపింది.   నిరాధారమైన ఆరోపణలు, అసత్యపు రాతలతో కూడిన ఆ లేఖ దేశంలోని న్యాయవాదులందరి అభిప్రాయాన్ని సూచించదని పేర్కొంది. వారు దేశంలోని న్యాయవాదులందరికీ  ప్రాతినిథ్యం వహించరని పేర్కొంది.  న్యాయవ్యవస్థను రక్షించే పేరుతో వారు చేసిన ప్రయత్నం  వాస్తవాలను మభ్యపెట్టడం, కప్పిపుచ్చడమేనని పేర్కొంది. న్యాయవ్యవస్థ పరిరక్షకులుగా తమను తాము ప్రకటించుకున్న వారి లేఖ తప్పుడు కథనం, తప్పుదారి పట్టించే యత్నమని కూడా ఐలు స్పష్టం చేసింది.

➡️