సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం

  •  ఉద్యమాలకు తీరని లోటన్న పలువురు ఎమ్మెల్సీలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం తెలిపింది. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ తీర్మానాన్ని మండలిలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. 30 ఏళ్లపాటు ఉపాధ్యాయ ఉద్యమాల్లో యుటిఎఫ్‌ తరపున అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, సిపిఎస్‌ రద్దు, ఒపిఎస్‌ అమలు చేయాలని పాదయాత్ర చేయడంతోపాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేశారని చెప్పారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీకి ముందు యుటిఎఫ్‌లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సాబ్జీ పనిచేశారని, ఎస్‌టిఎఫ్‌ఐలో జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసికి కో-ఛైర్మన్‌గా చేశారని చెప్పారు. ప్రజాసంఘాలకు దన్నుగా నిలిచారని పేర్కొన్నారు. సిపిఎస్‌ రద్దు కోసం చేపట్టిన యాత్రకు నాయకుడిగా ఉన్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి మృతి బాధాకరమన్నారు. సాబ్జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరిపించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి సంబంధించిన కేసు వివరాలను శాసనమండలి ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. మండలి ఛైర్మన్‌ కొయ్యా మోషేను రాజు మాట్లాడుతూ.. సాబ్జీతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందన్నారు. అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు రైతులు, కార్మికులు, విద్యార్థుల తరపున పోరాటం చేశారని వివరించారు. ప్రమాద ఘటనను జిల్లా ఎస్‌పి, కలెక్టరు తనకు ఫోన్‌ ద్వారా తెలిపారని, తాను వెంటనే కెఎస్‌ లక్ష్మణరావుకు, మాజీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యంలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించానని చెప్పారు. సాబ్జీ మృతికి డిప్యూటీ ఛైర్మన్‌ మయన జకీయా ఖానమ్‌ సంతాపం తెలిపారు. ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి రఘువర్మ, కల్పలత రెడ్డి, అశోక్‌బాబు, పోతుల సునీత, పి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంవి రామచంద్రారెడ్డి, బిటి నాయుడు మాట్లాడుతూ.. సాబ్జీ మృతి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. మండలిలో అనేక సమస్యలను ప్రస్తావించారని చెప్పారు. సాబ్జీ ఆశయాలను తాము కొనసాగిస్తామన్నారు. సాబ్జీ మృతికి సంతాపంగా సభ్యులు కొద్ది నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఛైర్మన్‌ మోషేను రాజు సభను వాయిదా వేశారు.

➡️